టీ షేర్ల ఘుమఘుమలు- ఇన్వెస్టర్లకు హుషార్‌!

టీ షేర్ల ఘుమఘుమలు- ఇన్వెస్టర్లకు హుషార్‌!

ఈ ఏడాది మొదట్లో పటిష్ట లాభాల ఆర్జించిన టీ షేర్లు మళ్లీ ఇన్వెస్టర్లను తమ ఘుమఘుమలతో భారీగా ఆకట్టుకుంటున్నాయి. దేశంలోని అస్సామ్, బెంగాల్‌ ప్రాంతాలలో తేయాకు ఉత్పత్తి క్షీణించడం, దేశ, విదేశీ మార్కెట్లలో టీ ధరలు ఊపందుకోవడం వంటి అంశాల కారణంగా ఇన్వెస్టర్లు ఇటీవల టీ స్టాక్స్‌పై ఆసక్తిని చూపుతున్నారు. గత వారం ఈ రంగంలోకి పలు షేర్లు లాభాల హైజంప్‌చేయగా.. నేటి ట్రేడింగ్‌లో మరోసారి దూకుడు చూపుతున్నాయి. 
షేర్ల కేక..
బీఎస్ఈలో ప్రస్తుతం మెక్‌లాయిడ్‌ రసెల్‌ 6.5 శాతం దూసుకెళ్లి రూ. 225 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో రసెల్‌ ఇండియా 8 శాతం జంప్‌చేసి రూ. 138కు చేరింది. తొలుత రూ. 141 వరకూ ఎగసింది. ఇక వారెన్‌ టీ 7 శాతం ఎగసి రూ. 178కు చేరగా.. తొలుత రూ. 182ను తాకింది. ప్రస్తుతం జే శ్రీ టీ సైతం 12 శాతం పెరిగి రూ. 132 వద్ద ట్రేడవుతోంది. గుడ్‌రిక్‌ గ్రూప్‌ 6.5 శాతం పుంజుకుని రూ. 522 వద్ద కదులుతున్నప్పటికీ తొలుత రూ. 530 వరకూ ఎగసింది. హారిసన్స్‌ మలయాళం 17 శాతం పురోగమించి రూ. 111కు చేరింది. ఇంట్రాడేలో రూ. 114ను తాకింది. టాటా కాఫీ 7.5 శాతం పెరిగి రూ. 173 వద్ద కదులుతోంది. 
గత వారం ఇలా..
సరిగ్గా వారం రోజుల క్రితం మెక్‌లాయిడ్‌ రసెల్‌ 11 శాతం దూసుకెళ్లి రూ. 190కు చేరగా... రసెల్‌ ఇండియా 7 శాతం జంప్‌చేసి రూ. 118ను తాకింది. ఇక వారెన్‌ టీ 7.6 శాతం ఎగసి రూ. 127కు చేరగా.. జే శ్రీ టీ సైతం 6.4 శాతం పెరిగి రూ. 110 వద్ద నిలిచింది. గుడ్‌రిక్‌ గ్రూప్‌ 5 శాతం పుంజుకుని రూ. 405 వద్ద స్థిరపడగా... హారిసన్స్‌ మలయాళం 6 శాతం పురోగమించి రూ. 93కు చేరింది. టాటా కాఫీ 5 శాతం పెరిగి రూ. 161 వద్ద ముగిసింది. ఈ స్థాయిలతో పోలిస్తే అన్ని కౌంటర్లూ మరోసారి భారీ ర్యాలీ చేయడం విశేషం 
కారణాలున్నాయ్‌ సుమా
సెప్టెంబర్‌లో అస్సామ్‌లో తేయాకు ఉత్పత్తి 27 శాతం క్షీణించింది. 81.75 మిలియన్‌ కేజీలకు పరిమితమైంది. దేశీయంగా మొత్తం తేయాకు ఉత్పత్తిలో అస్సామ్‌ వాటా 50 శాతం కావడంతో ఇది ధరలకు అజ్యం పోయనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు అకాల వర్షాలు కారణంకాగా.. పశ్చిమ బెంగాల్‌లోనూ తేయాకు ఉత్పత్తి 19 శాతం తగ్గి 43 మిలియన్‌ కేజీలకు చేరింది. ఇక  ఈ నెల(నవంబర్‌)లోనూ తేయాకు దిగుబడి తగ్గనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. గతేడాదిలో నమోదైన 109 మిలియన్‌ కేజీలతో పోలిస్తే ఈసారి 10-15 శాతం ఉత్పత్తి తగ్గవచ్చని అంచనా. ఇందుకు శీతాకాలం త్వరగా ప్రారంభంకావడం ప్రభావం చూపనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. 
కాగా.. మరోవైపు ఇటు దేశీయంగానూ అటు విదేశాల నుంచీ టీకి డిమాండ్‌ పెరగడంతో ఇప్పటికే ధరలను కేజీకి రూ. 5 చొప్పున పెంచినట్లు మెక్‌లాయిడ్‌ రసెల్‌ పేర్కొంది. ఇది కంపెనీల ఆర్థిక పనితీరు మెరుగుకు దోహదం చేయగలదన్న అంచనాలు టీ షేర్లకు క్రేజ్‌ను తీసుకువచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు.Most Popular