జీఐసీ పబ్లిక్‌ ఇష్యూ షురూ- రిటైలర్లకు డిస్కౌంట్‌!

జీఐసీ పబ్లిక్‌ ఇష్యూ షురూ- రిటైలర్లకు డిస్కౌంట్‌!

దేశీయంగా మూడో అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూకి బుధవారం నుంచీ తెరలేచింది. ప్రభుత్వ రంగ సంస్థ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(జీఐసీ) రూ. 11,370 కోట్ల సమీకరణ కోసం పబ్లిక్‌ ఇష్యూకి వచ్చింది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 855-912కాగా.. శుక్రవారం(13న) ముగియనుంది. ఇంతక్రితం ఐపీవోల ద్వారా ప్రభుత్వ రంగ సంస్థ కోల్‌ ఇండియా రూ. 15,200 కోట్లు, రిలయన్స్‌ పవర్‌ రూ. 11,700 కోట్లను సమకూర్చుకోవడం ద్వారా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.  
రూ. 45 తగ్గింపు
రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఆఫర్‌ ధరలో రూ. 45 డిస్కౌంట్‌ను జీఐసీ ప్రకటించింది. షేరు ముఖ విలువ రూ. 5 కాగా.. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 16 షేర్లకు (ఒక లాట్‌) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఆపై రూ. 2 లక్షల విలువకు మించకుండా ఒకే లాట్‌కింద ఇవే గుణిజాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఐపీవో తరువాత ప్రభుత్వ వాటా 100 శాతం నుంచి 86 శాతానికి తగ్గనుంది. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 12.5 శాతం వాటాకు సమానమైన 10.75 కోట్ల షేర్లను విక్రయించనుంది. మరో 1.72 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనుంది. 
కంపెనీ వివరాలివీ
స్థూల ప్రీమియం వసూళ్ల ప్రకారం జీఐసీ అతిపెద్ద సాధారణ బీమా కంపెనీగా చెప్పవచ్చు. దేశీయంగా 60 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉంది. ఆస్తులకు అగ్నిప్రమాద బీమాతోపాటు.. మెరైన్‌, మోటార్‌, ఇంజినీరింగ్‌, వ్యవసాయం, విమానయానం, ఆరోగ్యం, తదితర రంగాలలో బీమా సౌకర్యాలను కల్పిస్తోంది. వెరసి ఆసియాలోనే మూడో పెద్ద బీమారంగ సంస్థగా నిలుస్తోంది. కంపెనీ మార్చితో ముగిసిన గతేడాది(2016-17)లో దాదాపు రూ. 4,000 కోట్ల ఆదాయం సాధించింది. రూ. 3140 కోట్ల నికర లాభం ఆర్జించింది.Most Popular