విదేశీ ఆందోళనలు- 1,100 పాయింట్లకు నీళ్లు!

విదేశీ ఆందోళనలు- 1,100 పాయింట్లకు నీళ్లు!

ఎలాంటి కార్యకలాపాలులేని డొల్ల(షెల్‌) కంపెనీలపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కన్నెర్ర చేయడంతో బలహీనపడ్డ సెంటిమెంటు విదేశీ ఆందోళనలు జత కలవడంతో గత వారం మరింత దిగజారింది. మొత్తం 331 షెల్‌ కంపెనీలను గుర్తించిన కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ జాబితాను సెబీకి అందించడంతో మార్కెట్‌ వర్గాలలో ఆందోళనలు మొదలయ్యాయి. వీటిపై చర్యలు తీసుకోవాలని సెబీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సూచించింది. గ్రేడ్‌ 4లోకి వీటిని మార్చాలని ఆదేశించింది. దీంతో ఈ స్టాక్స్‌లో నెల రోజుల్లో ఒకసారి మాత్రమే ట్రేడింగ్‌కు వీలుకానుంది. కీలక స్థాయిలను కోల్పోయాయ్‌!
మరోవైపు ఉత్తర కొరియా- అమెరికా మధ్య యుద్ధమేఘాలు తీవ్రకావడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు స్టాక్స్‌లో అమ్మకాలకు తెరతీశారు. ఫలితంగా అమెరికాసహా ఆసియా వరకూ మార్కెట్లన్నీ పతనబాటపట్టాయి. వెరసి సెన్సెక్స్‌ వారం మొత్తంగా 1,112 పాయింట్లు దిగజారింది. 32,000 పాయింట్ల మైలురాయిని వొదులుకుంది. నిఫ్టీ సైతం 356 పాయింట్లు పతనమైంది. సాంకేతికంగా కీలకమైన 10,000 పాయింట్ల ఎగువ నుంచి 9,700 స్థాయికి పడిపోయింది. సెన్సక్స్‌ 31,213 వద్ద నిలవగా.. నిఫ్టీ 9,711 వద్ద స్థిరపడింది.
బ్లూచిప్స్‌ పతనం
క్యూ1లో మొండిబకాయిలు పెరగడంతో స్టేట్‌బ్యాంక్‌ స్టాక్‌ వారం మొత్తంమీద 8 శాతం పతనంకాగా.. ప్రయివేట్‌ రంగ బ్యాంకులు యాక్సిస్‌, ఐసీఐసీఐ 3 శాతంపైగా క్షీణించాయి. ఆటో స్టాక్స్‌లో ఎంఅండ్‌ఎం, మారుతీ, హీరోమోటో, బజాజ్‌ ఆటో 5-3 శాతం మధ్య నీరసించాయి. ఇక ఫలితాలు నిరాశ పరచడంతో టాటా మోటార్స్‌ 14 శాతం కుప్పకూలింది. ఈ బాటలో సన్‌ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌ 11 శాతం, లుపిన్‌ 5 శాతం, సిప్లా 4.3 శాతం పతనంకాగా... టాటా స్టీల్‌ 3.6 శాతం ఎగసింది. ఇదే విధంగా అదానీ పోర్ట్స్‌ 6 శాతం, కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ 5 శాతం చొప్పున తిరోగమించాయి.Most Popular