జున్‌జున్‌వాలా పోర్ట్‌ఫోలియోలో 70 శాతం.. ఈ 10 స్టాక్స్‌లోనే!

జున్‌జున్‌వాలా పోర్ట్‌ఫోలియోలో 70 శాతం.. ఈ 10 స్టాక్స్‌లోనే!

రూ. 9 వేల కోట్లను ఈ 10 స్టాక్స్‌లోనే పెట్టిన జున్‌జున్‌వాలా
రాకేష్ జున్‌జున్‌వాలా పెట్టుబడులపై.. ఇన్వెస్టర్లలో బోలెడంత ఆసక్తి ఉంటుంది. ఆయన ఇన్వెస్ట్ చేశాడంటే.. ఆ కంపెనీలో ఎంతో కొంత విషయం ఉంటుందని అంచనా వేస్తారు. దాదాపు 30కి పైగా కంపెనీలలో రాకేష్ జున్‌జున్‌వాలాకు 1 శాతం పైగా వాటా ఉంది. మొత్తం ఆయన పోర్ట్‌ఫోలియో విలువ రూ. 13 వేల కోట్లు. అంటే ఒక్కో కంపెనీలో కాస్త అటూ ఇటూగా సమానంగా పెట్టుబడి చేస్తారని అనుకోవడం సహజం.

కానీ రాకేష్ జున్‌జున్‌వాలా పెట్టుబడుల్లో 70 శాతం కేవలం 10 స్టాక్స్‌లోనే కావడం విశేషం. అందులో సగభాగం ఒకే కంపెనీలో అంటే ఆశ్చర్యం వేయక మానదు. రాకేష్ జున్‌జున్‌వాలా అధికంగా హోల్డింగ్స్ కలిగిన వాటిలో టాప్-10 కంపెనీల ఇన్వెస్ట్‌మెంట్స్ ‌విలువ రూ. 9204 కోట్లు. ఇందులో టైటాన్ కంపెనీలో చేసిన పెట్టుబడుల విలువ రూ. 4625 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. 

ఇతర కంపెనీల్లో ఎస్కార్ట్స్‌లో ఆయన వాటా విలువ రూ. 784 కోట్లు. లుపిన్‌లో పెట్టుబడుల వాల్యూ రూ. 712 కోట్లు. డీహెచ్ఎఫ్‌ఎల్ ఇన్వెస్ట్‌మెంట్ విలువ రూ. 640 కోట్లు కాగా.. క్రిసిల్‌ వాటాల విలువ రూ. 501 కోట్లు.

అరబిందో ఫార్మా(రూ. 485 కోట్లు), ఫెడరల్ బ్యాంక్ (రూ. 441 కోట్లు), ర్యాలీస్ ఇండియా (రూ. 436 కోట్లు), డెల్టా కార్ప్ (రూ. 304 కోట్లు), కరూర్ వైశ్యా బ్యాంక్ రూ. (రూ. 276 కోట్లు)గా రాకేష్ జున్‌జున్‌వాలా వాటాల విలువ ఉన్నాయి. 

గత వారంలో డెల్టాకార్ప్‌లో 25 లక్షల షేర్లను రేఖా జున్‌జున్‌వాలా రూ. 280.35/షేర్ చొప్పున విక్రయించారు. రీసెంట్‌గా వచ్చిన రిలయన్స్ నిప్పాన్ అస్సెట్ మేనేజ్‌మెంట్ ఐపీఓకు ఈ ఏస్ ఇన్వెస్టర్ దరఖాస్తు చేసుకున్నారు. 

రాకేష్ జున్‌జున్‌వాలాకు ఈ ఏడాది బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఆయన పోర్ట్‌ఫోలియో 19 స్టాక్స్.. సెన్సెక్స్‌కు మించి రాబడులను అందిచాయి. వీటిలో 16 స్టాక్స్ 50 నుంచి 245 శాతం మేర 2017లోనే పెరగడం విశేషం.Most Popular