ఈ రెండు షేర్లకూ బోనస్‌ కిక్‌!

ఈ రెండు షేర్లకూ బోనస్‌ కిక్‌!

వాటాదారులకు బోనస్‌ షేర్లను జారీ చేసేందుకు నిర్ణయించడం ద్వారా ఇటీవల రెండు కంపెనీలు బుల్‌ జోరు అందుకున్నాయి. వీటిలో ఒకటి ఆఫ్‌రోడ్‌ టైర్ల తయారీలో అంతర్జాతీయంగా పేరొందిన బాలకృష్ణ ఇండస్ట్రీస్‌కాగా.. రెండో కంపెనీ వక్రంజీ లిమిటెడ్‌. రెండు కంపెనీలూ వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్ల జారీకి నిర్ణయించడంతో గత కొంతకాలంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతూ వస్తున్నారు. ప్రస్తుతం బీఎస్‌ఈలో బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ దాదాపు 8 శాతం దూసుకెళ్లి రూ. 2413 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2425ను అధిగమించింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. వక్రంజీ సైతం 2.2 శాతం పెరిగి రూ. 761 వద్ద ట్రేడవుతోంది. ఇది కూడా 52 వారాల గరిష్టంకావడం విశేషం!
నెల రోజులుగా ర్యాలీ
నవంబర్‌ 8న బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ బోర్డు క్యూ2లో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతోపాటు వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్ల జారీకి అనుమతించింది. దీంతో వాటాదారుల వద్దనున్న ప్రతీ షేరుకీ మరో షేరు ఫ్రీగా లభించనుంది. ఫలితంగా షేరు ధర జోరందుకుంది. అప్పటినుంచీ అంటే రూ. 1798 ధర నుంచీ 40 శాతం ర్యాలీ చేసింది. 
మరోవైపు వక్రంజీ సైతం వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్ల జారీకి అనుమతించింది. దీంతో వాటాదారుల వద్దనున్న ప్రతీ షేరుకీ మరో షేరు ఫ్రీగా లభించనుంది. ఈ వార్తల కారణంగా నవంబర్‌ 2 నుంచీ అంటే రూ. 542 స్థాయి నుంచి ఈ షేరు 40 శాతం పురోగమించింది. బోనస్‌ షేర్లకు కంపెనీ తాజాగా డిసెంబర్‌ 23 రికార్డ్‌ డేట్‌గా ప్రకటించింది. కాగా.. బీఎస్ఈలో నేటి ట్రేడింగ్‌లో వక్రంజీ కౌంటర్‌లో బ్లాక్‌డీల్‌ జరిగింది. 0.54 శాతం వాటాకు సమానమైన 2.8 మిలియన్‌ షేర్లు చేతులు మారాయి.Most Popular