అద్దె ఇంటికీ ఇన్సూరెన్స్ చేయచ్చని తెలుసా!

అద్దె ఇంటికీ ఇన్సూరెన్స్ చేయచ్చని తెలుసా!

జీవిత బీమా.. ఆరోగ్య బీమా.. వాహన బీమా.. ప్రమాద బీమా.. ఇలా ఇన్సూరెన్స్‌లో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయని చాలామందికే తెలుసు. ఇలాంటిదే హోమ్ ఇన్సూరెన్స్ కూడా. భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం జరిగినా.. ఆస్తులకు నష్టం వాటిల్లకుండా ఇంటికి బీమా తీసుకునే సదుపాయం ఉంది. అయితే.. మరి అద్దె ఇంటిలో ఉన్న వారి పరిస్థితి ఏంటి? అద్దె ఇంట్లో ఉన్నవారివి ఆస్తులు కావా? వారికి నష్టం వాటిల్లదా? అగ్ని ప్రమాదాల లాంటివి జరిగితే వారు నష్టపోవాల్సిందేనా? 

 

ఈ  ప్రశ్నలకు కచ్చితంగా కాదు అనే సమాధానం చెప్పాలి. ఎందుకంటే అద్దె ఇంటిలో ఉన్నా సరే ఆస్తులను కాపాడుకునేందుకు బీమా తీసుకోవచ్చని చాలా తక్కువ మందికే తెలుసు. రెంటార్ ఇన్సూరెన్స్ లేదా టెనెంట్ ఇన్సూరెన్స్‌గా పిలిచే ఈ బీమా ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రమాదాల్లో ఆస్తులను నష్టపోవడమే కాదు.. కిరాయికి ఉన్న సమయంలో ఇంటికి ఏదైనా నష్టం వాటిల్లితే.. దానికి కూడా యజమానికి పరిహారం అందించే ప్రత్యేకమైన ప్రయోజనలు ఉన్న బీమా ఇది.

 

సహజంగా ఇంటిలో అద్దెకు ఉన్న సమయంలో సామాగ్రికి ఏదైనా నష్టం వాటిల్లితే, ఖాళీ చేసినపుడు దానిని అలాగే వదిలేయడం.. అందుకు తగినంత మొత్తంలో పరిహారాన్ని అద్దెదారులు చెల్లించిన అడ్వాన్స్ నుంచి యజమానులు మినహాయించడం జరుగుతుంది. టెనెంట్ ఇన్సూరెన్స్ ద్వారా ఇలాంటి అవసరం కూడా ఉండదు. ఆ మొత్తాన్ని బీమా కంపెనీ భరించే సౌలభ్యం ఉంటుంది.

 

కొన్నేళ్ల క్రితం వరకు ఇలాంటి బీమా సదుపాయం మన దేశంలో ఉండేది కాదు. కానీ ప్రైవేట్ బీమా కంపెనీల మధ్య పోటీ పెరిగిపోయిన తర్వాత, ఈ టెనెంట్ ఇన్సూరెన్స్ కూడా మన దేశంలో ప్రవేశించింది. 

 

బజాజ్ అలియాంజ్, భారతీ యాక్సా, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో, ఐసీఐసీఐ లాంబార్డ్, ఎస్‌బీఐ, టాటా ఏఐజీ, చోళ ఎంఎస్, ఫ్యూచర్ జనరాలి, ఇఫ్‌కో టోకియో, ఓరియెంటల్ ఇన్సూరెన్స్, రిలయన్స్, రాయల్ సుందరం కంపెనీలు ప్రస్తుతం హోమ్ ఇన్సూరెన్స్ కల్పిస్తున్నాయి. అయితే, వీటిలో అనేకం అద్దెదారులకు కేవలం ఇంటిలోని వస్తువులకు మాత్రమే బీమా సదుపాయం కల్పిస్తున్నాయి. కొన్ని మాత్రం బిల్డింగ్‌కు జరిగే నష్టానికి కూడా బీమా తీసుకునే సౌకర్యం కల్పిస్తున్నాయి.

 

ఏమిటీ టెనెంట్ ఇన్సూరెన్స్?
అద్దెకు ఉంటున్నా.. మనం ఉన్నంత కాలం ఆ ఇల్లు/అపార్ట్‌మెంట్ బాధ్యతలు మనపైనే ఉంటాయనే విషయం గుర్తుంచుకోవాలి. దొంగతనం, అగ్ని ప్రమాదం, ప్రకృతి బీభత్సం వంటివేవీ చెప్పి రావు.. తెలిసి జరగవు. అందుకే రెంటర్స్ ఇన్సూరెన్స్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అనుకోకుండా జరిగే ఘటనల నుంచి రక్షణ కల్పిస్తుంది. సహజంగా తాము నివాసం ఉండని ఇళ్లకు యజమానులు ల్యాండ్‌లార్డ్ ఇన్సూరెన్స్‌ మాత్రమే తీసుకుంటారు. మరి ఇంటిలోని వస్తువుల మాటేంటి? అద్దెకు ఉండేవారి ఆస్తులకు రక్షణ కల్పించేదే రెంటర్స్ ఇన్సూరెన్స్.

