మార్కెట్ల బౌన్స్‌బ్యాక్‌- భారీ లాభాల ముగింపు!

మార్కెట్ల బౌన్స్‌బ్యాక్‌- భారీ లాభాల ముగింపు!

ఆర్‌బీఐ యథాతథ పాలసీతో బుధవారం పతనమైన మార్కెట్లు ఒక్కరోజులోనే తిరిగి బౌన్స్‌ అయ్యాయి. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడటంతో ఆద్యంతమూ పటిష్ట లాభాలతో ట్రేడయ్యాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 352 పాయింట్లు జంప్‌చేసి 32,949 వద్ద నిలిచింది. తద్వారా తిరిగి 33,000 పాయింట్ల మైలురాయికి చేరువైంది. మరోపక్క నిఫ్టీ సైతం 123 పాయింట్లు పురోగమించి 10,167 వద్ద స్థిరపడింది. 
ఆటో, మెటల్‌, రియల్టీ హవా
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా ఆటో, మెటల్‌, రియల్టీ రంగాలు 2 శాతం చొప్పున ఎగశాయి. బ్యాంక్‌ నిఫ్టీ, ఐటీ సైతం దాదాపు 1 శాతం బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో గెయిల్‌, భారతీ, యూపీఎల్‌, టెక్‌ మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్‌, మారుతీ, ఇన్‌ఫ్రాటెల్‌, టాటా స్టీల్‌,  బజాజ్‌ ఆటో, అరబిందో 8.5-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కేవలం కోల్‌ ఇండియా, టీసీఎస్‌, విప్రో, సిప్లా మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 0.5 శాతం స్థాయిలో నీరసించాయి.
చిన్న షేర్లు హైజంప్‌
మార్కెట్ల బాటలో చిన్న షేర్లూ జోరందుకున్నాయి. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్ ఇండెక్సులు 1.3 శాతం చొప్పున ఎగశాయి. బీఎస్‌ఈలో ట్రేడైన మొత్తం షేర్లలో 1851 లాభపడితే.. 828 మాత్రమే డీలాపడ్డాయి!
ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలు
గత రెండు రోజుల్లో నగదు విభాగంలో రూ. 1,800 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) బుధవారం మరింత అధికంగా రూ. 1,218 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే ఇదే సమయంలో రూ. 1,824 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన దేశీ ఫండ్స్‌(డీఐఐలు) బుధవారం మరోసారి రూ. 995 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి.Most Popular