గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ ఐపీవో బంపర్‌ సక్సెస్‌

గోద్రెజ్‌  ఆగ్రోవెట్‌ ఐపీవో బంపర్‌ సక్సెస్‌

గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌కు అనుబంధ సంస్థ అయిన గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ పబ్లిక్‌ ఇష్యూ సూపర్‌ సక్సెస్‌ సాధించింది. ఇష్యూకి ఇన్వెస్టర్లు క్యూ కట్టడంతో 95.41 రెట్లు అధిక స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.8 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయగా.. 171 కోట్ల షేర్లకుపైగా బిడ్స్‌ దాఖలయ్యాయి. ఇష్యూ ఈనెల 4న ప్రారంభమై 6న ముగిసింది. షేరు ముఖవిలువ రూ. 10కాగా.. ఒక్కో షేరుకి ధరల శ్రేణి రూ.450-460. ఇష్యూ ద్వారా గోద్రెజ్‌ గ్రూప్‌ రూ. 1157 కోట్లు సమకూర్చుకుంది. 25 యాంకర్‌ ఇన్వెస్టర్‌ సంస్థలకు షేరుకి రూ.460 ధరలో 74 లక్షలకుపైగా షేర్లను విక్రయించింది. తద్వారా రూ. 341 కోట్లను సమీకరించింది.

ప్రమోటర్‌ వాటా 61 శాతం
గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌లో గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌కు 60.81 శాతం వాటా ఉంది. అగ్రిబిజినెస్‌ కార్యకలాపాలు కలిగిన గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ ఐపీవో నిధులను రుణాల చెల్లింపు, వర్కింగ్‌ కేపిటల్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో  పేర్కొంది. కంపెనీ ప్రధానంగా పశు దాణా, సస్య రక్షణ, ఆయిల్‌ పామ్, పౌల్ట్రీ తదితర ఐదు విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 4926 కోట్ల ఆదాయం సాధించింది. ఇది 31 శాతం వృద్ధికాగా..  5 శాతం అధికంగా రూ. 274 కోట్ల నికర లాభం ఆర్జించింది. రుణ, ఈక్విటీ(డీఈ) నిష్పత్తి 0.7గా నమోదైంది.
బిడ్స్‌ వివరాలివీ...
గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ ఐపీవోకి అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్‌) విభాగంలో 151 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలయ్యాయి. సంపన్న వర్గాల(నాన్‌ఇన్‌స్టిట్యూషనల్‌) నుంచి 238 రెట్లు అధికంగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు సైతం 7.5 రెట్లు అధికంగా దరఖాస్తు చేయడం విశేషం! ఇక ఉద్యోగుల విభాగంలో 0.84 శాతమే బిడ్స్‌ దాఖలయ్యాయి. మొత్తం 4,44,444 షేర్లకు గాను 3,73,312 షేర్లకు బిడ్లు వచ్చాయి.Most Popular