అమెరికా మార్కెట్లకు చమురు సెగ!

అమెరికా మార్కెట్లకు చమురు సెగ!

ముడిచమురు ధరలు మరోసారి పతనంకావడంతో బుధవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. మైక్రోసాఫ్ట్‌ తదితర టెక్నాలజీ దిగ్గజాలు పుంజుకున్నప్పటికీ.. ఇంధన రంగం నీరసించడంతో మార్కెట్లు అటూఇటుగా ముగిశాయి. బుధవారం ట్రేడింగ్‌ ముగిసేసరికి డోజోన్స్‌ 0.15 శాతం క్షీణించి 24,141 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ దాదాపు యథాతథంగా 2,629 వద్ద స్థిరపడింది. నాస్‌డాక్‌ మాత్రం 0.2 శాతం పుంజుకుని 6,776 వద్ద ముగిసింది. మంగళవారం టెక్నాలజీ, ఇంధన దిగ్గజాలు నష్టపోవడంతో మార్కెట్లు వెనకడుగు వేసిన విషయం విదితమే.
టెక్నాలజీ బలం
మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌, అల్ఫాబెట్‌(గూగుల్‌) 1 శాతం స్థాయిలో లాభపడటంతో నాస్‌డాక్‌ 0.2 శాతం బలపడింది. కాగా.. చమురు ధరలు రెండు వారాల కనిష్టానికి చేరడంతో ఎక్సాన్‌, చెవ్రాన్‌ తదితర ఇంధన బ్లూచిప్స్‌ నీరసించాయి. దీంతో డోజోన్స్‌ ప్రతికూలంగా ముగిసినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు రిటైల్‌ దిగ్గజం హోమ్‌ డిపో 1 శాతం క్షీణించడంతో ఎస్‌అండ్‌పీ సైతం వెనకడుగు వేసినట్లు తెలియజేశారు.Most Popular