ఈ క్రెడిట్ కార్డులకు అస్సలు లిమిట్ ఉండదు.. తెలుసా!

ఈ క్రెడిట్ కార్డులకు అస్సలు లిమిట్ ఉండదు.. తెలుసా!

లిమిట్ లేని క్రెడిట్ కార్డ్‌లను ఆఫర్ చేస్తున్న బ్యాంక్‌లు

క్రెడిట్ కార్డులు ఉపయోగించే వారికి వాటిలో రకరకాల కార్డులు ఉంటాయనే సంగతి తెలుసు. సిల్వర్.. గోల్డ్.. ప్లాటినం.. ప్రీమియం.. ఇలా అనేక రకాల కార్డులను ఆయా కస్టమర్ల క్రెడిట్ రిపోర్ట్ ప్రకారం బ్యాంకులు అందిస్తుంటాయి. అయితే, క్రెడిట్ కార్డ్ అనగానే వాటిని ఉపయోగించేందుకు ఎంతో కొంత పరిమితి ఉండడం సహజం. ఈ క్రెడిట్ లిమిట్‌ను కూడా ఆయా వ్యక్తుల చెల్లింపు సామర్ధ్యం ఆధారంగానే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు నిర్ణయిస్తాయి. కానీ వీటన్నిటికీ మించిన క్రెడిట్ కార్డ్‌లు కొన్ని ఉంటాయి. వీటికి అసలు పరిమితి అనే మాటే ఉండదు. అంటే ఎంతైనా వాడేసుకోవచ్చన్న మాట. 

 

ఇలా అపరిమితంగా ఉపయోగించుకునేందుకు అనుమతి ఉన్న క్రెడిట్ కార్డులను సూపర్-ప్రీమియం కార్డులుగా వ్యవహరిస్తాయి బ్యాంకులు. అసలు ఇలాంటి క్రెడిట్ కార్డులు ఇవ్వడం సాధ్యమేనా అనిపించవచ్చు కానీ, ఇలాంటి కార్డులు నిజంగానే ఉన్నాయి. మన దేశంలో కూడా ఈ సూపర్-ప్రీమియం క్రెడిట్ కార్డులను బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయి. 

లగ్జరీ కాదు.. అంతకు మించి..
లగ్జరీ క్రెడిట్ కార్డ్‌లలో ఇవి అత్యున్నత స్థానంలో ఉంటాయి. వీటిలో చాలా ఎక్కువగా పరిమితి ఉండడం కానీ, లేదా అసలు లిమిట్ అనే మాటే లేకపోవడం కానీ జరుగుతుంది. అలాగే వీటితో ప్రయోజనాలు కూడా అధికంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక ఎయిర్‌పోర్ట్‌లలో ఉచితంగా లాంజ్ యాక్సెస్ ఉంటుంది. అతి తేలికగా పొందేందుకు అనేక రకాల సర్వీసులను బ్యాంకులు అందిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక గల చెఫ్స్.. మీ ఇంటికే వచ్చి వంటలు చేసిపెడతారు. గోల్ఫ్ గేమింగ్‌కు ఉచితంగా యాక్సెస్ లభిస్తుంది. బొట్టెగా, వెనెటా, కెనాలి వంటి ఎన్నో ప్రముఖమైన లగ్జరీ బ్రాండ్స్‌పై లక్షల రూపాయల విలువైన వోచర్స్ లభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ రెస్టారెంట్స్‌లో మీకు ప్రయారిటీ బుకింగ్ లభిస్తుంది. 

 

ఇవి మాత్రమే కాదు డబ్బుతో కొనలేని ఎన్నో సౌకర్యాలు కూడా ఈ సూపర్-ప్రీమియం క్రెడిట్ కార్డుల ద్వారా లభించడం విశేషం. బెస్ట్ సెల్లింగ్‌ బుక్‌ను ఆ రైటర్ ఆటోగ్రాఫ్ చేసిన కాపీనీ పొందవచ్చు. ఏదైనా కాన్సర్ట్‌కు టికెట్స్ విక్రయం పూర్తయిపోయి నిండిపోయినా, ఆ టికెట్స్ కన్‌సీర్జ్ సర్వీస్‌గా ఈ క్రెడిట్ కార్డులు అందిస్తాయి. ఈ క్రెడిట్ కార్డులు ఉన్నవారు పోల్చలేని విధంగా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే.. ఈ క్రెడిట్ కార్డులు అందరూ పొందే అవకాశం మాత్రం ఉండదనే సంగతి ఈ పాటికే అర్ధమయే ఉంటుంది. 

