9700కూ నిఫ్టీ నీళ్లు- బ్యాంక్స్‌, మెటల్స్‌ బేర్‌

9700కూ నిఫ్టీ నీళ్లు- బ్యాంక్స్‌, మెటల్స్‌ బేర్‌

యూరప్‌సహా ఆసియా మార్కెట్లన్నీ అమ్మకాలతో కుదేలవడంతో దేశీయంగానూ సెంటిమెంటుకు దెబ్బ తగిలింది. దీంతో అమ్మకాలు ఉపశమించకపోగా.. పెరగడంతో మార్కెట్లు బేర్‌మంటున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 357 పాయింట్లు పతనమై 31,174కు చేరగా.. నిఫ్టీ 123 పాయింట్లు పడిపోయి 9,697 వద్ద ట్రేడవుతోంది. తద్వారా సాంకేతిక నిపుణులు కీలకంగా భావించే 9,700 స్థాయినీ కోల్పోయింది. 
ప్రభుత్వ బ్యాంకులు బోర్లా
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ డీలాపడగా.. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీ అమ్మకాలు కనిపిస్తున్నాయి. దీంతో పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 5 శాతం దిగజారింది. ఈ బాటలో మెటల్‌, ఆటో, రియల్టీ రంగాలు 2-1 శాతం మధ్య పతనమయ్యాయి. నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, వేదాంతా, స్టేట్‌బ్యాంక్‌, బాష్‌, బీవోబీ, ఎంఅండ్‌ఎం, ఓఎన్‌జీసీ, ఆర్‌ఐఎల్‌, హెచ్‌యూఎల్‌, ఐషర్‌ 7.4-2.2 శాతం మధ్య పడ్డాయంటే అమ్మకాల తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. అయితే డాక్టర్‌ రెడ్డీస్‌, బీపీసీఎల్‌, అరబిందో, ఇన్ఫోసిస్‌, గెయిల్‌, విప్రో, పవర్‌గ్రిడ్‌, అల్ట్రాటెక్‌ 3-0.5 శాతం మధ్య బలపడ్డాయి.Most Popular