పరాగ్ షేరు పరుగు ఎందుకో తెలుసా?

పరాగ్ షేరు పరుగు ఎందుకో తెలుసా?

స్టాక్ మార్కెట్లో పరాగ్ మిల్స్ ప్రొడక్ట్స్ షేరు ధర జూమ్ అవుతోంది. తాజ్ గ్రూప్‌తో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌లో ఆవుపాల ఉత్పత్తులను సరఫరా చేసేందుకు ఒప్పందం కుదరడంతో డిసెంబర్ 11నాటి ట్రేడింగ్‌లో 11శాతానికిపైగా లాభాలు పంచింది. ఇప్పటికేఅనేక దేశాలకు ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని..ఐతే తాజ్ గ్రూప్‌తో ఈ ఒప్పందం ప్రత్యేకమైనదని..ఇలాంటి డీల్స్ఇంకా భవిష్యత్తులో ఉంటాయని సంస్థ ఛైర్మన్ దేవేంద్రషా తెలపడం విశేషం. దీంతో ఒక్కసారిగా అసలు ఈ స్టాక్ గురించి ఎంక్వైరీలు బయలుదేరాయ్. 

1992లో పూణేకి దగ్గర్లోని మంచార్ గ్రామంలో దేవేంద్రషా తన చిన్న డైరీని ప్రారంభించారు. అప్పట్లో రోజుకి 20వేల లీటర్ల పాలను ఆయన సేకరించడం అమ్మడం చేసేవారు.ఆ చిన్న డైరీనే ఇప్పుడు రోజుకి 20లక్షల లీటర్లు సేకరించే స్థాయికి ఎదిగింది. ఈ రెండు వాక్యాల మధ్య తేడా పది పదాలే  కావచ్చు కానీ మద్యలో పాతికేళ్ల శ్రమ ఉంది. రెండువేలకోట్లరూపాయల మార్కెట్ కేపిటలైజేషన్‌కి చేరువైందంటే దేవేంద్రషా కష్టమూ ఉంది.ఒకే ఒక్క డైరీ ఇప్పుడు గోవర్ధన్, గో, టాప్ అప్(Topp up) ప్రైడ్ ఆఫ్ కౌస్ అనే బ్రాండ్లతో విక్రయాలు జరుగుతున్నాయ్. నెయ్యి, పాలు, పాలపౌడర్లు, పనీర్, నేచురల్ చీజ్, వెన్న, పెరుగు,డైరీ వైట్నర్స్, గులాబ్ జామ్ మిక్స్ వంటి ఉత్పత్తులు అమ్ముతున్నారు. తాను ఈ రంగంలోకి వచ్చినప్పుడు పరిస్థితులు వేరు అని చెప్తారు దేవేంద్రషా, అప్పట్లో కోఆపరేటివ్ సొసైటీలు, ప్రభుత్వసాయంతో నడిచే సంస్థలదే మార్కెట్‌లో ఆధిపత్యంగా చెప్తారు. పాలసేకరణ కూడా పాడి రైతులనుంచి అసంఘటితంగా, అస్తవ్యస్తంగా ఉండేదట. అసలు నెయ్యికి అయితే మార్కెట్టే ఉండేది కాదట. డైరీ సెక్టార్‌లో లైసెన్సుల ఎత్తివేత 1990లో తానెదుర్కున్నసమస్యగా చెప్తారాయన. డైరీ ఇండస్ట్రీలోనూ విదేశీ పెట్టుబడులకు ప్రత్యక్షంగా అనుమతి లభించడం మరో అవరోధం. 1997-2004 మధ్యలో షా తన డైరీ సామర్ధ్యాన్ని రోజుకి 3లక్షలలీటర్లకు పెంచడంతో విజయానికి దారులు పడ్డట్లయ్యాయ్. అలానే పాలపౌడర్‌ ఎగుమతుల్లో జాప్యం నివారించడం కూడా ఆయన వృధ్దికి సాయపడింది. ఇందుకు ఆయన ఓ ఉదాహరణ చెప్తారు" ఓ రెండు ఎలుకలు క్రీమ్ బక్కెట్‌లో పడితే ఓ ఎలుక వెంటనే మునిగిపోయి చనిపోగా..రెండో  ఎలుక అలా కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఈత నేర్చుకుని పైకి వచ్చేస్తుంది.  నేను ఆ రెండో ఎలుకలాంటి వాడిని  " 2011లో ప్రభుత్వం పాల ఉత్పత్తుల ఎగుమతులను ఏడాది పాటు నిషేధం విధించింది. ఇక్కడే  ఆయన తనకో అవకాశాన్ని చూశారు. పాలఉత్పత్తులకు ఉన్న మార్కెట్‌ని తెలుసుకున్నారు. కేవలం పాలు, వెన్న మాత్రమే కాదు ఇంకా పాలతో తయారయ్యే అనేక ఉత్పత్తులకు మార్కెట్ కల్పించారు. 2008లో ఛీజ్ తయారీ ప్లాంటును ఏర్పాటు చేశారు. ఇదే అప్పటికి దేశంలోనే పెద్దది. పిజ్జాలకు చీజ్, మోజెరెల్లా వంటివి బాగా అమ్ముడపోయేవి. ఆ సమయంలోనే దేశీయంగా గోవర్ధన్ బ్రాండ్, విదేశాలకు గో బ్రాండ్ పేరిట ఉత్పత్తులు అమ్మడం ప్రారంభమైంది అమూల్, బ్రిటానియా లాంటి దిగ్గజాలే 700-800 మెట్రిక్ టన్నుల ఛీజ్ తయారు చేస్తోన్న రోజుల్లో పరాగ్ మిల్క్ ఫుడ్స్ 1200 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేయగలిగింది. ఇక ఫాస్ట్ ఫుడ్ ట్రెండ్ తయారైన తర్వాత ఇక పరాగ్ మిల్క్ ఫుడ్స్ కి తిరుగులేకుండా పోయింది. పిజ్జా హట్, డామినోస్ వంటి కంపెనీలకు ఉత్పత్తులను సరఫరా చేయడం ప్రారంభమైంది. డైరీ సెక్టార్‌ మార్కెట్ రూ.4.5లక్షలకోట్ల సైజు ఉండగా..  ఛీజ్ మార్కెట్‌లో 33శాతం మార్కెట్ షేర్‌ సాధించింది.

