ఈ రేసు గుర్రాల స్పీడుకి అంతేలేదు..!?

ఈ రేసు గుర్రాల స్పీడుకి అంతేలేదు..!?

ఈ ఏడాది మార్చిలో పబ్లిక్‌ ఇష్యూకి వచ్చిన డీమార్ట్‌ స్టోర్ల నిర్వహణ సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ షేరు ఓవైపు లాభాల దౌడు తీస్తూ ఇన్వెస్టర్లను నివ్వెర పరుస్తుంటే... మరోపక్క ఏప్రిల్‌లో స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌ షేరు సైతం సైలెంట్‌గానే రేసు గుర్రాన్ని తలపిస్తూ దూసుకెళుతోంది. వివరాలు చూద్దాం..
శంకర బిల్డ్‌ప్రో.. సైలెంట్‌ విన్నర్‌
ఈ ఏడాది ఏప్రిల్‌ 5న శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌ షేరు స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యింది. షేరుకి రూ. 460 ధరలో పబ్లిక్‌ ఇష్యూకి వచ్చిన ఈ కంపెనీ తద్వారా రూ. 350 కోట్లను సమీకరించింది. ఇష్యూ 42 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌ అయ్యింది. దీంతో లిస్టింగ్‌ రోజునే శంకర షేరు రూ. 633 వద్దకు చేరుకుని ఇన్వెస్టర్లకు భారీ లాభాలను పంచింది. ఆపై రేసు గుర్రంలా దూసుకెళుతూ వచ్చింది. అక్టోబర్‌ 4కల్లా రూ. 1418ను తాకింది. ఐపీవో ధరతో పోలిస్తే ఇది 208 శాతం వృద్ధికాగా.. తాజాగా రూ. 2,350 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. అంటే గత రెండు నెలల్లోనే మళ్లీ 60 శాతంపైగా జంప్‌చేసింది. 
12న బోర్డు సమావేశం
ఈ నెల(డిసెంబర్‌) 12న బోర్డు సమావేశాన్ని నిర్వహించనున్నట్లు శంకర బిల్డ్‌ తాజాగా పేర్కొంది. వర్కింగ్‌ కేపిటల్‌ అవసరాలు, తదితర ఆర్థిక అవసరాలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలియజేసింది. వెరసి మరోసారి నిధుల సమీకరణ చేపట్టే అవకాశమున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా.. కంపెనీ హోమ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ విభాగంలో కార్యకలాపాలు కలిగి ఉన్న సంగతి తెలిసిందే. శంకర బిల్డ్‌ప్రో పేరుతో రిటైల్‌ స్టోర్లను నిర్వహిస్తోంది. బిల్డింగ్‌ మెటీరియల్స్‌ విక్రయిస్తోంది. ఇటీవలే విజయవాడ, బెంగళూరులలో స్టోర్లను ప్రారంభించింది.
డీమార్ట్‌ సంగతి చూద్దాం..
ఈ ఏడాది మార్చిలో షేరుకి రూ. 299 ధరలో ఐపీవో చేపట్టిన డీమార్ట్‌ లిస్టింగ్‌ రోజు రూ. 625 వద్ద నిలవడం ద్వారా ఇన్వెస్టర్లకు రెట్టింపు లాభాలను అందించిన సంగతి తెలిసిందే. ఆపై మరింత వేగాన్ని అందుకుని సెప్టెంబర్‌కల్లా రూ. 1114 వద్ద కొత్త గరిష్టానికి చేరుకుంది. ఐపీవో ధరతో పోలిస్తే ఇది 272 శాతం లాభంకాగా.. ఆపై అక్టోబర్‌లో రూ. 1289 వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ఆపై ట్రేడర్ల లాభాల స్వీకరణ కారణంగా స్వల్ప వెనకడుగు వేసింది. ప్రస్తుతం రూ. 1140వద్ద కదులుతోంది. Most Popular