దినసారి కూలి కొడుకు.. నేడు మల్టీ మిలియనీర్

దినసారి కూలి కొడుకు.. నేడు మల్టీ మిలియనీర్

పూట గడవడమే కష్టంగా రోజుల్లో సముద్రంలో చేపలు పట్టి అమ్ముకునే ఓ అబ్బాయి అనతి కాలంలోనే ఓ మల్టీ మిలియన్ డాలర్ కంపెనీ ఓనర్ గా మారాడు. ఇదేదో సినిమా కథ కాదు. నేడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన భారత్ మాట్రిమోనీ వ్యవస్థాపకుడు, సీఈవో మురుగవేల్ జానకీ రామన్ కథ నేపథ్యమిది. 43 ఏళ్ల జానకీ రామన్ నేడు ఎందరో పెళ్లికాని ప్రసాదులకు వరమయ్యాడు. తన వినూత్నమైన కాన్సెప్ట్ తో పెళ్లి సంబంధాల వెతికే ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం మాట్రిమొని డాట్ కామ్ తయారు చేసి సంచలనంగా నిలిచాడు. 

తమిళనాడులోని రాయపురంకు చెందిన  జానకి రామన్ చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలకు ఓర్చి నిలిచాడు. తండ్రి డాక్ యార్డ్ లో ఓ రోజు కూలీ, జానకీ రామన్ సైతం చిన్నతనంలో కుటుంబానికి చేదోడుగా చేపలు పట్టి అమ్మేవాడు. చదువుకునే వయస్సులో మేథమేటిక్స్ లో మెరికలా ఉండే జానకీ రామన్ తన తెలివి తేటలతో కంప్యూటర్ ప్రోగ్రామింగ్, స్టాటిస్టిక్స్ రంగాల్లో ప్రతిభ చాటాడు. అనతి కాలంలోనే మంచి ఆఫర్ రావడంతో కంప్యూటర్ ప్రోగ్రామర్ గా అమెరికాలో అడుగుపెట్టాడు.  అయితే 2000  ఏడాది తలెత్తిన వైటుకే సమస్య కారణంగా అతని ఉద్యోగం ఊడిపోయింది. 

టర్నింగ్ పాయింట్ 
సొంతంగా వ్యాపార రంగంలోకి దిగేందుకు జానకీ రామన్ సిద్ధమైపోయారు. తొలుత అమెరికాలోని తమిళ్ కమ్యూనిటీ కోసం ఒక వెబ్ పోర్టల్ తయారు చేసిన జానకీ రామన్, ఆ పోర్టల్ లో తమిళ్ పర్వదినాలు, ప్రాపర్టీ లిస్టింగ్ ప్రకటనలు వేసేవాడు. అనంతరం అతని పెళ్లి సంబంధాలకు సంబంధించి వధూవరుల వివరాలను ఆన్‌లైన్ ప్లాట్‌ఫారం ద్వారా నమోదు చేయడం ప్రారంభించాడు. అదే జానకీ రామన్ జీవితంలో టర్నింగ్ పాయింట్ గా మారింది. ఒక్కసారిగా సైట్ ట్రాఫిక్ పెరిగింది. ఇంకేముంది మార్కెట్ లో పెళ్లి దాని చుట్టూ అల్లుకున్న వ్యాపారంను జానకీ రామన్ ఇట్టే పట్టేసాడు. ఒకప్పుడు పెళ్లిల్ల పేరయ్యలు ఫోటోలు పట్టుకొని ఇల్లిళ్లు తిరిగి  పెళ్లిసంబంధాలు చూసేవారు. మార్కెట్ లో పెరుగుతున్న డిమాండ్ కు తగ్గట్టుగా పెళ్లిళ్ల పేరయ్యలు, మ్యారేజీ బ్యూరోలు అప్ డేట్ కాలేకపోయాయి. అక్కడే మాట్రిమోనీ. డాట్ కామ్ సక్సెస్ అయ్యింది. యువతీ యువకులు ఆన్ లైన్ ప్లాట్ ఫారం ద్వారా తమ ఇష్టాలకు తగ్గట్టు, కుల, మతాలు, అందం, ఆదాయం, అభిరుచుల ఆధారంగా వందలాది ఛాయిస్ ముందు ఉంచింది మాట్రిమోనీ. 

