మార్కెట్లకు ఇన్ఫోసిస్‌, ఆర్‌ఐఎల్‌ దన్ను!

మార్కెట్లకు ఇన్ఫోసిస్‌, ఆర్‌ఐఎల్‌ దన్ను!

ఆద్యంతమూ కన్సాలిడేషన్‌ బాటలోసాగిన మార్కెట్లు చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. ట్రేడర్లు ఆచితూచి వ్యవహరించడంతో రోజు మొత్తం స్వల్ప స్థాయిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 26 పాయింట్ల స్వల్ప లాభంతో 33,588 వద్ద నిలవగా.. నిఫ్టీ 6 పాయింట్ల నామమాత్ర లాభంతో 10,349 వద్ద స్థిరపడింది. మార్కెట్లకు ప్రధానంగా ఇండెక్స్‌ హెవీవెయిట్స్‌ ఇన్ఫోసిస్‌, ఆర్‌ఐఎల్‌ దన్నునిచ్చాయి!
ఐటీ అండ
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఐటీ రంగం 1 శాతం పుంజుకోవడం ద్వారా మార్కెట్లకు ఆద్యంతమూ అండగా నిలిచింది. పీఎస్‌యూ బ్యాంక్స్‌, మెటల్‌, ఆటో రంగాలు 0.35 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. బ్లూచిప్స్‌లో ఇన్ఫోసిస్‌ 2.5 శాతం, ఆర్‌ఐఎల్‌ 2 శాతం చొప్పున లాభపడటంతో ఇండెక్సులకు బలమొచ్చింది. ఈ బాటలో సన్‌ ఫార్మా, యస్‌బ్యాంక్‌, ఐషర్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌పీసీఎల్‌, పవర్‌గ్రిడ్‌, ఇండస్‌ఇండ్ 2-1 శాతం మధ్య పెరిగాయి. అయితే అదానీ పోర్ట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, బజాజ్‌ ఆటో, ఐబీ హౌసింగ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, గెయిల్‌, అల్ట్రాటెక్‌, హిందాల్కో, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2-1 శాతం మధ్య నీరసించాయి.
చిన్న షేర్లు ఓకే
బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.3 శాతం బలపడగా.. స్మాల్‌ క్యాప్‌ 0.5 శాతం పుంజుకుంది. ట్రేడైన మొత్తం షేర్లలో 1,440 లాభపడితే.. 1,258 నష్టపోయాయి. 
అమ్మకాలు ఆపని ఎఫ్‌పీఐలు
నగదు విభాగంలో గత రెండు రోజుల్లో రూ. 1,100 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) బుధవారం రూ. 441 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. మరోవైపు గత మూడు రోజుల్లో రూ. 2,800 కోట్లు ఇన్వెస్ట్‌ చేసిన దేశీ ఫండ్స్‌(డీఐఐలు) బుధవారం మరో రూ. 837 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి.Most Popular