నిరాశ పరచిన న్యూ ఇండియా లిస్టింగ్!

నిరాశ పరచిన న్యూ ఇండియా లిస్టింగ్!

కేంద్ర ప్రభుత్వ సంస్థ న్యూ ఇండియా ఎస్యూరెన్స్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో తొలి రోజు నష్టాలతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 800కాగా.. ఎన్‌ఎస్‌ఈలో  రూ. 67(8.4 శాతం) నష్టంతో రూ. 733 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ప్రస్తుతం 9.5 శాతం పతనమై రూ. 723 వద్ద ట్రేడవుతోంది. ప్రభుత్వ రంగానికే చెందిన బీమా దిగ్గజం ఎల్‌ఐసీ అండగా నిలవడంతో న్యూ ఇండియా  పబ్లిక్‌ ఇష్యూ గట్టెక్కిన విషయం విదితమే. రూ. 9,600 కోట్ల ఇష్యూ చివరి రోజు(3)కల్లా 1.2 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలయ్యాయి. దీనిలో ఎల్‌ఐసీ ఒక్కటే సుమారు రూ. 6500 కోట్ల విలువైన బిడ్స్‌ దాఖలు చేసినట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఐపీవోలో భాగంగా 14.56 శాతం వాటాకు సమానమైన 12 కోట్ల షేర్లను అమ్మడం ద్వారా.. న్యూ ఇండియా ఎస్యూరెన్స్‌లో ప్రభుత్వ వాటా 85.44 శాతానికి చేరింది. 
ఇతర వివరాలివీ
1919లో ఏర్పాటైన న్యూ ఇండియా ఎస్యూరెన్స్‌ ప్రధానంగా క్లయింట్లకు విభిన్న ఇన్సూరెన్స్‌ సర్వీసులను అందిస్తోంది. అగ్నిప్రమాదాలు, మోటార్, మెరైన్‌, పంటలు, ఆరోగ్యం తదితర పలు బీమా విభాగాలలో కార్యకలాపాలను విస్తరించింది. గత నాలుగేళ్లలో స్థూల ప్రీమియంలు వార్షికంగా 15 శాతం చొప్పున వృద్ధి చూపుతూ వచ్చాయి. 2017కల్లా రూ. 23,230 కోట్లను అధిగమించాయి. గతేడాది(201617)లో కంపెనీ ఆదాయం 16 శాతం పెరిగి రూ. 20,471 కోట్లను అధిగమించింది. నికర లాభం మాత్రం 9 శాతం క్షీణించి రూ. 840 కోట్లకు పరిమితమైంది. Most Popular