భారీ నష్టాల ముగింపు- నెల రోజుల కనిష్టం!

భారీ నష్టాల ముగింపు- నెల రోజుల కనిష్టం!

యూరప్‌సహా ఆసియా మార్కెట్లన్నీ అమ్మకాలతో కుదేలవడంతో దేశీయంగానూ సెంటిమెంటుకు దెబ్బ తగిలింది. దీంతో అమ్మకాలు ఉపశమించకపోగా.. పెరగడంతో మార్కెట్లు బేర్‌మన్నాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 318 పాయింట్లు పతనమై 31,213 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 109 పాయింట్లు పడిపోయి 9,711 వద్ద ముగిసింది. ఉత్తర కొరియా- అమెరికా మధ్య కమ్ముకుంటున్న యుద్ధమేఘాలతో ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు జోరందుకున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. ఇంట్రాడేలో సాంకేతిక నిపుణులు కీలకంగా భావించే 9,700 స్థాయినీ నిఫ్టీ కోల్పోవడం ప్రస్తావించదగ్గ అంశం. 
ప్రభుత్వ బ్యాంకులు బోర్లా
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ డీలాపడగా.. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీ అమ్మకాలు నమోదయ్యాయి. దీంతో పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 5 శాతం దిగజారింది. ఈ బాటలో మెటల్ 3.4 శాతం‌, ఆటో 1.4 శాతం చొప్పున పతనమయ్యాయి. నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, వేదాంతా, స్టేట్‌బ్యాంక్‌, బాష్‌, బీవోబీ, ఎంఅండ్‌ఎం, జీ, సన్‌ ఫార్మా, ఓఎన్‌జీసీ, ఆర్‌ఐఎల్‌ 6.7-2.5 శాతం మధ్య పడ్డాయంటే అమ్మకాల తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. అయితే డాక్టర్‌ రెడ్డీస్‌, అరబిందో, గెయిల్‌, బీపీసీఎల్‌, యస్‌బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌, విప్రో, అల్ట్రాటెక్‌ 4-0.5 శాతం మధ్య బలపడ్డాయి. మార్కెట్ల బాటలో చిన్న షేర్లు డీలాపడ్డాయి. బీఎస్‌ఈలో ట్రేడైన మొత్తం షేర్లలో 1,549 నష్టపోతే.. 979 లాభపడ్డాయ్‌.
ఎఫ్‌ఐఐల అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం రూ. 841 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) గురువారం మరోసారి రూ. 1171 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ విక్రయించారు. మరోవైపు బుధవారం రూ. 553 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేసిన దేశీ ఫండ్స్‌(డీఐఐలు) గురువారం దాదాపు రూ. 872 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి.Most Popular