పొందికైన పెట్టుబడులకు చక్కనైన 10 మార్గాలు

పొందికైన పెట్టుబడులకు చక్కనైన 10 మార్గాలు


చక్కని భవిష్యత్తు కోసం తగినంత పెట్టుబడులు చేయడం ఎవరికైనా తప్పనిసరి. అయితే.. ఇన్వెస్ట్‌మెంట్ చేయడంలో చాలానే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తాము చేసిన పెట్టుబడులు భద్రంగా ఉండాలని, అలాగే తగినంత స్థాయిలో రాబడులు అందించాలని, తమకు ఓ నిధి ఏర్పడేందుకు సహకరించాలని అందరూ భావిస్తారు. అయితే, ఇందుకు ముందుగా అసలు ఎన్ని రకాల పెట్టుబడుల సాధనాలు ఉన్నాయనే అంశంపై కనీస అవగాహన అవసరం

మన దేశంలో ఇన్వెస్టర్లకు నియర్‌టెర్మ్, షార్ట్‌టెర్మ్, లాంగ్‌టెర్మ్ కోసం అందుబాటులో ఉన్న పలు రకాల పెట్టుబడి అవకాశాలను తెలుసుకుందాం. ఏఏ పెట్టుబడి సాధనాన్ని ఎందుకు ఉపయోగించవచ్చో అవగాహన పెంచుకుందాం.

 

1. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్
అదనంగా ఉన్న నిధులను అతి తక్కువ సమయం కోసం.. అంటే 30 రోజుల కంటే తక్కువగా సమయం ఉన్నపుడు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలను ఆశ్రయించవచ్చు. సహజంగా ఎవరికైనా ఇది మొట్టమొదటి పెట్టుబడి సాధనంగా కూడా ఉంటుంది. అయితే, దీనిపై అతి తక్కువగా అంటే వార్షికంగా 3.5 నుంచి 4 శాతం మాత్రమే వడ్డీ లభిస్తుంది. ఇది సేఫ్ డిపాజిట్ లాకర్స్ కంటే కొంత నయం అంతే.

 

2. మనీ మార్కెట్ ఫండ్స్(లిక్విడ్ ఫండ్స్)
లిక్విడిటీపై రాజీ పడకుండానే సేవింగ్స్ అకౌంట్ కంటే ఎక్కువ రాబడులను అందించేవే మనీ మార్కెట్ ఫండ్స్. ప్రత్యేకంగా షార్ట్‌టెర్మ్ ఫిక్సెడ్ ఇన్‌కం సాధనాల్లో మాత్రమే పెట్టుబడులు చేసేందుకు నిర్ణయించిన ప్రత్యేకమైన మ్యూచువల్ ఫండ్స్ ఇవి. ఇతర అనేక మ్యూచువల్ ఫండ్స్ మాదిరిగా కాకుండా, ప్రధానంగా మీ పెట్టుబడిని కాపాడడం పైనే దృష్టి నిలిపి, ఆ తర్వాతే రాబడులకోసం ప్రయత్నించడం వీటి ప్రత్యేకత. 

సేవింగ్స్ ఖాతాల కంటే మనీ మార్కెట్ ఫండ్స్‌పై ఎక్కువ రాబడులు వచ్చినా, బ్యాంక్ ఫిక్సెడ్ డిపాజిట్స్ కంటే తక్కువగానే ఇవి తక్కువగానే ఉంటాయి. ఇప్పుడు మనీ మార్కెట్ ఫండ్ అకౌంట్ నుంచి చెక్కులను జారీ చేసే సౌలభ్యం కూడా ఉండడంతో, సేవింగ్స్ అకౌంట్‌లో డబ్బులు ఉంచేందుకు బదులుగా వీటిని పరిశీలించవచ్చు.

