లాభాలు స్వల్పమే- ఫార్మా నేలచూపు!

లాభాలు స్వల్పమే- ఫార్మా నేలచూపు!

వరుసగా రెండో రోజు కన్సాలిడేషన్ బాటలో సాగిన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 25 పాయింట్లు పెరిగి 31,687 వద్ద నిలవగా.. 5 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ 9,935 వద్ద స్థిరపడింది. అయితే ప్రపంచ మార్కెట్ల సానుకూలతల నేపథ్యంలో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 9,950ను అధిగమించడం విశేషం! మార్కెట్లను ప్రభావితం చేయగల కీలక అంశాలు కరవు కావడంతో రెండు రోజులుగా ప్రధాన ఇండెక్సులు పరిమిత స్థాయిలోనే సంచరిస్తున్నట్లు నిపుణులు వ్యాఖ్యానించారు. 
రియల్టీ డౌన్‌
ఎన్‌ఎస్ఈలో రియల్టీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకింగ్‌, ఆటో రంగాలు 1.5-0.5 శాతం మధ్య క్షీణించాయి. ఎఫ్‌ఎంసీజీ. ప్రయివేట్‌ బ్యాంక్స్‌, మెటల్‌ 0.3 శాతం స్థాయిలో బలపడి మార్కెట్లను ఆదుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎల్‌అండ్‌టీ దాదాపు 4 శాతం జంప్‌చేయగా.. భారతీ, టెక్‌మహీంద్రా, వేదాంతా, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, విప్రో, అల్ట్రాటెక్‌, మారుతీ, కోల్‌ ఇండియా 1.5-0.6 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే ఎంఅండ్‌ఎం, డాక్టర్‌ రెడ్డీస్‌, బీపీసీఎల్‌, సన్ ఫార్మా, బీవోబీ, బజాజ్‌ ఆటో, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, ఇన్ఫోసిస్‌, ఐషర్‌ 3.3-1 శాతం మధ్య నష్టపోయాయి. మార్కెట్ల బాటలో చిన్న షేర్లూ అంతంత మాత్రంగా లాభపడ్డాయి. బీఎస్‌ఈలో ట్రేడైన మొత్తం షేర్లలో 1504 నష్టపోతే.. 1113 బలపడ్డాయి.
అమ్మకాలు వీడని ఎఫ్‌పీఐలు
దేశీ స్టాక్స్‌లో ఇటీవల అమ్మకాలకే ప్రాధాన్యమిస్తూ వస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) గురువారం నగదు విభాగంలో రూ. 564  విలువైన స్టాక్స్‌ విక్రయించారు. గత రెండు రోజుల్లోనూ రూ. 1,700 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు దేశీ ఫండ్స్ (డీఐఐలు) గురువారం రూ. 245 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. గత రెండు రోజుల్లో మొత్తం రూ. 500 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. Most Popular