లాభాల ఓపెనింగ్‌ చాన్స్‌?!

లాభాల ఓపెనింగ్‌ చాన్స్‌?!

దేశీ స్టాక్ మార్కెట్లు నేడు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్ నిఫ్టీ) 35 పాయింట్లు పుంజుకుని 10,023 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. బుధవారం ట్రేడింగ్లో నిఫ్టీ రోజు మొత్తం పటిష్ట లాభాలతో కదిలినప్పటికీ చివర్లో ఊపందుకున్న అమ్మకాలతో తిరిగి 10,000 పాయింట్ల మార్క్‌ను కోల్పోయింది. 32 పాయింట్లు క్షీణించి 9,985 వద్ద ముగిసింది. కాగా.. ఇటీవల లాభాల బాటలో సాగుతున్న అమెరికా స్టాక్‌ మార్కెట్లు బుధవారం మరోసారి మరోసారి సరికొత్త గరిష్టాల వద్ద ముగియడంతో నేడు దేశీయంగానూ ఆ ప్రభావం కనిపించే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
నిఫ్టీ కదలికలిలా
నేటి ట్రేడింగ్‌లో నిఫ్టీకి  9,938-9,891 పాయింట్ల వద్ద మద్దతు లభించగలదని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఇదే విధంగా 10,049-10,114 స్థాయిల వద్ద అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని... అంచనా వేశారు. 
నెమ్మదించిన ఎఫ్‌పీఐలు
సెప్టెంబర్‌ మొదలు దేశీ స్టాక్స్‌ నుంచి పెట్టుబడుల ఉపసంహరణకే ప్రాధాన్యమిస్తూ వస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) బుధవారం కాస్త నెమ్మదించారు. నగదు విభాగంలో రూ. 108 కోట్ల విలువైన స్టాక్స్‌ మాత్రమే విక్రయించారు. గత 8 రోజుల్లో ఎఫ్‌పీఐలు రూ. 11,000  కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఎఫ్‌పీఐలకు ధీటుగా గత 8 రోజుల్లో రూ. 11,400 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన దేశీ ఫండ్స్ (డీఐఐలు) బుధవారం రూ. 234 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి!Most Popular