వేటివేటికి కవరేజ్ లభిస్తుంది?
బీమా కంపెనీని అనుసరించి కవరేజ్‌లో తేడా ఉండొచ్చు. అయితే, సహజంగా అద్దెదారుల బీమాలో ఈ సౌకర్యాలు ఉంటాయి:

కంటెంట్ కవరేజ్: ఇంటిలోని వస్తువులను మరమ్మత్తు చేయించేందుకు, తీవ్రంగా నష్టపోతే తిరిగి రీప్లేస్ చేసేందుకు ఉపయోగపడే బేసిక్ ప్రీమియం ప్లాన్ ఇది.

లయబిలిటీ కవరేజ్: ఇంటిలోని వ్యక్తులు కానీ, అతిథులు కానీ ఇంటికి ఏదైనా నష్టం చేకూరిస్తే, దాని మరమ్మత్తుల కోసం అదనపు ప్రీమియంతో పొందే సౌకర్యం ఇది. అలాగే ఇంటిలో వ్యక్తులు గాయాలకు గురైనా వారికి కూడా బీమా సదుపాయం లభిస్తుంది.

స్పెషల్ కవరేజ్: బేసిక్, లయబిలిటీల కంటే అధికంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్స్, జ్యూవెలరీ, ఎక్విప్‌మెంట్‌, ఇతర వస్తువులు ఇందులో కవర్ అవుతాయి.

 

టెనెంట్ ఇన్సూరెన్స్ ద్వారా ప్రయోజనం ఏంటి?
దుస్తులు, గృహోపకరణాలు, ఫర్నిచర్ వంటివి దొంగతనానికి గురయినా/పాడయినా వాటిని రీప్లేస్ చేస్తారు.
అద్దె ఇంటిలో ఇతర వ్యక్తులు ఉన్నపుడు వారికి ఏదైనా గాయాలు జరిగినా, వారికి ఏదైనా ఆస్తి నష్టం జరిగినా పరిహారం దక్కుతుంది.

 

  • ప్రస్తుతం ఉన్న ఇంటికి జరిగిన నష్టం కారణంగా, వేరే ఇంటికి మారాలని అద్దెదారుడు నిర్ణయించుకున్నపుడు, ఇల్లు మారే ఖర్చులు కూడా బీమా ద్వారానే లభిస్తాయి.
  • ఇంటికి సంబంధించి ప్రమాదవశాత్తూ జరిగే నష్టానికి కూడా పరిహారం వస్తుంది.
  • నగలు వంటి వ్యక్తిగత ఆస్తులకు ఇంటిలోనే కాదు.. ప్రయాణాల్లో ఉన్నపుడు కూడా బీమా వర్తిస్తుంది.
  • బిల్డింగ్, ఇంటి యజమానికి సంబంధించిన ఆస్తులకు వాటిల్లే నష్టం కూడా బీమా పరిధిలోకి వస్తుంది.

టెనెంట్ ఇన్సూరెన్స్ తీసుకునేపుడు ఏఏ అంశాలు పరిశీలించాలి?

  • మీరు ఉండే ఇంటిలోని ఆస్తులకు నష్టం వాటిల్లితే వాటిని రీప్లేస్ చేసేందుకు నిర్ణయించిన ధర.
  • లయబిలిటీ క్లెయిమ్స్‌పై రక్షణ.
  • ఖరీదైన వస్తువులకు ప్రత్యేకమైన కవరేజ్ అవసరం.
  • మీ వ్యక్తిగత ఆస్తుల ఫోటోలను తీసి భద్రపరచుకోవాలి.
  • అగ్ని మాపక యంత్రం, ఇతర భద్రతా వస్తువులు అందుబాటులో ఉండాలి.
  • మీ బంధువు కాని ఓ దగ్గరి వ్యక్తి అందుబాటులో ఉండాలి.

 

సరైన కవరేజ్ పొందేందుకు ఈ పాయింట్స్‌ను జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఈ తరహా బీమా మన దేశంలో ప్రవేశించేందుకు చాలా ఎక్కువ సమయమే పట్టింది. ఒకవైపు బీమా తీసుకునే వ్యక్తులు అంతగా ఆసక్తి చూపకపోవడం, బీమాకు మన దగ్గర ఆదరణ తక్కువ కావడమే ఇందుకు కారణాలు చెప్పవచ్చు. సహజంగా నష్టం వాటిల్లినపుడు ఆ కొంత మొత్తం మనం భరిస్తే సరిపోతుందనే భావనే చాలా మందిలో ఉంటుంది. అయితే, ప్రస్తుతం ప్రజల ఆలోచనా విధానాల్లో కూడా మార్పు వస్తోంది. అయితే, ఇలా హోమ్ ఇన్సూరెన్స్‌లో కూడా కొన్నిటికి కవరేజ్ ఉండదనే విషయాన్ని గుర్తించాలి.

వీటికి బీమా వర్తించదు
ఉద్దేశ్యపూర్వకంగా ఆస్తులను నాశనం చేయడం
వినియోగం కారణంగా పాడయిపోయే వస్తువులు
యుద్ధం కారణంగా ఆస్తులను నష్టపోవడం
నిర్ణీత కాలంపాటు ఆ ఇంటిలో నివసించకపోవడం
నగదు, పురాతన వస్తువులు, ప్రత్యేకంగా సేకరించిన వస్తువులు
 Most Popular