ఈ వారం మార్కెట్లకు నావిగేటర్‌?!

ఈ వారం మార్కెట్లకు నావిగేటర్‌?!

ఈ వారం నుంచీ దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను ప్రధానంగా ఫలితాల సీజన్‌ నిర్దేశించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2017-18) క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌) ఫలితాలను ఈ వారం నుంచీ దేశీ కార్పొరేట్‌ సంస్థలు ప్రకటించనున్నాయి. అయితే ఫలితాలతోపాటు ఆర్థిక గణాంకాలు, బడ్జెట్ ప్రతిపాదనలు వంటి అంశాలు సైతం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సారి సార్వత్రిక బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది.
 

క్యూ3 షురూ
ఇప్పటికే లిక్కర్‌ సంస్థ జీఎం బ్రూవరీస్‌ క్యూ3 ఫలితాల ప్రకటనతో బోణీ కొట్టడం ద్వారా శుక్రవారం(5న) లిక్కర్‌ షేర్లకు లాభాల కిక్‌నిచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే వారం ప్రధానంగా సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజాలు టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌లతోపాటు ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ సంస్థ ఇండస్‌ఇండ్ క్యూ3 పనితీరును వెల్లడించనున్నాయి. ఇక గతేడాది ఇన్వెస్టర్లను మురిపించిన ప్రైమరీ మార్కెట్‌సైతం ఈ ఏడాదిలోనూ జోరందుకోనుంది. హైదరాబాద్‌ సంస్థ అపోలో మైక్రో సిస్టమ్స్‌ పబ్లిక్‌ ఇష్యూ 10న(బుధవారం) మొదలుకానుంది. గురువారం టీసీఎస్, ఇండస్‌ఇండ్‌, శుక్రవారం ఇన్ఫోసిస్‌ ఫలితాలు తెలియనున్నాయి.
 

జీడీపీ ఎఫెక్ట్?
శుక్రవారం(5న) మార్కెట్లు ముగిశాక ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక పురోగతి(జీడీపీ) వివరాలు ప్రకటించింది. 2017-18లో జీడీపీ 6.5 శాతం వృద్ధి సాధించవచ్చంటూ తొలి అంచనాలు విడుదల చేసింది. ఇది నాలుగేళ్ల కనిష్టంకాగా.. 2016-17లో ఆర్థిక వ్యవస్థ 7.1 శాతం వృద్ధి సాధించింది. పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) అమలు వంటి అంశాలు జీడీపీపై ప్రతికూల ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో సోమవారం(8న) మార్కెట్లలో కొంతమేర అమ్మకాలకు అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అందునా వారాంతాన మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకిన నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యమిచ్చే వీలున్నట్లు చెబుతున్నారు.
 

ఇకపై మరిన్ని గణాంకాలు
నవంబర్‌ నెలకు పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) పురోగతి వివరాలను ప్రభుత్వం శుక్రవారం(12న) విడుదల చేయనుంది. అక్టోబర్‌లో ఐఐపీ 2.2 శాతం వృద్ధి చూపింది. కాగా.. ఇదే రోజు డిసెంబర్‌ నెలకు రిటైల్‌ ధరల వినియోగ ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు వెల్లడికానున్నాయి. నవంబర్‌లో సీపీఐ 4.88 శాతం పెరిగింది. 
 

ఇతర అంశాలూ కీలకమే
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడుల తీరు, ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలూ, విదేశీ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులు వంటి అంశాలు సైతం దేశీయంగా ట్రెండ్‌ను ప్రభావితం చేయగలవని నిపుణులు పేర్కొంటున్నారు.Most Popular