నిత్య కళ్యాణం.. ఆదాయ యోగం
ముఖ్యంగా నేటి టెక్నాలజీ యుగంలో యువతీ యువకుల అభిరుచులు మారుతున్నాయి. వాటికి తగ్గట్టు వెతికి పట్టుకునే అవకాశం మాట్రిమొని కల్పించింది. ఇక పోర్టల్ ఆదాయం విషయానికి వస్తే మొదటి నుంచి మాట్రిమొనీ. డాట్ కామ్ పెయిడ్ సైట్ గా వుంటోంది. అయితే మాట్రిమోని సైట్ లు మార్కెట్ లో ఎన్ని పుట్టుకువచ్చినప్పటికీ భారత్ మాట్రిమోనీ మాత్రం క్రేజ్ తగ్గటం లేదు. అందుకు కారణం కంపెనీ విస్తరణే అని చెప్పవచ్చు. సైట్ లో పెయిడ్ సర్వీసుతో పాటు అడ్వర్టయిజర్ల నుంచి మానిటైజేషన్ ద్వారా అదనపు ఆదాయం సమకూరడం కూడా భారత్ మేట్రిమోనికి కలిసి వచ్చింది. యాహూ, మేఫీల్డ్, కానాన్ లాంటి గ్లోబల్ పార్ట్‌నర్ల ద్వారా గత 17 సంవత్సరాల్లో 99 కోట్ల నిధులను సమీకరించింది.    

అనతి కాలంలోనే ఎదిగిన భారత్ మేట్రిమోనీ తన వ్యాపారాన్ని విస్తరించేందుకు ఐపీవో మార్గాన్ని ఎంచుకుంది. లిస్టింగ్ ద్వారా భారత్ మేట్రిమోనీ మొత్తం 2275 కోట్ల నిధులను రాబట్టింది. నేడు భారత్ మేట్రిమోనీ సుమారు 300 వరకూ కమ్యూనిటీ బేస్డ్ మేట్రిమోనీ సైట్స్ ను కలిగి ఉంది. క్రిష్టియన్ మేట్రిమోనీ, ముస్లిమ్ మేట్రిమోనీ, సిఖ్ మేట్రిమోనీ, జైన్ మేట్రిమోనీ ఇలా ఒక్కో మతానికి, కులానికి, భాషకు ఒక మేట్రిమోనీ సైట్ ఏర్పాటు చేసిన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తిరించింది. 

ఆన్ లైన్ మాట్రిమోని మార్కెట్ ఎంత ? 
రానున్న కాలంలో మాట్రిమోనీ ఫోటో గ్రఫీ, మాట్రిమోని బజార్, మాట్రిమోనీ మండప్స్ లాంటి సరికొత్త వ్యాపారాలతో మొత్తం భారత్ మేట్రిమోనీ విస్తరించనుంది. ఇక ఆన్ లైన్ మేట్రిమోనీ మార్కెట్ చూస్తే రానున్న కాలంలో మరింత విస్తరించునున్నట్లు సర్వేలు తెలుపుతున్నాయి. దేశంలో సుమారు 40 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. అయితే మేట్రిమోనీ డాట్ కామ్ ఈ సెగ్మెంట్ లో సుమారు 60 శాతం మార్కెట్ కలిగి ఉంది. షాది డాట్ కామ్, జీవన్ సాథీ డాట్ కామ్ వీరికి కాంపిటీటర్స్ గా ఉన్నారు.  2008 సంవత్సరంలో 80 మిలియన్ డాలర్ల కంపెనీగా ఉన్న భారత్ మేట్రిమోనీ నేడు సుమారు 300 మిలియన్ డాలర్లు (1943 కోట్ల. రూ.లు)గా ఎదిగింది. అంటే గడిచిన 10 ఏళ్లలో మేట్రిమోనీ మార్కెట్ ఎంతగా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం బిలియన్ డాలర్ల కంపెనీగా మార్చడమే తన లక్ష్యమని జానకీ రామన్ తెలిపారు. ఇప్పుడిప్పుడే చిన్న పట్టణాల్లో విస్తరిస్తున్న భారత్ మేట్రిమోని తన మార్కెట్ మరింత విస్తరించేందుకు సిద్ధంగా ఉంది. ఐపీవో ద్వారా వచ్చిన నిధులతో మేట్రిమోనీ డాట్ కామ్ మరింత విస్తరించేందుకు టెక్నికల్ గా మరింత సామర్థ్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. సుమారు 40 కోట్లతో మాట్రిమోనీ టవర్ నిర్మాణం ద్వారా శాశ్వత ఆఫీస్ ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు మరో 40 కోట్లతో కంపెనీ రుణ భారం తీర్చుకోవడం కూడా తమ ముందున్న లక్ష్యమని జానకీ రామన్ తెలిపారు. Most Popular