బ్యాంకుల్లోనూ చిన్న మొత్తాల పొదుపు పథకాలకు గ్రీన్ సిగ్నల్

బ్యాంకుల్లోనూ చిన్న మొత్తాల పొదుపు పథకాలకు గ్రీన్ సిగ్నల్


పొదుపు మొత్తాలను ప్రోత్సహించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ బ్యాంకులతో పాటు 3 టాప్ ప్రైవేట్ బ్యాంకులకు కూడా పలు రకాల చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేషనల్ సేవింగ్స్ సేవింగ్స్ సర్టిఫికేట్స్, రికరింగ్ డిపాజిట్స్, మంత్లీ ఇన్‌కం ప్లాన్స్ వంటి పథకాల్లో డిపాజిట్స్‌ను అంగీకరించేందుకు బ్యాంకులకు కూడా అవకాశం కల్పించింది.

ఇప్పటివరకూ చిన్న మొత్తాల పొదుపు పథకాలను దాదాపుగా పోస్ట్ఆఫీస్‌ల ద్వారా మాత్రమే విక్రయించేవారు. కానీ ఇప్పుడు నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ స్కీమ్ 1981, నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్‌కం అకౌంట్ స్కీమ్ 1987, నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ 1981‌లతో పాటు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ 8వ ఇష్యూలను ఇకపై బ్యాంకులు కూడా విక్రయించవచ్చంటూ తాజాగా కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.

తాజా నోటిఫికేషన్ ప్రకారం అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు కూడా ఈ పోర్ట్‌ఫోలియోలలో సబ్‌స్క్రిప్షన్‌ను అంగీకరించవచ్చు. వీటితో పాటు ఇప్పటికే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, కిసాన్ వికాస్ పత్ర-2014, సుకన్య సమృద్ధి అకౌంట్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్-2004లలో పెట్టుబడులను కూడా ఈ బ్యాంకులు అంగీకరించవచ్చు.
చిన్న మొత్తాల పొదుపులను సేకరించేందుకు బ్యాంకులకు కూడా అవకాశం కల్పించడంతో.. ఈ పథకాల్లో నిధులు అధికంగా జమయ్యే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి.
చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి గాను గత వడ్డీ రేట్లనే కొనసాగిస్తూ కేంద్రం గత నెలలో నిర్ణయం ప్రకటించింది. గతేడాది ఏప్రిల్ నుంచి స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌లపై వడ్డీలను కేంద్రం 3నెలలకు ఓ మారు సవరించేలా నిర్ణయం తీసుకుంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ స్కీమ్‌లో పెట్టుబడులపై 7.8 శాతం వడ్డీ లభిస్తుండగా.. కిసాన్ వికాస్ పత్రాలపై 7.5 వడ్డీ లభించనుంది. వీటి మెచ్యూరిటీ వ్యవధి 115 నెలలు.

ఒకే బాలిక ఉన్న కుటుంబాలకు ప్రస్తుతం సుకన్య సమృద్ధి అకౌంట్ స్కీమ్‌పై వార్షికంగా 8.3 శాతం వడ్డీ అందిస్తున్నారు. అలాగే ఏళ్ల సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌కు కూడా 8.3 శాతం వడ్డీ ఇస్తున్నారు. Most Popular