ఇక ఫైనాన్షియల్ రిజల్ట్స్ నడిపించాలి

ఇక ఫైనాన్షియల్ రిజల్ట్స్ నడిపించాలి

ఉత్తర కొరియా- అమెరికా మధ్య ప్రస్తుతం నెలకొన్న యుద్ధవాతావరణం ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు రేపింది. దీంతో అమెరికాసహా ఆసియా వరకూ స్టాక్‌ మార్కెట్లు గత వారం పతనమయ్యాయి. ఫలితంగా దేశీ స్టాక్‌ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ సైతం 1,000 పాయింట్లకుపైగా దిగజారింది. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు చేపడితే అంతర్జాతీయ స్థాయిలో సెంటిమెంటుకు దెబ్బతగులుతుందని ఇది దేశీయంగానూ ప్రభావం చూపుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే వచ్చే వారం దేశీయంగా పలు ఆర్థిక గణాంకాలు వెలువడనున్నాయి. సోమవారం(14న) జూలై నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) గణాంకాలు వెల్లడికానున్నాయి. మే నెలలో నమోదైన 2.17 శాతం నుంచి జూన్‌లో 0.9 శాతానికి డబ్ల్యూపీఐ మందగించిన సంగతి తెలిసిందే. ఈ బాటలో జూలై నెలకు రిటైల్‌ ధరల వినియోగ ద్రవ్యల్బణం(సీపీఐ) వివరాలు సైతం విడుదలకానున్నాయి. సీపీఐ జూన్‌లో 2.18 శాతం నుంచి 1.54 శాతానికి బలహీనపడింది.
ట్రేడింగ్‌ నాలుగు రోజులే
వచ్చే వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితంకానుంది. మంగళవారం(15న) స్వాతంత్ర్య దినోత్సవం కారణంగా బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు ప్రకటించారు. కాగా బుధవారం అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్‌ గత పాలసీ వివరాలు(మినిట్స్‌ ) వెల్లడికానున్నాయి. 
ఐఐపీ ఎఫెక్ట్‌
శుక్రవారం(11న) జూన్‌ నెల పారిశ్రామికోత్పత్తి ప్రగతి(ఐఐపీ) వివరాలు వెల్లడయ్యాయి. వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) అమలు నేపథ్యంలో ఐఐపీ 0.1 శాతం క్షీణించింది. 2013 జూన్‌ తరువాత మళ్లీ కనిష్ట స్థాయిలో నమోదైంది. కేపిటల్‌ గూడ్స్‌ రంగం 6.77 శాతంమేర వెనకడుగు వేయడం ప్రభావం చూపింది. కాగా.. ఐఐపీ ప్రభావం సోమవారం ట్రేడింగ్‌పై ప్రతిఫలించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఆర్థిక గణాంకాలతోపాటు వర్షపాత విస్తరణకూ ప్రాధాన్యమున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 9కల్లా దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణ సగటుకంటే 3 శాతం తక్కువగా నమోదైంది.
ఫలితాలూ కీలకమే
అదానీ పోర్ట్స్‌ నేడు క్యూ1 ఫలితాలు విడుదల చేయనుండగా.. సోమవారం గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, కోల్‌ ఇండియా, టాటా పవర్‌ ఈ ఏడాది తొలి త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి. వచ్చే వారం ఈ అంశాలతోపాటు ముడిచమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం, ఎఫ్‌పీఐల పెట్టుబడుల తీరు వంటి అంశాలు సైతం మార్కెట్లను ప్రభావితం చేయగలవని విశ్లేషకులు తెలియజేశారు. Most Popular