3 కంపెనీలుగా అరవింద్‌ లిమిటెడ్‌!

3 కంపెనీలుగా అరవింద్‌ లిమిటెడ్‌!

టెక్స్‌టైల్స్‌ తయారీ దిగ్గజం అరవింద్‌ లిమిటెడ్‌ మూడు కంపెనీలుగా విడిపోనుంది. ఇందుకు బోర్డు అనుమతించినట్లు తాజాగా అరవింద్‌ పేర్కొంది. ఈ అంతేకాకుండా ఏడాది క్యూ2(జూలై-సెప్టెంబర్‌)లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. దీంతో ఈ కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 5.3 శాతం పతనమై రూ. 431 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 427 వరకూ నీరసించింది.
అరవింద్‌ ఫ్యాషన్స్‌
బ్రాండెడ్‌ దుస్తుల విభాగాన్ని అరవింద్‌ ఫ్యాషన్స్‌గా విభజించనున్నట్లు అరవింద్‌ లిమిటెడ్‌ పేర్కొంది. ఇక ఇంజినీరింగ్‌ విభాగాన్ని అన్వేషణ్‌ పేరుతో ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేసింది. విభజనలో భాగంగా కంపెనీలకు లేదా వాటాదారులకు ఎలాంటి నగదునూ చెల్లించబోమంటూ వివరించింది. రెండు కంపెనీలనూ బీఎస్ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టింగ్‌ చేయనున్నట్లు వెల్లడించింది. అరవింద్‌ లిమిటెడ్‌లో గల ప్రతీ 5 షేర్లకుగాను 1 అరవింద్‌ ఫ్యాషన్‌ షేరుని జారీ చేయనున్నట్లు తెలియజేసింది. ఈ బాటలో 27 అరవింద్‌ షేర్లకుగాను 1 అన్వేషణ్‌ షేరుని కేటాయించనున్నట్లు వివరించింది. 
క్యూ2 ఫలితాలు.. ప్చ్‌!
క్యూ2లో అరవింద్‌ లిమిటెడ్‌ నికర లాభం 16 శాతం తగ్గి రూ. 64 కోట్లకు పరిమితమైంది. ఆదాయం 13 శాతం పెరిగి రూ. 2628 కోట్లను తాకగా..  ఇబిటా రూ. 212 కోట్లకు చేరింది. దీంతో ఈ కౌంటర్లో అమ్మకాలు పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు.Most Popular