కొత్త ఏడాది సెలవుల తరువాత తొలిసారి ప్రారంభమైన అమెరికా స్టాక్ మార్కెట్లు జోష్చూపాయి. ప్రధానంగా టెక్నాలజీ ఇండెక్స్ 1.4 శాతం పురోగమించడంతో మార్కెట్ చరిత్రలో తొలిసారి నాస్డాక్ 7,000 పాయింట్ల మైలురాయిని అధిగమించి నిలిచింది. గతేడాది చివర్లో ఇంట్రాడేలో ఈ స్థాయికి చేరుకున్నప్పటికీ ముగింపు సమయానికి వెనకడుగు వేసింది. కాగా.. మంగళవారం ట్రేడింగ్ ముగిసేసరికి డోజోన్స్ 105 పాయింట్లు(0.4 శాతం) పెరిగి 24,824 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 22 పాయింట్లు(0.8 శాతం) ఎగసి 2,696 వద్ద స్థిరపడింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 103 పాయింట్లు(1.5 శాతం) జంప్‌చేసి 7,007 వద్ద ముగిసింది.
టెక్ దిగ్గజాల జోరు
టెక్నాలజీ బ్లూచిప్స్ యాపిల్, ఫేస్బుక్, అమెజాన్, అల్ఫాబెట్ లాభపడటంతో నాస్డాక్ తాజాగా 7,000 పాయింట్లను అధిగమించింది. గతేడాది ఏప్రిల్‌లో 6,000 పాయింట్ల మైలురాయిని చేరుకోగా.. 2015లో తొలిసారి 5,000 పాయింట్ల మార్క్‌ను తాకింది. తాజాగా సిటీగ్రూప్ రిటైల్ స్టాక్స్‌పట్ల బుల్లిష్‌గా స్పందించడంతో అమెజాన్, జేసీ పెన్నీ, నార్డ్‌స్ట్రామ్ తదితరాలు పుంజుకున్నాయి. వీటికితోడు అబాట్ లేబ్ 3 శాతం జంప్‌చేయడంతో మార్కెట్లు ఊపందుకున్నాయి.
వహ్వా..7,000 దాటేసిన నాస్డాక్!