 

కార్డులు కూడా ఖరీదైనవే

ఈ కార్డులతో పొందే ప్రయోజనాలతో పోల్చితే, ఇప్పటివరకూ చెప్పిన సౌకర్యాలు చాలా తక్కువే. ఈ సూపర్-ప్రీమియం కార్డ్‌లను వజ్రాలు, విలువైన లోహాలతో తయారు చేస్తారంటే ఏ మాత్రం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఉదాహరణకు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్లాక్‌ కార్డ్‌ను అతి విలువైన లోహాల్లో ఒకటైన టైటానింయంతో తయారు చేస్తారు. దీన్ని ఉపయోగించేందుకు అసలు పరిమితి అనేదే ఉండదు. ఒకసారి ఓ కస్టమర్‌ చిన్నారికి.. హోలీ ల్యాండ్‌పై స్కూల్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేందుకు సాయం చేయడం కోసం.. డెడ్‌ సీ నుంచి మట్టిని సేకరించి, లండన్‌కు కొరియర్ చేసింది అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కంపెనీ. ఈ ఉదాహరణ చూస్తే.. ఇలాంటి కస్టమర్లకు బ్యాంకులు ఎంతగా సేవలు చేస్తాయనే సంగతి అర్ధమవుతుంది. 

ఇండస్ఇండ్ ఇండల్జ్ కార్డ్‌ను 22 క్యారెట్ల గోల్డ్ ఇన్‌లేతో తయారు చేస్తారు. ఖర్చు చేయడంపై దీనికి కూడా ఎలాంటి పరిమితి ఉండదు. ఛార్టర్డ్ ఫ్లైట్స్‌, యాచ్‌లలో డిస్కౌంట్లు, సెయిలింగ్ లెస్సన్స్‌తో పాటు రేర్ సూపర్ కార్స్‌ను పొందడంలో అనేక వ్యక్తిగత సౌకర్యాలను ఇండస్ఇండ్ అందిస్తుంది. ఇలాంటి సూపర్-ప్రీమియం కార్డ్‌లలో ఒకటైనా మీ దగ్గర ఉంటే, బ్యాంకులు మీకు అందించే సౌకర్యాలకు అంతే ఉండదు.

 

ఎవరికి ఈ సూపర్-ప్రీమియం కార్డులు?
ముందుగా చెప్పుకున్నట్లుగానే ఈ సూపర్-ప్రీమియం క్రెడిట్ కార్డ్‌లను పొందేందుకు, బ్యాంకులు ఆయా కస్టమర్లకు ఆహ్వానం పలుకుతాయి. బ్యాంక్ సెలక్షన్ నియమావళి ప్రకారం అర్హులుగా భావించిన వారికి కూడా ఈ కార్డులు పొందే సౌలభ్యం ఉంటుంది. హై నెట్వర్త్ కస్టమర్లను గుర్తించి, ఆ పేర్లతో ఒక జాబితాను రూపొందిస్తాయి బ్యాంకులు. అంటే, ఈ కార్డ్‌ను పొందేందుకు ఆహ్వానం రావాలంటే, ముందుగా ఆ బ్యాంక్‌ నుంచి ఏదైనా సర్వీస్‌ను పొంది ఉండాలన్న మాట. ఉదాహరణకు, ఈ కార్డ్‌ను పొందేందుకు తమ కంపెనీకి చెందిన ప్రీమియం కార్డ్‌ను ఉపయోగించన తీరును.. ఆయా ఫైనాన్షియల్ కంపెనీలు పరిశీలిస్తాయి.

