హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌కు లిస్టింగ్‌ కిక్‌!

హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌కు లిస్టింగ్‌ కిక్‌!

ప్రయివేట్‌ రంగ బీమా కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో ప్రీమియంతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 290కాగా.. ఎన్‌ఎస్ఈలో రూ. 310 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఇది దాదాపు 7 శాతం(రూ. 20) అధికంకాగా.. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రస్తుతం మరింత జోరందుకుంది. 10 శాతంపైగా దూసుకెళ్లి రూ. 341 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 369 వద్ద గరిష్టాన్నీ.. రూ. 307 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఈ నెల 9న ముగిసిన ఇష్యూకి ఇష్యూ దాదాపు 5 రెట్లు అధికంగా స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 8,700 కోట్లను సమీకరించింది. 22 ఏళ్ల తరువాత హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ నుంచి మరో కంపెనీ లిస్టింగ్‌ పొందడం విశేషం! 
2000లో కంపెనీ షురూ
దేశీ గృహ రుణాల దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ.. యూకే దిగ్గజం స్టాండర్డ్‌ లైఫ్‌తో భాగస్వామ్యంతో హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌ను 2000లో ఏర్పాటు చేసింది. కంపెనీలో హెచ్‌డీఎఫ్‌సీకి 61.12 శాతం, స్టాండర్డ్‌ లైఫ్‌కు 34.75 శాతం చొప్పున వాటా ఉంది. ఐపీవో తరువాత కంపెనీలో హెచ్‌డీఎఫ్‌సీ వాటా 51.69 శాతానికి, స్టాండర్డ్‌ లైఫ్‌ వాటా29.35 శాతానికి తగ్గనున్నాయి. 
ఇతర వివరాలివీ
మార్చితో ముగిసిన గతేడాది(2016-17)లో హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌ తాజా బిజినెస్‌ ప్రీమియం 34 శాతం వృద్ధితో రూ. 8696 కోట్లను అధిగమించింది. ఈ సెప్టెంబర్‌కల్లా నిర్వహణలోని ఆస్తుల విలువ(ఏయూఎం) రూ. 99,530 కోట్లకు చేరింది. ఇప్పటికే స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ లిస్టయిన విషయం విదితమే. Most Popular