చమురు ధరలకు అమెరికా చలి!

చమురు ధరలకు అమెరికా చలి!

అమెరికాలో ఇంధన నిల్వలు భారీగా పెరిగిన వార్తలతో బుధవారం అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు భారీగా పతనమయ్యాయి. న్యూయార్క్‌ మార్కెట్లో లైట్‌ స్వీట్‌ క్రూడ్‌(నైమెక్స్‌) బ్యారల్‌ దాదాపు 3 శాతం(1.66 డాలర్లు) పడిపోయి 55.96 డాలర్లను తాకింది. ఇది మూడు వారాల కనిష్టంకాగా.. గత రెండు నెలల్లో ఒకేసారి ఈ స్థాయిలో ధరలు పతనమైందేలేదు. కాగా.. ఈ ప్రభావంతో లండన్‌ మార్కెట్లోనూ బ్రెంట్‌ బ్యారల్‌ 2.6 శాతం(1.64 డాలర్లు) తిరోగమించి నెల రోజుల కనిష్టం 61.22 డాలర్లకు చేరింది. 
6.8 మిలియన్‌ బ్యారల్స్‌ 
తాజాగా యూఎస్‌ గ్యాసోలిన్‌ నిల్వలు(స్టాక్స్‌) 6.8 మిలియన్‌ బ్యారళ్లమేర పెరిగి 22.1 కోట్ల బ్యారళ్లను తాకడంతో ఇకపై చమురుకు డిమాండ్‌ క్షీణించవచ్చన్న అంచనాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోవైపు గత నెలలో కెనడా కీస్టోన్‌ పైప్‌లైన్‌ మూసివేత కారణంగా అమెరికాలో ముడిచమురు నిల్వలు తాత్కాలికంగా తగ్గినట్లు ఇంధన శాఖ పేర్కొంది. 5.6 మిలియన్‌ బ్యారళ్లమేర ముడిచమురు నిల్వలు తగ్గినట్లు వెల్లడించింది. అయితే.. అమెరికాలో గత వారం చమురు ఉత్పత్తి 9.7 మిలియన్‌ బ్యారళ్లమేర ఎగసింది. ఇది 1970 తరువాత అత్యధికంకావడంతో ట్రేడర్లు ఆయిల్‌ ఫ్యూచర్స్‌లో భారీ అమ్మకాలు చేపట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు. 
ప్రస్తుతం ఓకే
బుధవారం ధరలు భారీగా తిరోగమించడంతో ప్రస్తుతం చమురు ధరలు కాస్త కోలుకున్నాయి. న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ బ్యారల్‌ 0.23 శాతం పుంజుకుని 56.09 డాలర్లకు చేరింది. మరోపక్క లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ బ్యారల్‌ 0.16 శాతం బలపడి 61.32 డాలర్ల వద్ద కదులుతోంది.Most Popular