మూడేళ్లలో 9 త్రైమాసికాలు నష్టాలే! అయినా 4 రెట్లు పెరిగిన షేర్!

మూడేళ్లలో 9 త్రైమాసికాలు నష్టాలే! అయినా 4 రెట్లు పెరిగిన షేర్!


గత మూడేళ్లలో అంటే 12 త్రైమాసికాలకు ఆర్థిక ఫలితాలు ప్రకటిస్తే.. అందులో 9 సార్లు ఓ కంపెనీ నష్టాలను ప్రకటిస్తే.. సాధారణంగా ఆ కంపెనీ ఫ్యూచర్‌పై అనుమానాలు వెల్లువెత్తడం ఖాయం. అలాగే షేర్ ధర కూడా భారీగా పతనం అవుతుందని అందరూ భావిస్తారు. కానీ ఓ కంపెనీ మాత్రం ఇదే సమయంలో 430 శాతంపైగా లాభాలతో దూసుకుపోతోంది. ఆ కంపెనీ ఫ్యూచర్‌పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పేందుకు ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే.

గత ఏడాది కాలంలో 200 శాతం పెరిగిన ఈ షేర్.. ఐదేళ్ల కాలంలో 1300శాతం లాభాలను గడించింది. బుక్ వాల్యూ కంటే 4.76 రెట్లు ఎక్కువ ధర వద్ద ట్రేడవుతున్న ఆ కంపెనీ పేరు.. బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్.

తాజాగా ప్రకటించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించిన బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ ఫలితాలపై ఆశావహ ధోరణిని కోటక్ సెక్యూరిటీస్ ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా బ్రిటానియా ఇండస్ట్రీస్‌లో పెట్టుబడులు ఈ కంపెనీకి సానుకూల ఫలితాలను అందించనున్నాయి.

ప్రస్తుతం రూ. 1600కు ఎగువన ట్రేడవుతున్న బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్.. రాబోయే 6-12 నెలల సమయంలో రూ. 2025కు చేరుకునే అవకాశాలున్నాయని కోటక్ సెక్యూరిటీస్ అంటోంది. బ్రిటానియా ఇండస్ట్రీస్‌లో బాంబే బర్మాకు 50.75 శాతం వాటా ఉంది. అలాగే బాంబే డైయింగ్ కంపెనీలో 15.28 శాతం వాటాను కలిగి ఉంది. బ్రిటానియాలో ఉన్న వాటా విలువ రూ. 2900 కోట్లకు సమానం కాగా.. బాంబే డైయింగ్‌లో వాటా విలువ రూ. 650 కోట్లు.

కంపెనీ ఎంటర్‌ప్రైజ్ విలువ రూ. 1156 కోట్లతో పోల్చితే.. ఈ రెండు కంపెనీలలో పెట్టుబడుల విలువ 61 శాతం డిస్కౌంట్‌తో ఉంది. మ్యూచువల్ ఫండ్స్‌తో పాటు ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు కూడా ఈ వాడియా గ్రూప్ కంపెనీపై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు, హెచ్‌ఎన్‌ఐల వాటా 15 శాతం కంటే కొంత ఎక్కువగా ఉంది. 2018లో రిటైల్ స్పెండింగ్ పెరిగే అవకాశం ఉండడం.. ఈ కంపెనీకి సానుకూల అంశంగా నిపుణులు చెబుతున్నారు.
 Most Popular