గణాంకాలూ, ఫలితాలే మార్కెట్లకు మార్గదర్శి!

గణాంకాలూ, ఫలితాలే మార్కెట్లకు మార్గదర్శి!

ఆర్థిక గణాంకాలూ, క్యూ2(జూలై-సెప్టెంబర్‌) ఫలితాలే దేశీ స్టాక్‌ మార్కెట్లలో ఇకపై ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయి. ఆగస్ట్‌ నెలకు పారిశ్రామికోత్పత్తి ప్రగతి(ఐఐపీ) వివరాలను ప్రభుత్వం గురువారం(12న) విడుదల చేయనుంది. సెప్టెంబర్‌ నెలకు రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు సైతం అదే రోజుల వెల్లడికానున్నాయి. జూలైలో ఐఐపీ 1.2 శాతం పుంజుకోగా.. ఆగస్ట్‌లో వినియోగ ద్రవ్యోల్బణం 3.36 శాతం పెరిగింది. 
జీఎస్‌టీ ఎఫెక్ట్‌
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అధ్యక్షతన జీఎస్‌టీ కౌన్సిల్‌ తాజాగా వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) శ్లాబుల్లో సవరణలు చేపట్టింది. సూక్ష్మ, మధ్య, చిన్నతరహా(ఎస్‌ఎంఈ) పరిశ్రమలకు ఉపశమనాన్ని కల్పించడంతోపాటు రెస్టారెంట్లు, ఎగుమతిదారులు తదితర రంగాలకు పన్ను తగ్గింపు ద్వారా వెసులుబాటు కల్పించింది. ఇది సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నిచ్చే అంశమని పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి.  అయితే పన్ను ఆదాయం తగ్గనుండటం ప్రభుత్వానికి కొంతమేర నిరాశాజనకమేనని వ్యాఖ్యానిస్తున్నాయి.
ఫలితాల సీజన్‌.. షురూ?
వచ్చే వారం నుంచీ కార్పొరేట్‌ ఫలితాల సీజన్‌ మొదలుకానుంది. 12న సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం టీసీఎస్‌, ప్రయివేట్‌ రంగ బ్యాంక్‌ ఇండస్‌ఇండ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక(క్యూ2)  ఫలితాలు ప్రకటించనున్నాయి. వీటితోపాటు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు, ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు సైతం వచ్చే వారం కీలకంగా నిలవనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.Most Popular