సుదీర్ఘకాలం ఒక బ్యాంక్‌కు కస్టమర్‌గా ఉడడం, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌లో మీ అనుభవాన్ని పరిగణించి.. వేరే బ్యాంక్‌ నుంచి మీకు ఆహ్వానం లభించవచ్చు. బ్యాంకులు ఆహ్వానం పలికే జాబితాలో పేరు లేకపోయినా, మీరు హై నెట్వర్త్ ఇండివిండ్యువల్(హెచ్ఎన్ఐ) కాకపోయినా ఈ కార్డును పొందడం దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. అసలు ఈ కార్డ్‌లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా పలు బ్యాంకులు కల్పించవంటే ఆశ్చర్యం లేదు.

 

స్నాబ్ వాల్యూ
సూపర్-ప్రీమియం కార్డులను పొందగలిగితే, వాటితో లభించే సూపర్ లగ్జరీలకు అంతే ఉండదు. అల్ట్రా హై-నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ కోరుకునే ట్రావెల్, ఎంటర్టెయిన్మెంట్, డైనింగ్, హై-ఎండ్ లగ్జరీ రిటైల్ సహా పలు అత్యున్నత అనుభవాలను పొందేందుకు ఈ సూపర్-ప్రీమియం కార్డులు సహకరిస్తాయి.

 

ఫీజులు కూడా ఎక్కువే
సాధారణంగా ఆయా క్రెడిట్ కార్డులకు వార్షిక రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఈ సూపర్-ప్రీమియం కార్డ్‌లకు అయితే ఈ మొత్తం భారీగానే ఉంటుంది. ఇది రూ. 10 వేల నుంచి రూ. 4 లక్షల వరకు యాన్యువల్ ఫీజ్ వసూలు చేస్తారంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అయితే ఈ అధిక ఫీజును వోచర్స్, డిస్కౌంట్స్, డీల్స్, ప్రత్యేకమైన సర్వీసుల రూపంలో తిరిగి చెల్లించేందుకే ప్రయత్నిస్తాయి బ్యాంకులు. అంటే ఏదైనా ప్రత్యేకమైన ప్రయోజనాలను పొందాలని కోరుకునే వారికి ఈ కార్డ్‌లు ఉపయోగంగా ఉంటాయన్న మాట. అయితే, ఇప్పటికే ఎక్స్‌క్లూజివ్ క్లబ్స్‌లలో మెంబర్‌షిప్ కలిగిన ఆయా హెచ్‌ఎన్‌ఐలకు ఇలాంటి కార్డ్‌లతో పెద్దగా ప్రయోజనం ఉండదు.

సూపర్ ప్రీమియం కార్డులలో కొన్ని!

 ఏ కార్డుపై ఏంటి ఆఫర్! 
కార్డ్ జాయినింగ్ ఫీ యాన్యువల్ ఫీ ప్రత్యేకత ఏంటి?
అమెక్స్ బ్లాక్ ఛార్జ్ కార్డ్

7500

యూఎస్ డాలర్లు

2500

యూఎస్ డాలర్లు

అరుదైన, ప్రతిష్టాత్మకమైన కార్డ్.

పబ్లిక్‌కు అతి తక్కువ

సమాచారం మాత్రమే తెలుసు.

సూపర్ రిచ్‌కు మాత్రమే 

ఇండస్ఇండ్ ఇండల్జ్ కార్డ్ రూ. 1-2 లక్షలు రూ.10,000

ఇంటికే సెలబ్రిటీ చెఫ్స్,

24X7 ప్రత్యేకమైన సేవలు,

ఫ్రీ గోల్ఫ్, ప్రీమియం క్లబ్ యాక్సెస్

సిటి బ్యాంక్ ప్రెస్టీజ్ NA రూ.20,000

 బోనస్ ఎయిర్ మైల్స్,

కాంప్లిమెంటరీ హోటల్ స్టే,

అన్‌లిమిటెడ్ లాంజ్ యాక్సెస్,

ఫైన్ డైనింగ్

హెచ్‌డీఎఫ్‌సీ ఇన్‌ఫీనియా NA రూ.10,000

అడిగినంత క్రెడిట్ లిమిట్,

అన్‌లిమిటెడ్ లాంజ్ యాక్సెస్

యస్ బ్యాంక్ ఫస్ట్ ఎక్స్‌క్లూజివ్ NA రూ.10,000

ప్రీమియం డైనింగ్,

ఫ్రీ గోల్ఫ్,

ప్రత్యేకమైన సర్వీసులు,

ఇన్సూరెన్స్ కవరేజ్

 

