ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు?!

ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు?!

దేశీ స్టాక్ మార్కెట్లు నేడు అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్ నిఫ్టీ) 6 పాయింట్ల నామమాత్ర లాభంతో 10,078 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. రెండు రోజులపాటు పాలసీ సమావేశాలు నిర్వహించిన రిజర్వ్‌ బ్యాంక్‌ చివరికి యథాతథ పాలసీ అమలుకే కట్టుబడటంతో  మార్కెట్లు పతనమైన సంగతి తెలిసిందే. చివర్లో అమ్మకాలు ఊపందుకోవడంతో సెన్సెక్స్‌ 205 పాయింట్లు క్షీణించి 32,597 వద్ద నిలవగా.. నిఫ్టీ 74 పాయింట్లు తిరోగమించి 10,044 వద్ద స్థిరపడింది. 
నిఫ్టీ కదలికలు ఇలా..
నేటి ట్రేడింగ్‌లో నిఫ్టీ బలహీనపడితే.. 10,017-9,990 పాయింట్ల వద్ద మద్దతు లభించగలదని నిపుణులు భావిస్తున్నారు. ఇదేవిధంగా నిఫ్టీ పుంజుకుంటే.. 10,088-10,131 స్థాయిల వద్ద అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని అంచనా వేశారు. ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాల నేపథ్యంలో బుధవారం మార్కెట్లలో చివర్లో అమ్మకాలు ఊపందుకోవడంతో నేడు కొంతమేర స్క్వేరప్‌ లావాదేవీలకు అవకాశమున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలు
గత రెండు రోజుల్లో నగదు విభాగంలో రూ. 1,800 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) బుధవారం మరింత అధికంగా రూ. 1,218 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే ఇదే సమయంలో రూ. 1,824 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన దేశీ ఫండ్స్‌(డీఐఐలు) బుధవారం మరోసారి రూ. 995 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి.Most Popular