మార్కెట్ల పరుగును.. మీ పోర్ట్ ఫోలియో అందుకోవడం లేదా ?

మార్కెట్ల పరుగును.. మీ పోర్ట్ ఫోలియో అందుకోవడం లేదా ?

 

మార్కెట్లో సూచీలు సరికొత్త గరిష్టాలను నమోదు చేస్తున్నాయి. కానీ బెంచ్ మార్క్ ఇండెక్స్ సూచీ ర్యాలీ హోరులో పడి మార్కెట్లోని పలు షేర్ల కదలికలను మీరు గమనించడం లేదు. బీఎస్ఈ 500 సూచీలో దాదాపు సగం షేర్లు తమ ఏడాది గరిష్ట స్థాయి మొత్తం నుంచి యావరేజిగా 20 శాతం మేర నష్టపోయాయి. అంటే సూచీలు పరుగులు పెడుతున్నప్పటికీ పలు రంగాల షేర్లు మాత్రం లాభాలను కోల్పోయాయి. బీఎస్ఈ 500 సూచీ మార్కెట్ లో 91శాతం మార్కెట్ కేపిటలైజేషన్ కలిగి ఉండగా అందులో సుమారు 199 స్క్రిప్స్ తమ 52 వారాల గరిష్ట స్థాయి నుంచి సుమారు 20 శాతం విలువ కోల్పోయాయి. ఇందుకు కంపెనీ ఆదాయాల అంచనాలు వీక్ గా ఉండటం, ఫండమెంటల్స్ క్షీణించడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. 

  

ఇక బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీలో 850 స్టాక్స్ లోని సుమారు 237 స్టాక్స్ సైతం ఏడాది గరిష్టాలతో పోలిస్తే సుమారు 20 శాతం విలువ కోల్పోయాయి. అలాగే మరో 80 స్టాక్స్ ఏడాది గరిష్టాల కన్నా 50 శాతం విలువ కోల్పోయాయి. మార్కెట్లోని ఈ కల్లోల పరిస్థితిని బెంచ్ మార్క్ ఇండెక్స్ నిఫ్టీ జోరు చాలా మేర కనబడకుండా చేస్తోందనేది స్పష్టం. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఈ ఏడాది సుమారు 20 శాతం పెరిగింది. ఇందుకు కారణంగా నిఫ్టీ ఇండెక్స్ లోని హెవీవెయిట్ స్టాక్స్ అయిన హెచ్‌డీఎప్‌సీ,హెచ్‌డీఎప్‌సీ బ్యాంక్, రిలయన్స్, ఐటీసీ లలో ర్యాలీయే కారణమని చెప్పవచ్చు. ఈ హెవీ స్టాక్స్ లో హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ, నిఫ్టీలో పెద్దగా పతనం మాత్రం కనబడలేదు.

గత రెండు వారాల ట్రేడింగ్ గమనిస్తే బీఎస్ఈ 500 లోని సుమారు 210 స్టాక్స్ 200 రోజుల మూవింగ్ యావరేజి (DMA) కన్నా తక్కువగా ట్రేడవుతున్నాయి. 200 DMA కన్నా తక్కువగా ట్రేడవడం అంటే ఒక నిర్మాణాత్మక డౌన్ ట్రెండ్‌గా గమనించవచ్చు. సెప్టెంబర్ 18 కన్నా మునుపు ఈ సంఖ్య 150 స్టాక్స్‌గా ఉంది. అనంతరం మార్కెట్ల పతనం అవడంతో 200 డీఎంఏ కన్నా తక్కువగా ట్రేడవుతున్న స్టాక్స్ సంఖ్య 200 దాటింది. మరో 60 కంపెనీల స్టాక్స్ తమ వార్షిక మూవింగ్ యావరేజీ కన్నా తక్కువగా పెర్ఫార్మన్స్ కనబరచాయి. 

అయితే చాలా సందర్భాల్లో బెంచ్ మార్క్ సూచీలతో సంబంధం లేకుండా పలు స్టాక్స్ లో ర్యాలీ గమనించవచ్చు. 

కంపెనీల స్థిరమైన వ్రుద్ధి రేటు, త్రైమాసిక గణాంకాల్లో మెరుగైన ఫలితాలు ఫండమెంటల్స్ బలంగా ఉన్న కంపెనీలు మాత్రమే మార్కెట్ ర్యాలీతో సంబంధం లేకుండా ఔట్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి. ముఖ్యంగా జీఎస్టీ లాంటి సంస్కరణలు వచ్చినప్పటికీ చిన్న మధ్యతరహా సంస్థలు ఒడిదుడుకులు లోనయ్యాయి. అయినప్పటికీ పలు బ్రోకరేజి సంస్థలు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లపై మక్కువ చూపడం గమనార్హం. ఆర్థిక మందగమనం, జీఎస్టీ అమలులో బాలారిష్టాలు వంటి సమస్యలు ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్ వ్యూతో బలమైన టెక్నికల్స్, మెరుగైన గణాంకాలు ఉన్న స్టాక్స్ మాత్రమే మదుపుదారులకు బంగారు బాతులుగా మారుతున్నాయి.         Most Popular