షాల్బీ హాస్సిటల్‌ ఐపీవో సంగతేంటి?

షాల్బీ హాస్సిటల్‌ ఐపీవో సంగతేంటి?

అహ్మదాబాద్‌ కేంద్రంగా 1994 నుంచీ ఆసుపత్రులను నిర్వహిస్తున్న షాల్బీ హాస్సిటల్‌ పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 5(మంగళవారం) నుంచీ మొదలుకానుంది. 7న(గురువారం) ముగియనున్న ఇష్యూ ద్వారా కంపెనీ దాదాపు రూ. 505 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. షేరుకి రూ. 245-248 ధరల శ్రేణిని ఇప్పటికే ప్రకటించింది. ఆఫర్‌లో భాగంగా సంస్థ రూ. 480 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు ప్రమోటర్‌ విక్రమ్ షా రూ. 25 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు.  
60 షేర్లు ఒక లాట్‌
రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 60 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంతకంటే అధికంగా షేర్లు కావాలనుకుంటే రూ. 2 లక్షల మొత్తానికి మించకుండా ఒకే లాట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఐపీవో నిధులను రుణాల చెల్లింపు, సాధారణ కార్పొరేట్‌ కార్యకలాపాలకు వెచ్చించనున్నట్లు షాల్బీ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. సంస్థకు రూ. 320 కోట్లమేర రుణభారముంది. 
11 ఆసుపత్రులు
గుజరాత్‌లో ప్రధానంగా విస్తరించిన సంస్థ 11 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్వహిస్తోంది. తద్వారా మొత్తం 2,012 పడకల సదుపాయాన్ని కలిగి ఉంది. ఆఫ్రికా, మధ్య ప్రాచ్యంలోనూ క్లినిక్‌లను ఏర్పాటు చేసింది. మార్చితో ముగిసిన గతేడాది(2016-17)లో రూ. 325 కోట్ల ఆదాయం నమోదైంది. రూ. 62 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. రూ. 7.2 ఈపీఎస్‌ సాధించింది. ఐపీవో 34 పీఈని సూచిస్తోంది. ఇప్పటికే స్టాక్‌ ఎక్స్చేంజీలలో లిస్టయిన హెల్త్‌కేర్‌ గ్లోబల్‌ 105 పీఈలో ట్రేడవుతుంటే.. అపోలో హాస్పిటల్స్‌ 69, నారాయణ హృదయాలయ 72 పీఈలో ఉన్నాయి. అయితే ఫోర్టిస్‌ హెల్త్‌ 16 పీఈలోనూ, ఇంద్రప్రస్థ మెడికల్‌ 18 పీఈలోనూ ట్రేడవుతున్నాయి. థైరోకేర్‌ టెక్నాలజీస్‌, డాక్టర్‌ లాల్‌పాథ్‌ లేబ్స్‌ మాత్రం 50 పీఈ వరకూ పలుకుతున్నాయి.
సలహా
అధిక రిస్క్‌ భరించగల ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక దృష్టితో ఈ ఇష్యూకి దరఖాస్తు  చేసుకోవచ్చని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ప్రభుత్వ నియంత్రణలు ఆసుపత్రుల లాభదాయకతను దెబ్బతీయవచ్చని చెబుతున్నారు. దేశ పశ్చిమ, మధ్య ప్రాంతాలలో ఆసుపత్రుల విస్తరణను చేపట్టాలని షాల్బీ భావిస్తోంది. దీంతో వృద్ధి నెమ్మదించవచ్చని, ఇదే విధంగా మార్జిన్లపై ఒత్తడి పడవచ్చని అభిప్రాయపడుతున్నారు.Most Popular