రెండో "సారీ' యథాతథ పాలసీ!

రెండో

అత్యధిక శాతం ఆర్థికవేత్తలు అంచనా వేసినట్లుగానే రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) మరోసారి యథాతథ పాలసీ అమలుకే కట్టుబడుతున్నట్లు తాజాగా ప్రకటించింది. ఆర్‌బీఐ గవర్నర్‌ ఊర్జిత్‌ పటేల్‌ అధ్యక్షతన రెండు రోజులపాటు సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించేందుకే మొగ్గు చూపింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకంగా నిలిచే రెపో రేటు 6 శాతం వద్దే కొనసాగనుంది. ఈ బాటలో రివర్స్‌ రెపో 5.75 శాతంగా అమలుకానుండగా..  బ్యాంక్‌ రేటు, మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ రేట్లు 6.25 శాతం వద్ద కొనసాగనున్నాయి. ద్వైమాసిక పరపతి సమీక్షలో భాగంగా ఆర్‌బీఐ అధ్యక్షతన ఎంపీసీ మంగళవారం నుంచీ రెండు రోజులపాటు సమావేశమైంది.
గత సమీక్షలోనూ
అక్టోబర్‌ 4న నిర్వహించిన గత పాలసీ సమీక్షలోనూ ఎంపీసీ వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 6 శాతంవద్దే కొనసాగించేందుకు నిర్ణయించింది. దీంతో రివర్స్‌ రెపో 5.75 శాతంగా అమలుకాగా.. బ్యాంక్‌ రేటు, మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ రేట్లు 6.25 శాతం వద్ద కొనసాగాయి. 
కారణాలేంటి?
రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) అక్టోబర్‌లో 7 నెలల గరిష్టం 3.58 శాతాన్ని తాకడంతో  ఈసారి కూడా పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తూ వచ్చారు. దీనికితోడు ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో 6.3 శాతం వృద్ధిచూపడం కూడా వడ్డీ రేట్ల తగింపునకు చెక్‌ పెట్టినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. జూన్‌ మొదలు సీపీఐ పెరుగుతూరావడం కూడా రెపోను తగ్గించే అవకాశాలను దెబ్బతీసినట్లు చెబుతున్నారు. Most Popular