చివరికి లాభాలే- రియల్టీ అప్‌-ఫార్మా వీక్‌!

చివరికి లాభాలే- రియల్టీ అప్‌-ఫార్మా వీక్‌!

ఆగస్ట్‌ డెరివేటివ్‌ సిరీస్‌ ముగింపు నేపథ్యంలో మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాటలో కదిలాయి. ట్రేడింగ్‌ ఆద్యంతమూ స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య సాగింది. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 84 పాయింట్లు ఎగసి 31,730కు చేరింది. నిఫ్టీ 33 పాయింట్లు పుంజుకుని 9,918 వద్ద స్థిరపడింది. అయితే ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 31757-31552 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ఇక నిఫ్టీ సైతం 9,925 వద్ద గరిష్టాన్నీ.. 9,857 వద్ద కనిష్టాన్నీ తాకింది. ట్రేడర్లు తమ పొజిషన్లను సెప్టెంబర్‌ సిరీస్‌కు రోలోవర్‌ చేసుకునే బాటలో ఇండెక్సులు ఒడిదుడుకులను చవిచూసినట్లు నిపుణులు పేర్కొన్నారు.
ఐటీ ఓకే
ఎన్‌ఎస్ఈలో రియల్టీ 1.35 శాతం జంప్‌చేయగా.. ఐటీ 0.6 శాతం ఎగసింది. అయితే ఫార్మా 0.54 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో విప్రో, మారుతీ, టాటా పవర్‌, ఆర్‌ఐఎల్‌, బజాజ్‌ ఆటో, ఐషర్‌, ఏషియన్‌ పెయింట్స్‌, సిప్లా, అదానీ పోర్ట్స్‌, పవర్‌గ్రిడ్‌ 2.3-1.4 శాతం మధ్య పెరిగాయి. అయితే బాష్‌, ఇన్‌ఫ్రాటెల్‌, కోల్‌ ఇండియా, ఇన్ఫోసిస్‌, అరబిందో, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎంఅండ్‌ఎం, ఓఎన్‌జీసీ, లుపిన్‌, టాటా మోటార్స్‌ డీవీఆర్‌ 2.5-1 శాతం మధ్య బలహీనపడ్డాయి.

లాభాల్లో చిన్న షేర్లు
మార్కెట్లు ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ట్రేడైన మొత్తం షేర్లలో బీఎస్ఈలో 1510 లాభపడితే.. 1062 నష్టపోయాయి. మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.25 శాతం పుంజుకోగా.. స్మాల్‌ క్యాప్‌ 0.85 శాతం ఎగసింది.
ఎఫ్‌పీఐలు సైలెంట్‌
దేశీ స్టాక్స్‌లో ఇటీవల అమ్మకాలకే ప్రాధాన్యమిస్తూ వస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) బుధవారం సైలెంట్‌ అయ్యారు. నగదు విభాగంలో కేవలం రూ. 12.5 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. గత ఆరు ట్రేడింగ్‌ సెషన్లలో ఎఫ్‌పీఐలు మొత్తం రూ. 7,000 కోట్లకుపైగా  పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇదే సమయంలో రూ. 4,600 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన దేశీ ఫండ్స్ (డీఐఐలు) బుధవారం దాదాపు రూ. 291 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. Most Popular