చమురు ధరలపై అమెరికా మబ్బులు!

చమురు ధరలపై అమెరికా మబ్బులు!

సౌదీ అరేబియా అమలు చేస్తున్న ఉత్పత్తిలో కోతల కారణంగా ఇటీవల ఊపందుకున్న చమురు ధరలపై ఒక్కసారిగా అమెరికా నీళ్లు చల్లింది. దీంతో మంగళవారం 1.5 శాతం పతనమైన చమురు ధరలు బుధవారం మరోసారి 1 శాతంపైగా క్షీణించాయి. ప్రస్తుతం లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 1.15 శాతం తిరోగమించి 61.51 డాలర్లకు చేరింది. గత వారం 64 డాలర్లను అధిగమించడం ద్వారా రెండున్నరేళ్ల గరిష్టాన్ని తాకిన సంగతి తెలిసిందే. 
ఇక న్యూయార్క్‌ మార్కెట్లోనూ మంగళవారం దాదాపు 2 శాతం కుప్పకూలిన  నైమెక్స్‌ చమురు బ్యారల్‌ ప్రస్తుతం మరోసారి 1.1 శాతం వెనకడుగు వేసింది. 55.12 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 
ఏం జరిగిందంటే?
ఇటీవల జోరందుకున్న షేల్‌గ్యాస్‌ తదితర కార్యకలాపాల కారణంగా ఇకపై అమెరికాలో చమురు ఉత్పత్తి భారీగా పెరగనున్నట్లు అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ(ఐఈఏ) తాజాగా పేర్కొంది. దీంతో 2025కల్లా ప్రపంచంలోనే చమురును అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశంగా అమెరికా నిలవనున్నట్లు అంచనా వేసింది. అంతేకాకుండా రెండేళ్లపాటు రోజుకి లక్ష బ్యారళ్ల చొప్పున చమురుకు డిమాండ్‌ తగ్గనున్నట్లు అభిప్రాయపడింది. దీంతో ఒక్కసారిగా చమురు ఫ్యూచర్స్‌లో అమ్మకాలు పెరిగినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
క్యూ1లో ఉత్పత్తి
2018 తొలి క్వార్టర్‌లో చమురు ఉత్పత్తి డిమాండ్‌ను మించిపోనున్నట్లు ఐఈఏ తాజాగా అంచనా వేసింది. రోజుకి 6 లక్షల బ్యారళ్లమేర అధిక ఉత్పత్తికి వీలున్నట్లు పేర్కొంది. ఇది క్యూ2కల్లా 2 లక్షల బ్యారళ్ల మిగులుకు దారితీయనున్నట్లు అభిప్రాయపడింది. అయితే ముందు వేసిన అంచనాలకు అనుగుణంగా వచ్చే ఏడాది 10 కోట్ల బ్యారళ్ల డిమాండ్‌లో మార్పులేకున్నప్పటికీ సరఫరా దీనిని మించే అవకాశమున్నట్లు వివరించింది.
కోతల అమలు..
ధరలను నిలిపేందుకు సౌదీ అరేబియా అధ్యక్షతన ఒపెక్‌ దేశాలు చమురు ఉత్పత్తిలో రోజుకి 1.8 మిలియన్‌ బ్యారళ్ల చొప్పున కోతను అమలు చేస్తుండటంతో ఇటీవల ధరలు బలపడుతూ వచ్చాయి. ఇందుకు రష్యా సైతం జత కలవడంతో గత వారం బ్రెంట్‌ చమురు 64 డాలర్లను దాటేసింది.
కొసమెరుపు
చమురు ధరలు దిగివస్తున్న నేపథ్యంలో దేశీయంగా ఆయిల్‌ మార్కెటింగ్‌ కౌంటర్లు జోరందుకున్నాయి. హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐవోసీ ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 2-1 శాతం బలపడి కదులుతున్నాయి. అయితే చమురు ఉత్పాదక సంస్థ ఓఎన్‌జీసీ మాత్రం 1.7 శాతం నీరసించింది.Most Popular