ఐపీఓలపై ఇన్వెస్టర్ల మోజు - క్యూ కడుతోన్న కంపెనీలు

ఐపీఓలపై ఇన్వెస్టర్ల మోజు - క్యూ కడుతోన్న కంపెనీలు

ఈ ఏడాది మార్కెట్లు జోరుమీదుండడంతో వివిధ కంపెనీలు ఐపీఓ బాట పట్టాయి. ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో ఇప్పటి వరకు 25 కంపెనీలు రూ.31,996 కోట్ల నిధులను సమీకరించాయి. ఇందులో BSE, HUDCO, ICICI Lombard, SBI Life, AU Small Finance Bank, CDSLల వాటా 50 శాతం పైగానే ఉంది. తాజాగా గోద్రేజ్‌ అగ్రోవేట్ కూడా 96 శాతం పైగా ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ కావడం.. ఐపీఓలపై ఇన్వెస్టర్లకు ఎంతో ఆసక్తి ఉందో చెప్పకనే చెప్పింది. ఈ ఏడాది వచ్చిన అన్ని ఐపీఓలకు ఇన్వెస్టర్లు బ్రహ్మరథం పట్టగా... ఆయా స్టాక్స్‌ కూడా బంపర్‌గా లిస్ట్‌ అయ్యాయి. రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలు ఐపీఓకు రానుండటంతో ఈ క్యాలెండర్ ఇయర్‌లో నిధుల సమీకరణ విలువ రూ.50 వేల కోట్ల మార్కును దాటే అవకాశముందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల్లోనే వచ్చే న్యూ ఇండియా అస్యూరెన్స్‌తో పాటు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, మహీంద్రా లాజిస్టిక్స్‌, ఖాడిమ్స్‌లు ఈ ఏడాది ఐపీఓకు రానున్నాయి. 

రాబోయే వారంలో వచ్చే ఐపీఓల విషయానికి వస్తే.. జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (జీఐసీ) ఇష్యూ ఈనెల 11న ప్రారంభమైన 13న ముగియనుంది. ఐపీఓ ద్వారా ఈ సంస్థ రూ.11,372 కోట్ల నిధులను సమీకరించనుంది. అలాగే అక్టోబర్ 9న ఐపీఓను ప్రారంభించనున్న ఇండియన్ ఎనర్జీ ఎక్స్‌ఛేంజ్ రూ. 1645-1650 ప్రైస్ బ్యాండ్  వద్ద షేర్ల విక్రయం ద్వారా రూ. 1000 కోట్లను సమీకరించబోతోంది. ఎలక్ట్రిసిటీ ఎక్స్‌ఛేంజ్ షేర్ హోల్డర్లు 20 శాతం పోస్ట్ ఇష్యూ పెయిడ్అప్ క్యాపిటల్‌కు సమానమైన 60లక్షల షేర్లను విక్రయించనున్నారు. ఇక ఎంఎఎస్‌ ఫైనాన్షియల్‌ ఇష్యూ నిన్న (అక్టోబర్‌ 6న) ప్రారంభమైంది. ఈనెల 10న ముగిసే ఈ ఐపీఓ ద్వారా రూ.460 కోట్లను సమీకరించనున్న కంపెనీ ప్రైస్‌బాండ్‌ ఒక్కో షేరుకు రూ.456-459గా నిర్ణయించింది. గుజరాత్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, గత రెండు దశాబ్దాలుగా ఢిల్లీ సహా 6 రాష్ట్రాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

ఇక ఈ ఏడాది వచ్చిన ఐపీఓల్లో మెజార్టీ కంపెనీలు లిస్టింగ్‌ రోజే బంపర్ లాభాలను అందించాయి. ఈ ఏడాది మొత్తం 24 కంపెనీలు లిస్ట్‌ కాగా, అందులో 17 కంపెనీలు భారీ ప్రీమియంతో లిస్టయ్యాయి. అవెన్యూ సూపర్‌మార్ట్స్‌(డీమార్ట్‌) ఇష్యూ ధర కన్నా 102 శాతం అధిక(ప్రీమియంతో) ధరతో తొలిరోజూ ప్రారంభమయ్యాయి. గత 12 ఏళ్ళలో లిస్టింగ్‌డేలో ఇదే అతిపెద్ద ప్రీమియం కాగా, మొత్తం మీద ఇది రెండో అతిపెద్ద ప్రీమియం కావడం విశేషం. 2005 జూన్‌ 20న నందన్‌ ఎగ్జిమ్‌ 140 శాతం ప్రీమియంతో లిస్టైంది. 

గత నెల్లో ఐపీఓకు వచ్చిన కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ డిక్సన్‌ టెక్నాలజీస్‌ కూడా 54శాతం ప్రీమియంతో, ఈవారంలో వచ్చిన ప్రతాప్‌ స్నాక్స్‌ 35 శాతం ప్రీమియంతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఈ ఏడాది కొత్తగా లిస్టైన కంపెనీలు ఇన్వెస్టర్లకు చక్కని లాభాలను పంచిపెట్టాయి. బీఎస్‌ఈ ఇండెక్స్‌లో కొత్తగా లిస్టైన కంపెనీలన్నీ సగటున 41 శాతం పెరగ్గా.. బెంచ్‌ మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ మాత్రం ఇదే సమయంలో 19.48 శాతం లాభపడింది. Most Popular