ఎగుమతులతో రైస్‌ షేర్లు.. సందడే సందడి!

ఎగుమతులతో రైస్‌ షేర్లు.. సందడే సందడి!

ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగం(ఏప్రిల్‌-సెప్టెంబర్‌)లో బియ్యం ఎగుమతులు భారీగా పుంజుకున్న వార్తలతో రైస్‌ షేర్లకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం బీఎస్ఈలో చమన్‌లాల్‌ సేతియా షేరు 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 24 ఎగసి రూ. 143 వద్ద ఫ్రీజ్‌ అయ్యింది. ఈ బాటలో దావత్‌ బ్రాండు ఎల్‌టీ ఫుడ్స్‌ 11 శాతం దూసుకెళ్లి రూ. 81ను తాకింది. తొలుత రూ. 83 వరకూ ఎగసింది. ఇక కోహినూర్‌ ఫుడ్స్‌ దాదాపు 7 శాతం జంప్‌చేసి రూ. 77కు చేరగా.. లక్ష్మీ ఎనర్జీ 4.5 శాతం ఎగసి రూ. 31 వద్ద ట్రేడవుతోంది. అయితే కేఆర్‌బీఎల్‌ మాత్రం 1.4 శాతం క్షీణించి రూ. 606 దిగువన కదులుతోంది.
కారణాలేంటంటే?
ఈ ఏడాది తొలి అర్ధభాగంలో వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు 13 శాతం జంప్‌చేసి 8.73 బిలియన్‌ డాలర్లను తాకినట్లు వ్యవసాయం, ప్రాసెస్‌డ్‌ ఫుడ్‌ ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ(అపెడా) తాజాగా వెల్లడించింది. గతేడాది ఇదే కాలంలో 7.69 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు మాత్రమే జరిగినట్లు తెలియజేసింది. ప్రధానంగా బియ్యం ఎగుమతులే దీనిలో సింహభాగాన్ని ఆక్రమిస్తున్నట్లు పేర్కొంది. బాస్మతి, నాన్‌బాస్మతి బియ్యం ఎగుమతులు భారీగా జోరందుకున్నట్లు వెల్లడించింది. వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల్లో వీటి వాటా 44 శాతంగా నమోదైనట్లు తెలియజేసింది. 
నిల్వలకు ప్రాధాన్యం
నవంబర్‌ 1 నుంచి యూరోపియన్‌ యూనియన్‌ ఫుడ్‌ ప్రొడక్టుల దిగుమతి నిబంధనలను కఠినతరం చేయనున్న కారణంగా యూరోపియన్‌ దేశాలు అత్యధిక స్థాయిలో బియ్యం దిగుమతి చేసుకున్నట్లు వివరించింది. తద్వారా నిల్వలకు ఈయూ దేశాలు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించింది. మరోపక్క ఇరాన్‌ సైతం దేశీ బియ్యాన్ని అధికంగా దిగుమతి చేసుకుంటున్నట్లు తెలియజేసింది. కాగా.. ఇటీవల బంగ్లాదేశ్‌ టన్నుకి 440 డాలర్ల ధరలో 1.50 లక్షల టన్నుల నాన్‌బాస్మతి బియ్యాన్ని కొనుగోలు చేసినట్లు నాఫెడ్‌ పేర్కొంది. 
బాస్మతి బియ్యం జోరు
ఏప్రిల్‌-సెప్టెంబర్‌ కాలంలో బాస్మతి బియ్యం ఎగుమతులు 1.63 బిలియన్‌ డాలర్ల నుంచి 2.13 బిలియన్‌ డాలర్లకు ఎగసినట్లు అపెడా పేర్కొంది. దీంతో టన్నుకి బాస్మతి బియ్యం ధర 789 డాలర్ల నుంచి 997 డాలర్లకు జంప్‌చేసినట్లు తెలియజేసింది. ఇక నాన్‌బాస్మతి బియ్యం ఎగుమతులు 2.07 మిలియన్‌ టన్నుల నుంచి 2.13 మిలియన్‌ టన్నులకు పెరిగినట్లు తెలియజేసింది.Most Popular