పాలిచ్చే పాడి ఆవు బావుండాలి..అప్పుడే రైతు బావుంటాడు..సేకరించే పాలు కూడా నాణ్యతగా ఉంటాయనే సూత్రాన్ని నమ్మడమే తమ విజయమంత్రమని దేవేంద్రషా చెప్తారు. విడిగా తమకంటూ సొంత ఆవుల సత్రంకూడా కలిగిన దేవేంద్రషా గోవులకు రాయల్ ట్రీట్‌మెంట్ లభించేలా చూసుకుంటారు. వాటికి దాణాగా తాగించే నీరు కూడా రివర్స్ ఆస్మాసిస్ పద్దతిలో శుభ్రపరిచినవి కావడం విశేషం. హోలిస్టైన్ ఫ్రైసియాన్ ఆవులు 3వేలు ఉండగా..వాటిద్వారా రోజుకు ఒక్కోదాని నుంచి 28లీటర్లు పాలు సేకరించగలుగుతారంటే ఈ విధానాలే కారణమంటారు. ఆరోగ్యంపై స్పృహ ఉన్న వినియోగదారుల కోసం ప్రత్యేకమైన బ్రాండ్ ప్రైడ్ ఆఫ్ కౌ ఏర్పాటు చేసిన షా దానికి మామూలుగా వసూలు చేసే ధర కంటే రెట్టింపు ధర
తీసుకుంటారు. స్పోర్ట్స్, న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్స్ కోసం వే ప్రోటీన్ బ్రాండ్‌ని కూడా 2017లో లాంఛ్ చేశారు. సింగపూర్, యూఎఈ, మలేషియాలో కూడా తమ అమ్మకాలు సాగిస్తుండగా పాల ఉత్పత్తులతో పాటు గ్రీన్ గ్రాస్, హ్యాపీ కౌస్ అంటూ ఇతర ఉత్పత్తులను కూడా ప్రవేశపెడుతోన్నారు. ఇదో నిరంతర ప్రయాణంలాంటిదే అని ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులతో కస్టమర్లని ఆకట్టుకుంటేనే మనుగడ సాగించగలమని దేవేంద్రషా చెప్తారు. 

 ఈ ఏడాది మేనెలలో లిస్టైన పరాగ్ మిల్క్ ఫుడ్స్ ఇష్యూ ప్రైస్ రూ.215 కాగా..మొదటిరోజున రూ.247.80వద్ద క్లోజైంది. ఈ రేటు వద్ద మార్కెట్ కేపిటలైజేషన్ రూ.2082కోట్లకి సమానంగా ఉంది. ఇక భవిష్యత్తు విషయానికి వస్తే 2020 నాటికి కంపెనీ రెవెన్యూ 14శాతం, నిర్వహణా ఆదాయం 32శాతం, నికరలాభం 49శాతం చొప్పున పెరుగుతాయని ఎడెల్వైజ్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. మార్జిన్లు 9.6శాతం పెరుగుతాయని అని కూడా రీసెర్చ్ సంస్థ చెప్తోంది. కాబట్టే స్టాక్ మార్కెట్లో పరాగ్ పరుగులెడుతోంది( డిసెంబర్ 12నాటి ట్రేడింగ్‌లో పరాగ్ మిల్క్ 3శాతం నష్టపోయి రూ.260వద్ద ముగిసింది)Most Popular