 

3. బ్యాంక్ ఫిక్సెడ్ డిపాజిట్స్
తక్కువ రిస్క్‌ను మాత్రమే భరించగలిగే వారు 6-12 నెలల వ్యవధితో వీటిలో పెట్టుబడి చేయవచ్చు. టెర్మ్ డిపాజిట్స్‌గా కూడా వీటిని పిలుస్తారు. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులలో ఇవి లభిస్తాయి. ఎఫ్‌డీలలో కనీస పెట్టుబడి వ్యవధి 14 రోజులుగా ఉంటుంది.

ఎఫ్‌డీలలో  పెట్టుబడులకు 6-12 నెలలు తగిన సమయం. సహజంగా 6 నెలల కంటే తక్కువ కాలానికి మనీ మార్కెట్ ఫండ్ రిటర్న్స్ కంటే వడ్డీ తక్కువగా ఉంటుంది. వీటిలో పెట్టుబడులు చేసేటపుడే కాలవ్యవధి నిర్ణయించుకోవాలి. ముందస్తుగా విత్‌డ్రా చేసుకుంటే కొన్నిసార్లు జరిమానాకు అవకాశం ఉంటుంది.

 

4. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్
ఇందులో రిస్క్ తక్కువ. అలాగే మూలం వద్ద పన్ను(టీడీఎస్) కూడా ఉండదు. బ్యాంక్ ఫిక్సెడ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీని అందించడంతో.. సహజంగా వీటిలో పెట్టుబడులపై జనాలు ఆసక్తి చూపుతారు. మీరు రిటైర్ అయిన వ్యక్తి అయితే, మీ వ్యక్తిగత, క్రమం తప్పని ఆదాయం కోసం మంత్లీ ఇన్‌కం ప్లాన్ ఎంచుకోవచ్చు. 

మరోవైపు రిస్క్ కూడా తక్కువ కావడంతో పాటు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్‌పై టీడీఎస్ కూడా ఉండకపోవడం ఆకర్షణీయం. పోస్ట్ ఆఫీస్‌లు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్, నేషనల్ సేవింగ్స్ స్కీమ్, కిసాన్ వికాస్ పత్రాలు, మంత్లీ ఇన్‌కం స్కీమ్, రికరింగ్ డిపాజిట్ వంటి పలు పథకాలను నిర్వహిస్తాయి.

 

5. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
పన్ను చెల్లింపుదారులకు ఉత్తమమైన ఫిక్సెడ్ ఇన్‌కం పెట్టుబడి సాధనం. చిన్న ఇన్వెస్టర్లకు పీపీఎఫ్ అత్యుత్తమమైన పెట్టుబడి సాధనం.. ఎందుకంటే

  •  పన్నుకు ముందు ప్రభావ వడ్డీ రేటు లెక్కిస్తే ఎంతో ప్రయోజనం
  •  పెట్టుబడిలో 20 శాతం వరకూ పన్ను రాయితీ పొందే సౌలభ్యం
  •  ప్రభుత్వ పథకం కావడంతో అతి తక్కువ రిస్క్

అయితే లిక్విడిటీ అంతగా లేకపోవడం ఇందులో ప్రతి కూలం. ఉపసంహరణకు అవకాశాలు అతి తక్కువగా ఉంటాయి.

 

6. కంపెనీ ఫిక్సెడ్ డిపాజిట్లు
ఫిక్సెడ్-ఇన్‌కం పోర్ట్‌ఫోలియోలో ఎక్కువగా రాబడులను అందించే ఆప్షన్ ఇది. చిన్న మదుపర్ల దగ్గర నుంచి కంపెనీలు నిధులను సేకరించే సాధనాలే ఈ ఫిక్సెడ్ డిపాజిట్లు. సహజంగా ఏడాదంతా వీటిని ఇన్వెస్ట్ చేయవచ్చు. 12 నెలలకు మించిన వ్యవధి ఉంటే మాత్రమే వీటిలో ఇన్వెస్ట్ చేయాలి. చాలా వరకు కంపెనీలు మెచ్యూరిటీకి ముందు నగదుగా మార్చుకునే సౌలభ్యం ఇవ్వవు. అందుకే చాలా జాగ్రత్తగా ఎంచుకోవాల్సి ఉంటుంది. 

