హిందుస్తాన్‌ కాపర్‌ ర్యాలీ వెనుక బలం?!

హిందుస్తాన్‌ కాపర్‌ ర్యాలీ వెనుక బలం?!

గత నెల రోజులుగా ప్రభుత్వ రంగ దిగ్గజం హిందుస్తాన్‌ కాపర్‌ కౌంటర్‌ రేసు గుర్రంలా దౌడు తీస్తోంది. సోమవారం సైతం ఈ షేరు 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. ప్రస్తుతం బీఎస్‌ఈలో 1 శాతం బలపడి రూ. 105 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 110 వరకూ ఎగసింది. దీంతో గత నెల రోజుల్లో ఈ స్టాక్‌ 63 శాతం దూసుకెళ్లినట్లయ్యింది!
కాపర్‌ ధరల పెరుగుదల
లండన్‌ మెటల్‌ ఎక్స్ఛేంజీలో గత ఆరు నెలల్లో కాపర్‌ ధరలు 30 శాతం వరకూ పెరిగాయి. దీంతో హిందుస్తాన్‌ కాపర్‌ కౌంటర్‌కు ఉన్నట్టుండి రెక్కలొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దేశీయంగా కాపర్‌ మైనింగ్‌ కార్యకలాపాలు కలిగిన ఏకైక సంస్థ హింద్‌ కాపర్‌కాగా.. సెప్టెంబర్‌ త్రైమాసికం(క్యూ2) నుంచీ కాపర్‌ ధరల్లో పెరుగుదల పనితీరులో ప్రతిఫలించనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కాపర్‌ బిజినెస్‌లో సమీకృత కార్యకలాపాలు కలిగిన కంపెనీగా హిందుస్తాన్‌ కాపర్‌కు అడ్వాంటేజీ ఉన్నట్లు పేర్కొంటున్నారు.
జూన్‌లో టర్న్‌అరౌండ్‌
ఈ ఏడాది తొలి క్వార్టర్‌(ఏప్రిల్‌-జూన్‌)లో హిందుస్తాన్‌ కాపర్‌ టర్న్‌అరౌండ్‌ సాధించడం ద్వారా ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ1లో రూ. 10 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ1లో రూ. 3 కోట్ల  నికర నష్టం నమోదుకాగా.. మొత్తం ఆదాయం సైతం78 శాతం జంప్‌చేసి రూ. 367 కోట్లకు చేరింది. 
విస్తరణపై దృష్టి
మార్చితో ముగిసిన గతేడాదిలో కంపెనీ కాపర్‌ తయారీ సామర్థ్యాన్ని నాలుగు రెట్లు పెంచే ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం కంపెనీ కాపర్‌ సామర్థ్యం 3.85 మిలియన్‌ టన్నులుకాగా.. 12.4 మిలియన్‌ టన్నులకు పెంచే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం ఓపెన్‌ కాస్ట్ మైనింగ్‌ కార్యకలాపాలకే పెద్దపీట వేస్తుండగా.. ఇకపై భూమిలోపల తవ్వకాలకూ ప్రాధాన్యమివ్వనున్నట్లు వార్షిక నివేదికలో తెలియజేసింది. 2010 అంచనాల ప్రకారం కంపెనీ వార్షిక ఉత్పత్తితో పోలిస్తే 100 రెట్లు అధికంగా కాపర్‌ రిజర్వులను కలిగి ఉంది. 
రుణ భారం తక్కువే
కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 9,600 కోట్లుకాగా.. విస్తరణ కార్యక్రమాలకు రూ. 5,000 కోట్లను వెచ్చించాలని చూస్తోంది. కంపెనీకి నికరంగా రూ. 407 కోట్ల రుణభారం మాత్రమే ఉండటం గమనించదగ్గ విషయం!
కొసమెరుపు
నిజానికి కంపెనీ ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థ కావడం బలహీనతగా మార్కెట్‌ వర్గాలు వ్యాఖ్యానిస్తుంటాయి. తాజాగా కంపెనీని ప్రయివేటైజ్‌ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మార్కెట్లో వినిపిస్తుండటంతో ఈ కౌంటర్‌కు మరింత బలమొచ్చినట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.Most Popular