వచ్చే వారానికి గణాంకాలే కీలకం!

వచ్చే వారానికి గణాంకాలే కీలకం!

వచ్చే వారం దేశీ స్టాక్‌ మార్కెట్లకు ఆర్థిక గణాంకాలు కీలకంగా నిలవనున్నాయి. అయితే ఉత్తర కొరియా అణుపరీక్షలు, సైనిక చర్యకు సిద్ధమంటూ అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పేర్కొనడం వంటి విదేశీ అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. మంగళవారం(12న) జూలై నెలకు పారిశ్రామికోత్పత్తి గణాంకాల(ఐఐపీ)ను ప్రభుత్వం విడుదల చేయనుంది. జూన్‌లో ఐఐపీ 0.1 శాతం క్షీణించింది. 2013 జూన్‌ తరువాత ఇదే కనిష్టం!
ధరల వివరాలు
12న ఆగస్ట్‌ నెలకు రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. జూలైలో సీపీఐ 2.36 శాతం ఎగసింది. జూన్‌లో ఇది 1.46 శాతంగానే నమోదైంది. ఈ బాటలో గురువారం(14న) ఆగస్ట్‌ నెలకుగాను టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) గణాంకాలను ప్రభుత్వం ప్రకటించనుంది. జూలైలో డబ్ల్యూపీఐ 1.88 శాతం పెరిగింది. జూన్‌లో 0.9 శాతంగానే నమోదైంది.
వాతావరణంపై దృష్టి
ఇప్పటికే దేశవ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాల ప్రభావాన్ని ఇన్వెస్టర్లు పరిశీలిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నెల 5కల్లా సాధారణ సగటుకంటే 5 శాతం తక్కువగా వర్షపాతం నమోదైనట్లు గతవారం వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఇకపై వర్షపాత విస్తరణపైనా మార్కెట్లు కన్నేస్తాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. వీటితోపాటు వచ్చే వారం.. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ మినిట్స్‌, ఆగస్ట్‌ నెలకు యూఎస్‌ సీపీఐ, పారిశ్రామికోత్పత్తి వంటి గణాంకాలు సైతం మార్కెట్లను ప్రభావితం చేసే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. Most Popular