అహో.. పసిడి హొయలు!

అహో.. పసిడి హొయలు!

ఉత్తర కొరియా ఉన్నట్టుండి హైడ్రోజన్‌ బాంబును పరీక్షించడం, అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపునకు తగిన పరిస్థితులు నెలకొనకపోవడం వంటి అంశాల కారణంగా బంగారానికి డిమాండ్‌ కొనసాగుతోంది. హార్వీ తుఫాన్‌ ప్రభావంతో 2015 సెప్టెంబర్‌ తరువాత అమెరికాలో 62,000 మందికి ఉపాధి నష్టం జరిగిన వార్తలు దీనికి కారణంకాగా.. తాజాగా యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ సైతం యథాతథ పాలసీనే ప్రకటించడంతో డాలరు బలహీనపడింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడిలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. వెరసి గురువారం న్యూయార్క్‌ కామెక్స్‌లో పసిడి ఔన్స్‌(31.1 గ్రాములు) 0.8 శాతం(11 డాలర్లకుపైగా) జంప్‌చేసి 1350 డాలర్లను తాకింది. ఇది ఏడాది గరిష్టంకాగా.. ఇంతక్రితం 2016 సెప్టెంబర్‌ 6న మాత్రమే పసిడి ధరలు ఈ స్థాయికి చేరాయి. ఇక వెండికి కూడా గిరాకీ పెరగడంతో ఔన్స్ 1.2 శాతం దూసుకెళ్లి 18.11 డాలర్లకు చేరింది.
మెరుపులు
నేటి ట్రేడింగ్‌లోనూ ట్రేడర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో పసిడి ధరలు మరింత బలపడ్డాయి. ప్రస్తుతం ఔన్స్‌ బంగారం 0.5 శాతం(దాదాపు 7 డాలర్లు) పుంజుకుని 1357 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి సైతం ఔన్స్‌ 0.6 శాతం ఎగసి 18.23 డాలర్ల వద్ద కదులుతోంది. ఇక దేశీయంగా నేటి ట్రేడింగ్‌లో ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 90 పెరిగి రూ. 30,372ను తాకింది. వెండి కేజీ డిసెంబర్‌ డెలివరీ రూ. 162 జంప్‌చేసి రూ. 41,779కు చేరింది.Most Popular