ఐపీఓల్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసా?

ఐపీఓల్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసా?

ఈ మధ్యకాలంలో లిస్టింగ్ గెయిన్స్‌తోనే దాదాపు ఏడాది ఆగితే కానీ దక్కని లాభాలు సొంతం చేసుకుంటున్నారు ఇన్వెస్టర్లు. ఇంతగా లాభాలు అన్ని ఐపీఓలు ఇవ్వకపోవచ్చు. మరి ఓ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌ మంచి లాభాలు పంచుతుందని ముందే
తెలుసుకోవడం, ప్రాఫిట్స్ తెచ్చుకోవడం అంత సులభంగా సాధ్యమయ్యే పని కాదు. కానీ మీరు చదివే ఈ స్టోరీలో కొన్ని విషయాలు తెలుసుకుంటే ఆ పని కాస్త సులువు అవుతుంది

అప్పటిదాకా ఓ ప్రవేట్ సంస్థగా ఉన్న కంపెనీ ఐపిఓకి రావడంతోనే పబ్లిక్ కంపెనీగా మారుతుంది. తన సంస్థలోని వాటాలను కొంత రేటు ఫిక్స్ చేసి ఓపెన్‌గా ఆఫర్ ఇవ్వడమే ఐపీఓగా అర్ధం చేసుకోవచ్చు.  అలా ఈ ఏడాది కేలండర్ ఇయర్‌లో మరో రూ.11,200కోట్ల
మేర ఇష్యూలు రానున్నాయ్. ఈ దశలో ఇన్వెస్టర్లు గమనించాల్సిన అంశాలు ఏమిటయ్యా అంటే, 

ప్రమోటర్స్ క్రెడిబులిటీ(విశ్వసనీయత)
సంస్థ యొక్క గత పనితీరు, లేదంటే ప్రమోటర్ ఇదివరకు చేపట్టిన ప్రాజెక్టులు, నిర్వహణలో నడుస్తోన్న కంపెనీల చరిత్ర, వాటి సమర్ధత ఇలాంటి అంశాలన్నీ కలిపి ప్రమోటర్ క్రెడిబులిటీని నిర్ణయిస్తాయి.మరి ప్రమోటర్ తాలుకూ వివరాలు కావాలంటే ఫైనాన్షియల్ మేటర్స్ ప్రచురించే పేపర్లు, మేగజైన్లు చూసి తెలుసుకోవచ్చు

ప్రాజెక్ట్ డీటైల్స్
 చేపట్టిన ప్రాజెక్టు, అందులో వాటా, రాబోయే రోజుల్లో ఆ ప్రాజెక్టు లాభదాయకత వంటివి దృష్టిలో ఉంచుకోవాలి.ఇంతవరకూ ఆపరేషన్సే(లావాదేవీలు, వ్యాపారం)ప్రారంభించని కంపెనీ ఐపీఓకి వస్తుంటే అలాంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేయకుండా ఉండటమే
ఉత్తమం. అలానే వ్యాపారం ప్రారంభించిన కొన్ని ఏళ్లకి కానీ లాభాలు కానీ..ఆదాయం కానీ రాని సంస్థలజోలికే వెళ్లవద్దని కొంతమంది సలహా! 

యాజమాన్యం సమర్ధత
సంస్థ ప్రమోటర్లు కానీ బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్‌ సమర్ధత కూడా తెలుసుకోవాలి. నేరచరిత్ర, మోసపూరిత ప్రవర్తన ఉన్నవాళ్లతో కలిగి ఉన్నబోర్డు చివరికి ఇన్వెస్టర్లని ముంచడానికే తెలివితేటలు ప్రదర్శిస్తారు కానీ..కంపెనీకి వచ్చిన లాభాల్లో డివిడెండ్ రూపంలోకానీ ఇంకే ఇతర
రూపంలోకానీ వాటాదారులకు లాభాలు పంచరు. ఇది చరిత్ర చెప్తోన్న' సత్యం'. ఇందుకు కొందరు కేంద్రమంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రమోటర్లుగా ఉన్న సంస్థల తీరు కూడా ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. అలానే బోర్డులో తగినంత మంది డైరక్టర్లు (ఇండిపెండెంట్)
హోదాలో ఉండాలి.

ఉత్పత్తి / ఐపీఓ చేసే వ్యాపారం
ఓ కొత్త ఉత్పత్తిని ప్రమోట్ చేసే ఐపిఓ కానీ, ఇప్పటికే మార్కెట్లో డిమాండ్ ఉన్న ఉత్పత్తులు, ఓ కొత్త సంచలనానికి దారి తీసే వ్యాపారం చేసే ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఐతే అవి మరీ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని బేస్ చేసుకునేవి ఐతే లాభాలు వచ్చే సమయానికి మన
సహనం నశించవచ్చు.

విదేశీ భాగస్వామ్య సంస్థలు
సాంకేతికపరంగా కానీ, పూర్తైన ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో కానీ విదేశీ సంస్థలతో ఒప్పందాలు, భాగస్వామ్యాలు మనం కొనుగోలు చేసే ఐపీఓకి ఉన్నాయేమో చూడాలి. వాటి సమర్ధత, రెపుటేషన్‌తో పాటు మార్కెట్లో ఆయా ఉత్పత్తులకి డిమాండ్ ఎలా ఉందో చూడాలి. విదేశీ కంపెనీలకు వాటాలున్న ఐపీఓలను సాధారణంగా మంచి కంపెనీలుగా చెప్తుంటారు. ఎందుకంటే ఆ కంపెనీలపై ఎంతో నమ్మకం ఉఁటేనే కానీ ఫారిన్ కంపెనీలు పార్ట్‌నర్‌షిప్‌కి ఒప్పుకోరు. 

 ఐపిఓ ఇష్యూ సైజ్
అందరికీ తెలిసిన కంపెనీలు భారీ ఎత్తున నిధుల సమీకరణకు వస్తుంటే అలాంటి ఇష్యూలకి అప్లై చేయాల్సిందిగా చాలామంది అనలిస్టులు సూచిస్తుంటారు. పెద్ద సంఖ్యలో ఇష్యూకి రావడమంటే అలాట్‌మెంట్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని దీన్నిఅర్ధం చేసుకోవాలి.ఇంకా ఇతర అంశాల కోసం ఖచ్చితంగా రెడ్‌హెరింగ్ ప్రోస్పెక్టస్‌ని చదవాలి. అందులోనే కంపెనీకి సంబంధించిన అన్ని అంశాలూ పొందుపరిచిఉంటారు. చిన్న చిన్న అక్షరాలతో ఉన్నా అవే కంపెనీ అసలు లక్ష్యాలతో పాటు పైన చెప్పిన విషయాల్లో చాలావరకూ ప్రాస్పెక్టస్‌లోనే దాగి ఉంటాయ్.
 Most Popular