పాలసీ యథాతథం- మార్కెట్లు పతనం!

పాలసీ యథాతథం- మార్కెట్లు పతనం!

రెండోసారీ యథాతథ పాలసీ అమలుకే ఆర్‌బీఐ కమిటీ మొగ్గుచూపడంతో స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. మిడ్‌ సెషన్‌ నుంచీ అమ్మకాలు పెరగడంతో మార్కెట్లు చివరికి రోజులో కనిష్ట స్థాయివద్దే ముగిశాయి. సెన్సెక్స్‌ 205 పాయింట్లు క్షీణించి 32,597 వద్ద నిలవగా... నిఫ్టీ 74 పాయింట్లు తిరోగమించి 10,044 వద్ద స్థిరపడింది. ప్రపంచ మార్కెట్ల ప్రతికూలతలతో మార్కెట్లు తొలి నుంచీ నష్టాలతోనే కదిలాయి. 
బ్యాంకింగ్‌ బోర్లా
వడ్డీ రేట్లకు కీలకమైన రెపో 6 శాతం వద్ద, రివర్స్‌ రెపో 5.75 శాతం వద్ద కొనసాగించేందుకే ఆర్‌బీఐ పాలసీ కమిటీ నిర్ణయించింది. యథాతథ పాలసీని అత్యధిక శాతం మంది ఆర్థికవేత్తలు అంచనా వేసినప్పటికీ చివర్లో యథాతథంగా అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్‌, మెటల్‌ రంగాలు ఎన్‌ఎస్‌ఈలో 2 శాతం చొప్పున పతనమయ్యాయి.
ఐటీ ప్లస్‌
ఫార్మా, ఐటీ సైతం దాదాపు 1 శాతం స్థాయిలో బలహీనపడగా.. ఐటీ ఇండెక్స్‌ 0.5 శాతం పుంజుకుంది. నిఫ్టీ దిగ్గజాలలో బాష్‌, హిందాల్కో, ఇన్‌ఫ్రాటెల్‌, ఐషర్‌, వేదాంతా, సన్‌ ఫార్మా, అరబిందో, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, బీపీసీఎల్‌ 4-2 శాతం మధ్య పడిపోయాయి. అయితే ఆర్‌ఐఎల్‌, టెక్‌మహీంద్రా, మారుతీ, హెచ్‌యూఎల్‌, అంబుజా, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2-1 శాతం మధ్య ఎగశాయి.
చిన్న షేర్లు వీక్‌
మార్కెట్ల బాటలో మిడ్‌ సెషన్‌ నుంచీ చిన్న షేర్లలోనూ అమ్మకాలు ఊపందుకున్నాయి. బీఎస్ఈలో ట్రేడైన షేర్లలో 1637 నష్టపోతే.. 984 మాత్రమే లాభపడ్డాయి.
ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలు
సోమవారం నగదు విభాగంలో రూ. 333 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ విక్రయించిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) మంగళవారం మరింత అధికంగా రూ. 1,470 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే సోమవారం రూ. 776 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన దేశీ ఫండ్స్‌(డీఐఐలు) మంగళవారం మరోసారి రూ. 1,074 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి.Most Popular