మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్వహణ సంస్థ షాల్బీ హాస్సిటల్ లిస్టింగ్‌లో ఇన్వెస్టర్లను మురిపించలేకపోయింది. లిస్టింగ్ తొలిరోజు(15న) స్టాక్ ఎక్స్ఛేంజీలలో నష్టాలతో ముగిసింది. షాల్బీ లిమిటెడ్ ఇష్యూ ధర రూ. 248 కాగా.. బీఎస్ఈలో రూ. 4 నష్టంతో రూ. 244 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆపై రూ. 255 వద్ద గరిష్టాన్నీ.. రూ. 236 వద్ద కనిష్టాన్నీ తాకింది. చివరికి రూ. 9 నష్టంతో రూ. 239 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో అయితే రూ. 11 క్షీణించి రూ. 237 వద్ద స్థిరపడింది.
రూ. 505 కోట్ల సమీకరణ
ఈ నెల 7న ముగిసిన పబ్లిక్ ఇష్యూ మూడు రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. ఇష్యూ ద్వారా కంపెనీ దాదాపు రూ. 505 కోట్లను సమీకరించింది. ఇష్యూలో భాగంగా ఈ నెల 4న గోల్డ్‌మన్ శాక్స్, సిటీగ్రూప్, యాక్సిస్ ఎంఎఫ్ తదితర యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 150 కోట్లను సమీకరించిన సంగతి తెలిసిందే.
11 ఆసుపత్రులు
గుజరాత్‌లోని అహ్మదాబాద్ కేంద్రంగా 1994లో షాల్బీ హాస్సిటల్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. గుజరాత్లో ప్రధానంగా విస్తరించిన సంస్థ 11 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్వహిస్తోంది. తద్వారా మొత్తం 2,012 పడకల సదుపాయాన్ని కలిగి ఉంది. ఆఫ్రికా, మధ్య ప్రాచ్యంలోనూ క్లినిక్‌లను ఏర్పాటు చేసింది. మార్చితో ముగిసిన గతేడాది(2016-17)లో రూ. 325 కోట్ల ఆదాయం నమోదైంది. రూ. 62 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. రూ. 7.2 ఈపీఎస్ సాధించింది.
లిస్టింగ్ రోజు షాల్బీ లిమిటెడ్ డీలా!
