.. కృషి ఉంటే..!

.. కృషి ఉంటే..!

దేశంలో అతివేగంగా వృద్ధి బాటలో పయనిస్తోన్న జ్యువెలరీ సంస్థల్లో ఒకటి లలితా జ్యువెలర్స్‌. ఒకప్పుడు తీవ్ర నష్టాల్లో కొట్టుమిట్టాడిన ఈ సంస్థ ప్రస్తుతం లాభాల బాటలో పరుగులు తీస్తోంది. దీనికి ఆ సంస్థ చైర్మన్‌ కిరణ్‌ కుమార్‌ వ్యూహచతురతే ప్రధాన కారణం. నిరుపేద కుటుంబం నుంచి అంచలంచెలుగా వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా మారిన లలితా జ్యువెలర్స్ ఛైర్మన్ కిరణ్ కుమార్ సక్సెస్ స్టోరీ ఏంటో మీరే చదవండి.

చదవడం, రాయడం అసలే రాదు. ఎదుటి వారితో మాట్లాడాలంటే సిగ్గు, బిడియం. ఏ సంస్థలోనైనా ఉద్యోగం చేద్దామంటే అత్తెసరు జీతాలు. ఆ జీతంతో బతకలేమనే భయం. స్వంతంగా వ్యాపారం చేద్దామంటే చేతిలో చిల్లిగవ్వలేదు. అయినా అధైర్య పడలేదు. తన దగ్గర ఉన్న కొద్దిపాటి బంగారంతో వ్యాపారం ప్రారంభించి సక్సెస్‌ అయ్యారు లలితా జ్యువెలర్స్ ఛైర్మన్ కిరణ్ కుమార్ .

రాజస్థాన్‌లోని ఓ మారుమూల గ్రామంలో పుట్టాడు కిరణ్‌ కుమార్‌ జైన్‌. చిన్నతనంలోనే బంగారు ఆభరణాలను తయారు చేయడానికి ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకి వచ్చి ఓ చిన్న దుకాణంలో పనికి కుదిరాడు. నైపుణ్యమున్నా ఆయనకు తగిన గుర్తింపు లభించలేదు. చాలీచాలని ఆదాయంతో కుటుంబ పోషణ కష్టం కావడంతో ఉద్యోగం కన్నా వ్యాపారమైతేనే ఉత్తమమని భావించాడు. అయితే చేతిలో డబ్బులేదు. అప్పు చేద్దామన్నా తనని నమ్మి ఇచ్చే వారు కూడా ఎవరూ కనిపించలేదు. ఏం చేద్దాం అని దీర్ఘంగా ఆలోచించి చివరకు రిస్క్‌ ఉన్నప్పటికీ బిజినెసే బెటరనే నిర్ణయానికి వచ్చాడు. తన దగ్గరున్న కొద్ది పాటి బంగారాన్ని కరిగించి రీమేకింగ్‌ చేశాడు. తన తల్లిని కూడా ఒప్పించి ఆవిడ చేతికున్న గాజులను కూడా తీసుకొని సరికొత్త నగలను డిజైన్‌ చేశాడు. ఆ నగలతో చెన్నై బయలు దేరి వెళ్ళాడు.

చెన్నైలోని లలితా జ్యువెలర్స్‌లో తన డిజైన్స్‌ చూపించగా వారు వెంటనే కొనుగోలు చేశారు. కిరణ్‌ చేసిన ఆర్నమెంట్స్‌ నచ్చడంతో వారు మరిన్ని ఆర్డర్లు ఇచ్చారు. ఈ ఆర్డర్లను ఆయన విజయవంతంగా పూర్తి చేశారు. ట్రెండ్‌కు అనుగుణంగా కొత్త కొత్త డిజైన్స్‌ను తయారు చేయడంలో దిట్టగా పేరు సంపాదించాడు. ఆయన తయారు చేసిన డిజైన్స్‌ ముఖ్యంగా యూత్‌ను ఆకర్షించాయి. 

ఇలా ఉండగా సంస్థ నష్టాల్లో ఉండటంతో లలితా జ్యువెలర్స్‌ను విక్రయించాలని వ్యవస్థాపకులు నిర్ణయానికి వచ్చారు. దీంతో లలితా జ్యువెలర్స్‌ను కొనుగోలు చేయాలని కిరణ్‌కుమార్‌ భావించాడు. డీల్‌ ఓకే కావడంతో కంపెనీ పగ్గాలు కిరణ్‌ కుమార్‌ చేతిలోకి వచ్చాయి. ఇంకేముంది ఆయన దశతిరిగింది. సరికొత్త వ్యూహాలతో నష్టాల్లో ఉన్న కంపెనీ లాభాల బాటలోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించారు. ఆయన కృషి పట్టుదలతో ప్రస్తుతం సంస్థ టర్నోవర్‌ రూ.10వేల కోట్ల మార్కును అధిగమించింది.

ఇక పోటీ ప్రపంచంలో పైచేయి సాధించాలనే కంపెనీకి పేరు ప్రఖ్యాతులున్న ఓ బ్రాండ్‌ అంబాసిడర్‌ అవసరమని పలు సంస్థలు భావిస్తుంటాయి. అయితే తన సంస్థకు తానే బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారాడు. ఆయన లలితా జ్యెవెలర్స్ కోసం చేసిన యాడ్స్‌ మీడియా ప్రపంచంలో సరికొత్త సునామీ సృష్టిస్తోంది. ఆ యాడ్‌ల ద్వారా ఆయన చేసిన ప్రమోషన్స్‌ మిగిలిన జ్యువెలరీ సంస్థలను ఆశ్చర్యపోయేలా చేసింది. కోట్లు ఖర్చు పెట్టి స్టార్‌ అంబాసిడర్‌లను తెచ్చుకున్నా రాని పబ్లిసిటీ కిరణ్‌ కుమార్‌ ద్వారా లలితా జ్యువెలర్స్‌ సంపాదించుకుంది.  

తమ విజయానికి ప్రధాన కారణం కస్టమర్లు తమపై ఉంచిన నమ్మకమేనని ధీమాగా చెబుతున్నారు కిరణ్‌కుమార్‌. ప్రస్తుతం తమకు దేశవ్యాప్తంగా 12 బ్రాంచీలు ఉన్నాయని, త్వరలో మరిన్ని శాఖలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు ఆయన చెప్పారు.  సంపాదించడమే కాదు అనేక సేవా కార్యక్రమాలు కూడా లలితా జ్యువెలర్స్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న కిరణ్‌కుమార్‌, రాజస్థాన్‌లోని తన స్వస్థలంలో రూ.12 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యకమాలు చేపట్టారు. 2018 తర్వాత తన సంపాదనలో సగభాగాన్ని వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలకు వినియోగించనున్నట్టు ఆయన చెబుతున్నారు. 

ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండటమే తన నైజమని చెబ్తోన్న కిరణ్‌కుమార్‌ ఈ సక్సెస్‌ను ఎంత వరకు నిలుపుకుంటారో చూద్దాం. Most Popular