ప్రీమియం వర్సెస్ కో-బ్రాండెడ్ కార్డ్స్
కో-బ్రాండెడ్ కార్డ్స్‌తో కూడా పలు రకాల ప్రయోజనాలను ఆయా కంపెనీల నుంచి పొందే అవకాశం కస్టమర్లకు ఉంది. లాంజ్ యాక్సెస్‌ల వంటివి ట్రావెల్‌ కార్డ్‌తో పాటే అందుతాయి. మరి ఈ సూపర్-ప్రీమియం కార్డులకు ఇంతేసి వార్షిక ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఏముంటుంది అనే ప్రశ్న ఎదురవుతుంది. అయితే, ఆయా కార్డులకు కొన్ని పరిమితులు ఉంటాయి. బిజినెస్ క్లాస్ టికెట్‌పై కొంత శాతం తగ్గింపు, అన్‌లిమిటెడ్ లాంజ్ యాక్సెస్‌లు ఇతర కార్డులతో కూడా పొందవచ్చు. కానీ బ్యాంకులతో ఆహ్వానం అందుకుని ఓ ప్రత్యేకమైన కార్డ్‌ను పొందడం అనే విషయం మాత్రం ఎమోషనల్‌గా కట్టిపడేసే అంశం. పైగా లక్షలు, కోట్ల కొద్దీ ఖరీదు చేసే యాచ్‌నో, ఛార్టర్డ్ ఫ్లైట్‌నో ఒక్క కార్డ్ స్వైప్‌తో కొనుగోలు చేయడం అంటే మాటలా! స్టార్స్ పెర్ఫామ్ చేసే రెస్టారెంట్స్‌లో వెయిటింగ్ పీరియడ్ లేకుండా, వెంటనే టేబుల్ బుక్ చేసుకునే అవకాశం అందరికీ వస్తుందా!

కో-బ్రాండెడ్ కార్డ్స్‌లో, ప్రత్యేకంగా ఎయిర్‌లైన్ కార్డ్స్‌లో ఎన్నో విశేషమైన ప్రయోజనాలు ఉంటాయి. ఈ కో-బ్రాండెడ్ కార్డుల ద్వారా ఆ కార్డ్ కంటే ఆ బ్రాండ్ ద్వారానే ఎక్కువ ప్రయోజనం లభిస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఫెరారి ఆఫర్ చేసే కో-బ్రాండెడ్ కార్డ్‌ను చెప్పుకోవచ్చు

ఫెరారీ అంటే అదో అద్భుతమైన కార్. మీ దగ్గర ఈ కో-బ్రాండెడ్ కార్డ్ ఉంటే మీరు ఫ్యాన్‌గా అయినా కొనసాగచ్చు, లేదా ఏదో ఒక రోజు దానికి ఓనర్‌గా మారచ్చు. ఈ కో బ్రాండెడ్ కార్డ్‌తో ప్రయోజనం పొందాలంటే, ఆ బ్రాండ్‌ను అధికంగా ఉపయోగించాల్సి ఉంటుందని.

అయితే సూపర్ ప్రీమియం కార్డులను పొందే అవకాశం మాత్రం అందరికీ ఉండదని అత్యధిక వ్యక్తిగత సంపద కలిగిన వ్యక్తులకు(అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్)కు మాత్రమేననే విషయంలో సందేహం అక్కర్లేదు. ప్రపంచంలోనే అత్యుత్తమం అనిపించే అనేక సదుపాయాలను ఈ కార్డులు కలిగిన వ్యక్తులకు బ్యాంకులు అందిస్తాయి.
 Most Popular