ఈ 5 స్టాక్స్.. కాబోయే మల్టీబ్యాగర్స్!!

ఈ 5 స్టాక్స్.. కాబోయే మల్టీబ్యాగర్స్!!


ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగం ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఈ సమయంలో కేవలం 6 శాతం మాత్రమే వృద్ధి నమోదు చేసింది. గత ఏడాది కాలాన్ని పరిశీలిస్తే మాత్రం సెన్సెక్స్ 18 శాతం మేర ఊపందుకుంది. అయితే.. ఈ ఆర్థిక సంవత్సరం రాబోయే 6 నెలల కాలంలో మార్కెట్ల గమనం ఎటు ఉండొచ్చనే అంశంపై విశ్లేషణలు జోరందుకున్నాయి.
ఈ ఏడాది జూలైలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 10వేల పాయింట్ల కీలక స్థాయిని అధిగమించింది. ఆల్‌టైం గరిష్ట స్థాయిలను కూడా బెంచ్ మార్క్ ఇండెక్స్‌లు అందుకోగలిగాయి. అయితే, ఈ ఏడాది ద్వితీయార్ధంలో మాత్రం మార్కెట్లకు కొన్ని సవాళ్లు ఎదురుకానున్నాయి. మాక్రో ఎకనమిక్ రంగంలో అనిశ్చితి, అంతర్జాతీయంగా నెలకొన్న కొన్ని ఆందోళనలు, యూఎస్ ఆర్థిక పరిస్థితి ఊపందుకుంటోందనే సంకేతాలు.. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అయితే.. ఊగిసలాట కొంతమేర కొనసాగినా మన మార్కెట్లలో పాజిటివ్ ట్రెండ్ కొనసాగే అవకాశముందని అంచనాలున్నాయి.

ఇలాంటి సమయంలో రాబోయే 2-3 ఏళ్లకు మల్టీబ్యాగర్స్‌గా ఈ 5 స్టాక్స్ అవతరించే అవకాశం ఉందని షేర్‌ఖాన్ వర్గాలు అంటున్నాయి. ఈ జాబితాలో హిందుస్తాన్ యూనిలీవర్, పెట్రోనెట్ ఎల్ఎల్‌జీ, మారుతి సుజుకి, ఎన్‌బీసీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఉన్నాయి.

 

హిందుస్తాన్ యూనిలీవర్
వార్షికంగా పోల్చితే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో హిందుస్తాన్ యూనిలీవర్ ఆదాయం 5 శాతం పెరగగా, పన్ను తర్వాతి లాభం 15 శాతం ఊపందుకుంది. ఈ సమయంలో మార్కెట్ అంచనాలను మించి ఈ కంపెనీ ప్రదర్శన కనబరిచింది.
2018, 2019 ఆర్థిక సంవత్సరాలకు ఈ కంపెనీ ఆదాయాలను 2, 3 శాతం మేర పెంచుతూ ఇప్పటికే తమ అంచనాలను షేర్‌ఖాన్ సవరించింది. నిర్వహణ ఆదాయం పెరుగుతుండడమే ఇందుకు కారణం. ప్రధానంగా నిర్వహణ సామర్ధ్యంపై దృష్టి పెట్టడం ఈ కంపెనీకి సానుకూలంగా చెప్పవచ్చు.

 

పెట్రోనెట్ ఎల్ఎన్‌జీ
ఎల్ఎన్‌జీ దిగుమతులు పెరగడం, దభోల్ ఎల్ఎన్‌జీ టెర్మినల్‌ను మూసివేయడంతో.. క్యూ2లో దహెజ్ టెర్మినల్ ఉపయోగిత సామర్ధ్యం పెరగనుంది. దేశంలోకి ఎల్ఎన్‌జీ దిగమతులు పెరగడం.. గ్యాస్ వినియోగం ఊపందుకోవడం పెట్రోనెట్‌కు అత్యధికంగా కలిసొచ్చే విషయంగా షేర్‌ఖాన్ చెబుతోంది.
2019 ఆర్థిక సంవత్సరానికి 14.9x రెట్ల వాల్యుయేషన్ వద్ద ఈ స్టాక్ ట్రేడ్ అవుతుండడంతో ఆకర్షణీయమైన అంశంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 2017-2019 కాలంలో 15 శాతం సీఏజీఆర్ సాధించే అవకాశం ఉందనే అంచనాలున్నాయి.

 

మారుతి సుజుకి
దేశంలో అతి పెద్ద ప్యాసింజర్ వెహికల్ తయారీ కంపెనీ మారుతి సుజుకికి 47 శాతం మార్కెట్ వాటా ఉంది. గత రెండేళ్లుగా కొత్త ప్రొడక్టుల లాంఛింగ్ కారణంగా, తనకు గల విస్తృతమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉపయోగించుకుని మార్కెట్ వాటాను కంపెనీ పెంచుకుంటోంది. డీజిల్ మోడల్స్ నుంచి పెట్రోల్ మోడల్స్‌కు వినియోగదారులు మారుతుండడం కూడా కంపెనీకి సానుకూల విషయంగానే  చెప్పవచ్చు. పెద్ద కార్ల కేటగిరీలో సియాజ్, విటారా బ్రెజా, డిజైర్, బ్యాలెనో వంటి మోడల్స్ కారణంగా మార్కెట్ ఊపందుకుంటోంది. స్వంతగా నెక్సా నెట్వర్క్‌ను కూడా మారుతి పెంచుకుంటోంది.

 

రిలయన్స్ ఇండస్ట్రీస్
రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రాస్ రెవెన్యూ మార్జిన్ బ్యారెల్‌కు 11.5/12 డాలర్ల వద్ద ఉండే అవకాశం ఉందని షేర్ ఖాన్ అంచనా వేస్తోంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనాల ప్రకారం అంతర్జాతీయంగా ఆయిల్ డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. అలాగే డీజిల్‌కు డిమాండ్ తగ్గడం, ఎథిలీన్ మార్జిన్లు పెరగడం వంటివి కూడా కంపెనీకి సానుకూలం. 2017-19 కాలంలో ఎబిటా 23 శాతం, పన్ను తర్వాతి లాభం 12 శాతం సీఏజీఆర్ చొప్పున నమోదు కావచ్చని కంపెనీ అంచనా వేస్తోంది.

 

ఎన్‌‌‌బీసీసీ
ఆదాయం స్థిరంగానే ఉన్నా ఆర్డర్లు భారీ స్థాయిలో పెరుగుతుండడం, మార్జిన్స్ పెరుగుతుండడంతో లాభాలు పెరగనున్నాయని కంపెనీ అంచనా వేస్తోంది. 2017-19 కాలంలో సగటున 51 శాతం చొప్పున సీఏజీఆర్‌తో ఆదాయం ఊపందుకోనుందని ఎన్‌బీసీసీ అంచనా వేస్తోంది.
రాబోయే రెండేళ్ల కాలానికి రెవెన్యూ గైడెన్స్‌పై సానుకూల అంచనాలతో పాటు నౌరోజీ నగర్-నేతాజీ నగర్- సరోజిని నగర్‌లలో భారీ ప్రాజెక్టులలో కార్యకలాపాలు నిర్వహణ ప్రాంరంభం కానుండడం విశేషం. స్ట్రాంగ్ ఎర్నింగ్స్, తగినంత బ్యాలెన్స్ షీట్, హై రిటర్న్ రేషియోలు ఈ స్టాక్‌కు అనుకూలం అని చెప్పవచ్చు
 Most Popular