అప్పుల్లో మునిగి అనుభవం తెచ్చుకుని...చిప్స్ వ్యాపారాన్ని రూ.3 వేల కోట్ల స్థాయికి తీసుకొచ్చాడు

అప్పుల్లో మునిగి అనుభవం తెచ్చుకుని...చిప్స్ వ్యాపారాన్ని రూ.3 వేల కోట్ల స్థాయికి తీసుకొచ్చాడు

బట్టల వ్యాపారంలో దాదాపు దివాళా తీశాడు. కాని తన తెలివితేటలతో మల్టీ బిలియన్‌ డాలర్ కంపెనీకి ఓనర్‌ అయ్యాడు. అతనేవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

పట్టుమని పాతికేళ్లు కూడా లేవు. అప్పుడే(1992లో) అమెరికాలోని లూసియానా స్టేట్‌ యూనివర్సిటీ నుంచి మాస్టర్‌ డిగ్రీ పట్టా పట్టుకుని భారత్‌లో అడుగుపెట్టాడు ప్రతాప్‌ స్నాక్స్‌ ప్రమోటర్‌ అమిత్‌ కుమాత్‌. ఉద్యోగం చేద్దామా.. లేక వ్యాపారం చేద్దామా.. ఏమీ తేల్చుకోలేకపోయాడు. చివరకు తన తండ్రికి సహాయంగా ఉండి బిజినెస్‌లో మెళకువలు నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇండోర్‌లో ఉన్న "బిజి బజార్‌"లోని తమ వోల్‌సేల్‌ క్లాత్‌ స్టోర్‌లో పనిచేయాలనుకున్నాడు. నైలాన్‌, కాటన్‌, లెనిన్‌ దుస్తులను వోల్‌సేల్‌గా విక్రయించి తమ స్టోర్‌ ద్వారా భారీ లాభాలను సంపాదించాలనుకున్నాడు. రెండేళ్లు అత్తెసరు లాభాలతో ఎలాగో స్టోర్‌ను నెట్టుకొచ్చాడు. భారతీయులు బేరమారడంతో సిద్ధహస్తులు కావడంతో ఆ తర్వాత కష్టాలు ప్రారంభమయ్యాయి. నిర్వహణ ఖర్చులు పెరగడం, లాభాలు తగ్గడంతో దాదాపు దివాళా స్థితికి చేరుకున్నాడు. అప్పులు తెచ్చి మరీ వివిధ ప్రాంతాలకు తమ దుస్తుల వ్యాపారాన్ని విస్తరించినప్పటికీ అందులో సక్సెస్‌ కాలేకపోయాడు. ఆ తర్వాత ప్రారంభించిన కెమికల్‌ డ్రై వ్యాపారంలోనూ ఆశించిన లాభాలు రాలేవు. ఏ వ్యాపారం చేసినా నష్టాలే తప్పా నయా పైసా లాభం రావడం లేదు. దీంతో ఏ చేస్తే బాగుంటుందని తన ఫ్యామిలీ ఫ్రెండ్‌ను సంప్రదించాడు.

అదే ఆయన టర్నింగ్‌ పాయింట్‌..

తమ కుటుంబ మిత్రుడు, తన అన్న క్లాస్‌మేట్‌ అయిన అపూర్వ కామత్‌ ఇచ్చిన సలహా తన భవిష్యత్‌ రూపురేఖలను మార్చిందని అంటున్నాడు ప్రతాప్‌ స్నాక్‌ సీఈవో అమిత్‌ కుమాత్‌. కేవలం రూ.15 లక్షల పెట్టుబడితో 2009లో బిజినెస్‌ను ప్రారంభించి ఆ తర్వాత తన వ్యాపార సామ్రాజ్యాన్ని క్రమక్రమంగా విస్తరించాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీలోనూ తమ కంపెనీని లిస్ట్‌ చేశాడు. ప్రస్తుతం కంపెనీ ప్రమోటర్లుగా అమిత్‌ కుమాత్‌తో పాటు అర్వింద్‌ మెహతా, అపూర్వ కుమాత్‌, రాజేశ్‌ మెహతా, నవీన్‌ మెహతా, అరుణ్‌ మెహతా, కాంతా మెహతా, రిటా మెహతా, ప్రేమలతా కుమాత్‌, స్వాతి బప్నా, రాఖి కుమాత్‌, సంధ్యా కుమాత్‌, ఎస్‌సీఐ గ్రోత్‌ ఇన్వెస్ట్‌మెంట్‌-2లు ఉన్నారు. 

2009లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఏర్పాటైన కంపెనీ ప్రధానంగా పొటాటో చిప్స్‌ తయారీకి ప్రసిద్ధి చెందింది. యెల్లో డైమండ్‌ పేరుతో విభిన్న రుచులు, పరిమాణాలలో వీటిని విక్రయిస్తోంది. 2016 నాటికి దేశంలోని టాప్ 6 చిరుతిళ్ల కంపెనీల్లో ఒకటిగా నిలపడంతో కంపెనీ సీఈఓ అమిత్‌ కుమాత్‌ విశేషంగా కృషి చేశారు. ఇతర స్నాక్ కంపెనీలతో పోల్చితే ఇది ప్రతీ ఏటా వైవిధ్యమైన ఉత్పత్తులను అందిస్తూ ఈ సంస్థ మార్కెట్‌ లీడర్‌గా అవతరించింది.

కంపెనీని ప్రారంభించిన 18 నెలల తర్వాత తమ కష్టానికి ప్రతిఫలం వచ్చిందని, స్నాక్స్‌ మార్కెట్లో తాము దేశంలోనే అగ్రగామి సంస్థల్లో ఒకటిగా నిలిచామని అమిత్‌ కుమాత్‌ చెప్పారు. తమ వ్యాపారంలో 42 శాతం రింగ్స్‌కు సంబంధించిన ఉత్పత్తులు, 26శాతం చిప్స్‌కు సంబంధించిన వెరైటీ ఉత్పత్తులు ఉన్నాయని ఆయన చెప్పారు. రోజుకు 40 లక్షల ప్యాకెట్లను తయారు చేస్తామని, పిల్లలను ఆకట్టు కోవడానికి ప్రతి ప్యాకెట్‌ లోపల ఏదో ఒక బొమ్మను వేసి కస్టమర్లకు కేవలం రూ.5కే అందిస్తామని కంపెనీ సీఎఫ్‌ఓ సుమిత్‌ శర్మా చెబుతున్నారు. ఈ నిర్ణయం తమ సీఈఓ తీసుకున్నదని, దీంతో స్నాక్స్‌ మార్కెట్లో తాము వేగంగా వృద్ధి చెందుతున్నట్టు శర్మా వివరించారు. 

వచ్చే రెండేళ్ళలో కంపెనీని బిలియన్‌ డాలర్‌ కంపెనీగా మార్చడానికి కసరత్తు చేస్తున్నట్టు అమిత్‌ కుమాత్‌ వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.2,737 కోట్లు (నవంబర్‌ 3నాటికి)గా ఉందని వచ్చే రెండేళ్ళలో దీనిని రెండున్నర రెట్లు పెంచనున్నట్టు ఆయన చెప్పారు. Most Popular