డీఎల్‌ఎఫ్‌కు నిధుల జోష్‌!

డీఎల్‌ఎఫ్‌కు నిధుల జోష్‌!

దేశీయంగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో మరో అతిపెద్ద డీల్‌కు తెరలేచింది. అద్దె ఆదాయాల అనుబంధ సంస్థ డీఎల్‌ఎఫ్‌ సైబర్‌సిటీ డెవలపర్స్‌(డీసీసీడీఎల్‌)లో 33.34 శాతం వాటాను విక్రయించేందుకు రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌ బోర్డు శుక్రవారం సాయంత్రం అనుమతి తెలియజేసింది. దీంతో సింగపూర్‌ పెట్టుబడుల సంస్థ జీఐసీకి డీసీసీడీఎల్‌లో 33.34 శాతం వాటాను విక్రయించేందుకు మార్గం సుగమమైంది. ఈ డీల్‌ ద్వారా కంపెనీకి రూ. 11,900 కోట్లు లభించనున్నాయి. వెరసి డీసీసీడీఎల్‌ విలువ రూ. 35,617 కోట్లుగా లెక్కతేలినట్లు కంపెనీ బీఎస్‌ఈకి వెల్లడించింది. దీంతో నేటి ట్రేడింగ్‌లో డీఎల్‌ఎఫ్‌ కౌంటర్‌ వెలుగులో నిలిచే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.
వివరాలివీ..
ఈ ఏడాది మార్చిలో డీసీసీడీఎల్‌లో 40 శాతం వాటాను జీఐసీకి విక్రయించేందుకు డీఎల్‌ఎఫ్‌ తుది ప్రణాళికలు ఖరారు చేసింది. డీల్‌ విలువను రూ. 13,000 కోట్లుగా అంచనా వేసింది. అయితే తాజాగా నిర్వహించిన బోర్డు సమావేశంలో రూ. 11,900 కోట్లకు 33.34 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయించింది. కాగా.. ఈ డీల్‌ తరువాత డీసీసీడీఎల్‌లో మాతృ సంస్థ డీఎల్‌ఎఫ్‌ 66.66 శాతం వాటాను కలిగి ఉంటుంది. నిధుల్లో అత్యధిక భాగాన్ని డీఎల్‌ఎఫ్‌కున్న రుణభారాన్ని తగ్గించుకునేందుకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది. Most Popular