గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌ కంపెనీల ధూమ్‌ధామ్‌!

గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌ కంపెనీల ధూమ్‌ధామ్‌!

కొత్త ఏడాదిలోనూ గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌ తయారీ కంపెనీలు రేసు గుర్రాల్లా ర్యాలీ చేస్తున్నాయి. గతేడాది ద్వితీయార్థంలో ప్రారంభమైన వీటి దూకుడు కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో హెచ్‌ఈజీ(హెగ్‌) లిమిటెడ్‌ షేరు 4.4 శాతం జంప్‌చేసి రూ. 2,665 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2,682 వరకూ ఎగసింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకావడం విశేషం! 
గ్రాఫైట్‌కు కొనుగోళ్ల కిక్‌
ఇక మరోపక్క గ్రాఫైట్‌ ఇండియా కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో సందడి చేస్తోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో దాదాపు 7 శాతం దూసుకెళ్లి రూ. 842 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 849 సమీపానికి చేరింది. ఇది కూడా సరికొత్త గరిష్టంకావడం ప్రస్తావించదగ్గ అంశం!
ఒకటే దూకుడు
గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఊపందుకోవడం, చైనాలో గ్రాఫైట్‌ తయారీ సంస్థలను ఒక్కసారిగా మూసివేయడం వంటి అంశాలు ఈ కౌంటర్లకు కిక్‌నిస్తున్నాయి. గతేడాది వరకూ 60 శాతం సామర్థ్యాలను మాత్రమే వినియోగించుకుంటున్న దేశీ కంపెనీలు 2017 డిసెంబర్‌కల్లా 90 శాతం సామర్థ్య వినియోగానికి చేరుకున్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. దీంతో కంపెనీల నిర్వహణ లాభాలు భారీ స్థాయిలో వృద్ది చెందనున్నట్లు అభిప్రాయపడ్డాయి.
హెగ్‌ హవా
హెచ్‌ఈజీ షేరు గత నెల రోజుల్లో 57 శాతం జంప్‌చేసింది. గత మూడు నెలల్లో అయితే 180 శాతం ఎగసింది. ఏడాది కాలాన్ని పరిగణిస్తే 1590 శాతం దూసుకెళ్లింది. ఇదే కాలంలో సెన్సెక్స్‌ 27 శాతమే పెరిగింది! 2016 డిసెంబర్‌ 30న ఈ షేరు రూ. 150 వద్ద ముగిసింది. ప్రస్తుతం రూ. 2665ను తాకింది. ఈ ఏడాది క్యూ2లో హెగ్‌ టర్న్‌అరౌండ్‌ ఫలితాలు సాధించింది. నికర లాభం రూ. 114 కోట్లను తాకింది. గతేడాది క్యూ2లో రూ. 14 కోట్ల నికర నష్టం ప్రకటించింది. డిసెంబర్‌ క్వార్టర్‌(క్యూ3)లోనూ మరింత మెరుగైన పనితీరు చూపనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. 
గ్రాఫైట్‌ జోరు
2017లో గ్రాఫైట్‌ ఇండియా 800 శాతం దూసుకెళ్లింది. 2016 డిసెంబర్‌ 30న రూ. 73 స్థాయిలో ఉన్న ఈ షేరు 2017 డిసెంబర్‌ చివరికల్లా రూ. 710ను అధిగమించింది. ప్రస్తుతం మరింత వేగమందుకుని రూ. 840కు చేరింది. ఇందుకు కంపెనీ సాధించిన క్యూ2 ఫలితాలు సైతం దోహదపడ్డాయి. ఈ ఏడాది క్యూ2(జూలై-సెప్టెంబర్‌)లో గ్రాఫైట్‌ ఇండియా నికర లాభం 464 శాతం జంప్‌చేసి రూ. 90 కోట్లను తాకింది. ఇక అమ్మకాలు సైతం 45 శాతం ఎగసి రూ. 462 కోట్లకు చేరాయి.Most Popular