 

7. బాండ్లు మరియు డిబెంచర్లు
కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రిబేట్ పొందేందుకు పెద్ద పెట్టుబడుల కోసం అవకాశం ఇది. ఫిక్సెడ్ డిపాజిట్లతో పాటు కంపెనీలు జారీ చేసే ఇతర ఫిక్సెడ్-ఇన్‌కం సాధనాలే బాండ్లు, డిబెంచర్లు. సెకండరీ మార్కెట్‌లో లిక్విడిటీ లేకపోవడం, ప్రైమరీ మార్కెట్ కదలికలు అంచనా వేసేందుకు కష్టం కావడంతో, వీటిలో పెట్టుబడులు ఆర్థిక కంపెనీల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నాయి. 

ఎక్కువ యీల్డ్ పొందేందుకు సెకండరీ మార్కెట్‌లో అవకాశం ఉన్నా, సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే భారీ మొత్తాలను ప్రైమరీ మార్కెట్లలో పెట్టుబడి చేయడమే ఉత్తమం.

 

8. మ్యూచువల్ ఫండ్స్
మీరు ఎప్పుడైనా ఇతరులతో కలిసి పెట్టుబడులు చేశారా? సహజంగా మ్యూచువల్ ఫండ్స్ దగ్గరదగ్గరగా ఇలాంటి విధానమే అవలంబిస్తాయి. అనేకమంది ఇన్వెస్టర్లు కలిసి తమ పెట్టుబడులను స్టాక్స్, బాండ్స్, ఇతర పెట్టుబడి సాధనాలను కొంటూ ఉంటారు.

మ్యూచవల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మదుపర్లకు-

  • ప్రొఫెషనల్ మనీ మేనేజర్ సేవలను పొందచ్చు
  • తక్కువ పెట్టుబడినే చేసినా డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియోలో పెట్టుబడి చేయచ్చు

 

9. జీవిత బీమా పాలసీలు
పెట్టుబడుల కోసం మాత్రమే అయితే జీవిత బీమా పాలసీలను కొనకండి.
ఎంచుకున్న పాలసీ ప్రకారం లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో ఈ ఖర్చులు ఉంటాయి

  • మరణానంతర ప్రయోజనం కవరేజ్
  • బిల్ట్ఇన్ ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్స్
  • కమిషన్స్ వంటి ఇతర ఖర్చులు

పెట్టుబడుల కోసమే బీమా పాలసీలు చేస్తున్నట్లు అయితే, మీరు ఈ ఖర్చులను కూడా భరించాల్సి ఉంటుంది. అందుకే ఇతర ఐచ్ఛికాలను పరిశీలించాలి. అయితే జీవిత బీమా కూడా ముఖ్యమే అనే విషం తెలుసుకోవాలి.

 

10. ఈక్విటీ షేర్లు
దీర్ఘ కాలంలో అత్యధిర రాబడులు అందించేందుకు అవకాశం ఉంటుంది. కనీసం ఐదేళ్ల పాటు ఆ నిధులు అవసరం లేదని భావిస్తే పెట్టుబడి చేయండి
ఈక్విటీలలో పెట్టుబడికి రెండు రకాల ఆప్షన్స్ ఉన్నాయి-

  • సెకండరీ మార్కెట్ ద్వారా (స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లలో లిస్ట్ అయిన కంపెనీల షేర్లు కొనడం)
  • ప్రైమరీ మార్కెట్ ద్వారా(ఐపీఓలకు దరఖాస్తు చేయడం)

సుదీర్ఘ కాలంలో మదుపరులకు పెట్టుబడులపై అత్యధిక రాబడులను ఈక్విటీ షేర్లు మాత్రమే అందించగలిగాయి. అయితే, ఈక్విటీలలో పెట్టుబడి అంటే అధిక రిస్క్ అనే విషయం గుర్తుంచుకోవాలి.
 Most Popular