గ్రాఫైట్‌ తయారీ షేర్ల దూకుడు...!

గ్రాఫైట్‌ తయారీ షేర్ల దూకుడు...!

 ఈ ఏడాది ర్యాలీ బాటలో సాగుతున్న గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌ తయారీ సంస్థలు మరోసారి వెలుగులో నిలుస్తున్నాయి. హెచ్‌ఈజీ, గ్రాఫైట్‌ ఇండియా కౌంటర్లకు మరోసారి డిమాండ్‌ ఏర్పడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ప్రస్తుతం బీఎస్ఈలో హెచ్‌ఈజీ షేరు 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 88 ఎగసి రూ. 1841 సమీపంలో నిలిచింది. ఇది సరికొత్త గరిష్టంకాగా..  ఈ ఏడాది ఇప్పటివరకూ హెచ్‌ఈజీ షేరు ఏకంగా 1130 శాతం దూసుకెళ్లింది! రూ. 150 నుంచి రూ. 1840కు ర్యాలీ చేసింది. ఇదే కాలంలో సెన్సెక్స్‌ 26 శాతమే లాభపడింది! ఇక గ్రాఫైట్‌ ఇండియా సైతం 5 శాతం అప్పర్‌ సర్య్యూట్‌ను తాకి రూ. 575 వద్ద ఫ్రీజ్‌ అయ్యింది. ఇది కూడా సరికొత్త గరిష్టంకావడం విశేషం!! ఈ స్టాక్‌ సైతం 2017లో రూ. 73 నుంచి 700 శాతం జంప్‌చేసి రూ. 575కు చేరింది!
కారణాలేంటి?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2(జూలై-సెప్టెంబర్‌)లో హెచ్‌ఈజీ టర్న్‌అరౌండ్‌ ఫలితాలు సాధించింది. గతేడాది క్యూ2లో నమోదైన రూ. 14 కోట్ల నికర నష్టంతో పోలిస్తే రూ. 114 కోట్ల నికర లాభం ఆర్జించింది. గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్‌ తయారీ సంస్థ హెచ్‌ఈజీ సాధించనున్న ఫలితాలపై అంచనాలే ఈ కౌంటర్‌పట్ల ఆకర్షణను పెంచుతూ వచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. గతేడాది మొత్తంగా రూ. 50 కోట్ల నికర లాభం ఆర్జించగా.. ఒక్క త్రైమాసికంలోనే రూ. 114 కోట్ల నికర లాభం ఆర్జించడం షేరు దూకుడుకు కారణమని తెలియజేశారు.
డిమాండ్‌ అప్‌
గత కొన్నేళ్లుగా సరైన గిరాకీ లేక నష్టాల బాటలో సాగిన గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌ తయారీ సంస్థలు గత కొంత కాలంగా ఊపందుకున్న డిమాండ్‌తో టర్న్‌అరౌండ్‌ ఫలితాలు సాధిస్తున్నాయి. కంపెనీలు లాభాల బాట పట్టనున్న అంచనాలతో మార్కెట్‌ వర్గాలు ఈ కౌంటర్లపై ఇటీవల దృష్టిపెడుతూ వచ్చాయి. గతంలో చైనా నుంచి సరఫరాలు పెరగడానికితోడు అంతర్జాతీయ మార్కెట్లలోనూ ధరలు క్షీణించడంతో ఈ పరిశ్రమ నీరసించింది. గతేడాది చివర్లో చైనా పర్యావరణ పరిరక్షణ కారణంగా కొన్ని స్టీల్‌, గ్రాఫైట్‌ పరిశ్రమలను మూసివేసింది. ఇదే సమయంలో ఇటు దేశీయంగానూ అటు  విదేశాలలోనూ స్టీల్‌ పరిశ్రమ పుంజుకోవడం ప్రారంభమైంది. వెరసి దేశీ గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌కు దేశ, విదేశాలలో డిమాండ్‌ పెరుగుతూ వచ్చింది. 
గ్రాఫైట్‌ పటిష్ట పనితీరు 
గ్రాఫైట్‌ ఇండియా సైతం ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో పటిష్ట పనితీరును ప్రదర్శించింది. ఏప్రిల్‌- సెప్టెంబర్‌ కాలంలో రూ. 119 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది తొలి అర్ధభాగంలో రూ. 27 కోట్లు మాత్రమే ఆర్జించగా.. ఏడాది మొత్తం రూ. 112 కోట్ల లాభం మాత్రమే సాధించింది! Most Popular