రెండు నెలల కనిష్టానికి పసిడి!

రెండు నెలల కనిష్టానికి పసిడి!

విదేశీ మార్కెట్లో ఇటీవల నీరసిస్తూ వస్తున్న బంగారం ధరలు మరోసారి వెనకడుగు వేశాయి. తాజాగా న్యూయార్క్‌ కామెక్స్‌లో బంగారం ఔన్స్‌(31.1 గ్రాములు) 1260 డాలర్ల దిగువకు చేరింది. ప్రస్తుతం 0.5 శాతం(6 డాలర్లకుపైగా) క్షీణించి 1259 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది దాదాపు రెండు నెలల కనిష్టంకావడం గమనించదగ్గ అంశం! కాగా.. వెండి సైతం 0.25 శాతం నష్టంతో 16 డాలర్ల దిగువన 15.92 డాలర్లను తాకింది.
కారణాలేంటంటే?
గత వారం చివర్లో ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ప్రతిపాదిత 1.5 ట్రిలియన్‌ డాలర్ల పన్ను సంస్కరణల బిల్లుకి ఎట్టకేలకు అమెరికా సెనేట్‌ ఆమోదముద్ర వేసింది. మరోపక్క డిసెంబర్‌ రెండో వారంలో నిర్వహించనున్న పరపతి సమీక్షలో ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపును చేపట్టే అవకాశముంది. ఇది ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరుకు బలాన్నివ్వగా.. పసిడిలో అమ్మకాలకు ఉసిగొల్పింది. బుధవారం పాలసీ సమీక్షను చేపట్టిన బ్యాంక్‌ ఆఫ్‌ కెనడా భవిష్యత్‌లో వడ్డీ రేట్ల పెంపు సంకేతాలనిస్తూ కీలక రేట్లను నిలకడగా కొనసాగించేందుకు నిర్ణయించింది. 
ఈయూ సైతం
2019కల్లా యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) నుంచి బ్రిటన్‌ వైదొలగనుండటం(బ్రెక్సిట్‌)తో యూరో దేశాలు ఐక్యతకు పెద్ద పీట వేయాలని నిర్ణయించుకున్నాయి. ఇందుకు అనుగుణంగా యూరోపియన్‌ కమిషన్‌ యూరోజోన్‌ దేశాల పటిష్టతకు చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొంది. మరోపక్క బంగారాన్ని అత్యధికస్థాయిలో కొనుగోలు చేసే భారత్‌ దిగుమతులు నవంబర్‌లో సగానికి క్షీణించాయి. ఈ అన్ని అంశాలూ పసిడి ధరలను బలహీనపరచినట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి.
దేశీయంగానూ..
విదేశీ మార్కెట్లో పసిడి బలహీనపడటంతో దేశీయంగానూ ఆ ప్రభావం కనిపిస్తోంది. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో బంగారం ఫిబ్రవరి ఫ్యూచర్స్‌ 10 గ్రాములు రూ. 176 పతనమై రూ. 28,791కు చేరింది. వెండి మార్చి ఫ్యూచర్స్‌ కేజీ రూ. 130 క్షీణించి రూ. 37,314ను తాకింది.Most Popular